ఐరాస ప్రధాన కార్యదర్శులు

ఐరాస ప్రధాన కార్యదర్శులు


ఐక్యరాజ్యసమితి (ఐరాస) ప్రధాన కార్యదర్శి (జనరల్ సెక్రటరీ)... ఆ సంస్థ నాయకుడిగా వ్యవహరిస్తారు. వీరి పదవీ కాలం ఐదేళ్లు. ఐరాస నూతన ప్రధాన కార్యదర్శిగా పోర్చుగల్ మాజీ ప్రధాని ఆంటోనియో గ్యుటెరస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఐరాస ప్రధాన కార్యదర్శులుగా పనిచేసిన ఎనిమిది మంది వివరాలు..

 

 ట్రిగ్వెలీ

 నార్వేకు చెందిన ట్రిగ్వెలీ 1946, ఫిబ్రవరి 2 నుంచి 1952, నవంబర్ 10 వరకు ఐరాస తొలి ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. పదవీ కాలంలో ఇజ్రాయెల్‌కు పూర్తి మద్దతిచ్చారు. కొరియా యుద్ధం (1950-1953)లో ఐరాస సైనిక జోక్యాన్ని సమర్థించారు. అయితే దాన్ని సోవియట్ యూనియన్ తీవ్రంగా వ్యతిరేకించడంతో 1952లో రాజీనామా చేశారు. ఈయన రచించిన ‘ఇన్ ది కాజ్ ఆఫ్ పీస్’ పుస్తకం 1954లో  ప్రచురితమైంది. టిగ్వెలీ 1968, డిసెంబర్ 30న మరణించారు.

 

 డ్యాగ్ హామ్మర్‌‌సజోల్డ్

 స్వీడన్‌కు చెందిన ఈయన 1953, ఏప్రిల్ 10 నుంచి 1961, సెప్టెంబర్ 18 వరకు ఐరాస రెండో ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1961లో కాంగో వెళ్తుండగా విమాన ప్రమాదంలో మరణించారు. ఇప్పటి వరకు ఈ పదవిలో కొనసాగుతూ మరణించిన ఏకైక వ్యక్తి ఈయనే. ఆమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్. కెన్నడీ.. ఈ శతాబ్దపు అతి గొప్ప రాజనీతిజ్ఞుడని హామ్మర్‌‌సజోల్డ్‌ను అభివర్ణించారు. 1961లో మరణానంతరం జోల్డ్‌కు నోబెల్ శాంతి బహుమతి లభించింది. యునెటైడ్  నేషన్‌‌స లైబ్రరీని డ్యాగ్ హామ్మర్‌‌సజోల్డ్ లైబ్రరీగా పిలుస్తున్నారు. 1997లో ఐరాసలోని భద్రతామండలి డ్యాగ్ హామ్మర్‌‌సజోల్డ్ మెడల్‌ను ఏర్పాటు చేసింది. ఐరాస శాంతి స్థాపన కార్యకలాపాల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి దీన్ని అందిస్తారు. ఈ అవార్డును 1998లో తొలిసారి ముగ్గురికి మరణానంతరం ప్రదానం చేయగా అందులో జోల్డ్ కూడా ఉండటం విశేషం.

 

 యు థాంట్

 ఈయన బర్మాకు చెందిన దౌత్యవేత్త. 1961, నవంబర్ 30 నుంచి1971, డిసెంబర్ 31 వరకు ఐరాస మూడో ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఈ పదవిని నిర్వహించిన తొలి ఐరోపాయేతర వ్యక్తిగా గుర్తింపు పొందారు.     1962లో క్యూబాక్షిపణి సంక్షోభ సమయంలో అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్. కెన్నెడీ, సోవియట్ యూనియన్ ప్రధాని నికితా కృశ్చేవ్‌ల మధ్య చర్చలకు కృషి చేసి మరో యుద్ధం రాకుండా నివారించగలిగారు. 1966లో రెండోసారి ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యాక వియత్నాం యుద్ధంలో అమెరికా చర్యలను తీవ్రంగా విమర్శించారు. 1974, నవంబర్ 25న యు థాంట్ కన్నుమూశారు. ఈయనకు అంతర్జాతీయ అవగాహనకు ఇచ్చే జవహర్‌లాల్ నెహ్రూ అవార్డు

 (1965), గాంధీ శాంతి బహుమతి (1972) లభించాయి.

 

 కుర్‌‌ట వాల్దీమ్


 ఆస్ట్రియాకు చెందిన వాల్దీమ్ 1972, జనవరి 1 నుంచి1981, డిసెంబర్ 31 వరకు ఐరాస నాలుగో ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. ఉత్తర కొరియాలో (1979) పర్యటించిన తొలి ప్రధాన కార్యదర్శిగా గుర్తింపు పొందారు. ఐరాస ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ పొందిన తర్వాత 1986 నుంచి 1992 వరకు  ఆస్ట్రియా అధ్యక్షుడిగా పనిచేశారు. 2007, జూన్ 14న  కన్నుమూశారు.

 

 జేవియర్ పెరెజ్ డి కుల్లర్

 పెరూకి చెందిన కుల్లర్ 1982, జనవరి 1 నుంచి 1991, డిసెంబర్ 31 వరకు ఐరాస ఐదో ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. బ్రిటన్, అర్జెంటీనాల మధ్య జరిగిన ఫాక్‌ల్యాండ్‌‌స యుద్ధానంతరం.. ఆ రెండు దేశాల          మధ్య శాంతి చర్చల్లో కీలక పాత్ర పోషించారు. నమీబియా స్వాతంత్య్రం పొందడంలో ప్రధాన భూమిక వహించారు. 1988లో ఇరాన్-ఇరాక్‌ల మధ్య కాల్పుల విరమణ  ఒప్పందం కోసం చర్చలు జరిపారు. ఐరాస ప్రధాన          కార్యదర్శిగా పదవీ విరమణానంతరం 2000 నవంబర్ 22 నుంచి 2001, జూలై 28 వరకు పెరూ ప్రధానిగా పనిచేశారు.

 

 బౌత్రోస్ బౌత్రోస్ ఘలీ

 ఈయన ఈజిప్ట్‌కు చెందిన రాజకీయ నాయకుడు, దౌత్యవేత్త. 1992, జనవరి 1 నుంచి1996, డిసెంబర్ 31 వరకు ఐరాస ఆరో ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అమెరికా తిరస్కరించడంతో ఘలీ రెండోసారి ఎన్నిక కాలేకపోయారు. ఫలితంగా ఇప్పటివరకు ఐరాస ప్రధాన కార్యదర్శిగా రెండోసారి ఎన్నిక కాని వ్యక్తిగా గుర్తింపు పొందారు. 1994లో రువాండాలో జరిగిన నరమేధాన్ని నివారించలేకపోయారనే విమర్శలకు గురయ్యారు. ఇందులో పది లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. యుగోస్లేవియా విచ్ఛిన్నం తర్వాత జరిగిన యుద్ధాల్లో కూడా ఘలీ ప్రభావవంతంగా వ్యవహరించలేదనే విమర్శలున్నాయి. ఘలీ 2016, ఫిబ్రవరి 16న కైరోలో మరణించారు.

 

 కోఫీ అన్నన్

  ఘనా దేశస్తుడైన కోఫీ అన్నన్  1997, జనవరి 1 నుంచి 2006, డిసెంబర్ 31 వరకు ఐరాస ఏడో ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2001లో కోఫీ అన్నన్‌కు, ఐక్యరాజ్యసమితికి సంయుక్తంగా నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఐక్యరాజ్యసమితిని శక్తిమంతంగా తీర్చిదిద్దడం, ఆఫ్రికాలో ఎయిడ్‌‌స వ్యాధిని నియంత్రించడం, మానవ హక్కుల పరిరక్షణకు కృషిచేయడం వంటి అంశాల్లో అన్నన్‌కు నోబెల్ శాంతి బహుమతి లభించింది.

 

 ఈయన  జెనీవాలో కోఫీ అన్నన్ ఫౌండేషన్‌ను (2007) స్థాపించారు. ఇది లాభాపేక్ష లేని సంస్థ. ప్రపంచ శాంతి, ఉత్తమ పాలన కోసం కృషి చేస్తుంది. కోఫీ అన్నన్ 2007 నుంచి నెల్సన్ మండేలా స్థాపించిన ‘ది ఎల్డర్‌‌స’ (లండన్) అనే ప్రభుత్వేతర సంస్థకు చైర్మన్‌గా కొనసాగుతున్నారు. వాతావరణ మార్పులు, ఎయిడ్‌‌స, పేదరికం వంటి ప్రపంచ సమస్యలపై ఇది పోరాటం చేస్తుంది.

 

 బాన్ కీ మూన్

 దక్షిణ కొరియాకు చెందిన బాన్ కీ మూన్ 2007, జనవరిలో ఐరాస ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2012లో రెండోసారి ఎన్నికయ్యారు. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు ఈ పదవిలో కొనసాగుతారు. వాతావరణ మార్పులు, భూతాపం వంటి సమస్యలపై కృషిచేస్తున్నారు.

 

 ఆంటోనియో గ్యుటెరస్

 ఇటీవల భద్రతామండలి నిర్వహించిన ఓటింగ్‌లో పోర్చుగల్ మాజీ ప్రధాని ఆంటోనియో గ్యుటెరస్ ఐరాస తొమ్మిదో ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సర్వ ప్రతినిధి సభ గ్యుటెరస్ పేరును ఖరారు చేయాల్సి ఉంది. పోర్చుగల్ రాజధాని లిస్బన్‌లో 1949, ఏప్రిల్ 30న జన్మించిన గ్యుటెరస్ 1995 నుంచి 2002 వరకు ఆ దేశానికి ప్రధానిగా పనిచేశారు. 2005, జూన్ నుంచి 2015, డిసెంబర్ వరకు ఐక్యరాజ్యసమితి శరణార్థుల హై కమిషనర్‌గా విధులు నిర్వర్తించారు. ఐరాస ప్రధాన కార్యదర్శి పదవి కోసం గ్యుటెరస్‌తో పోటీపడిన వారిలో ఇరీనా బకోవా (యునెస్కో డెరైక్టర్ జనరల్), హెలెన్ క్లార్‌‌క (యూఎన్‌డీపీ అడ్మినిస్ట్రేటర్) వంటి ప్రపంచ మహిళా నేతలున్నారు.

 

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top