రామోజీరావును పెంచి పోషించింది మా నాన్నే | Sakshi
Sakshi News home page

రామోజీరావును పెంచి పోషించింది మా నాన్నే

Published Tue, May 6 2014 9:39 AM

రామోజీరావును  పెంచి పోషించింది మా నాన్నే - Sakshi

‘సాక్షి’ ఇంటర్వ్యూలో జీజేఆర్ కుమారుడు యూరి
మార్గదర్శి మా నాన్న నాటిన విత్తనమే

 
‘ఈనాడు’ ఆలోచన కూడా నాన్నదే
పెట్టుబడి నుంచి యంత్రాల దాకా సమకూర్చి పెట్టారు
డాల్ఫిన్ హోటల్స్‌లోనూ నాన్న పెట్టుబడులున్నాయి
చాలా సంస్థల్లో ఆయన బినామీ పెట్టుబడులు పెట్టారు
వ్యాపార భాగస్వాములని నమ్మినవారే ముంచేశారు
మృత్యుశయ్య నుంచి ఆయన నాకు చెప్పిన విషయాలివి

 
తొలినాళ్లలో రామోజీ ఎదుగుదల వెనక ఉన్నది జీజే రెడ్డేనని ఆయన కుమారుడు యూరీ రెడ్డి ధ్రువీకరించారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో తన తండ్రి పెట్టుబడులు పెట్టారని, ఆ సంస్థతో పాటు ‘ఈనాడు’ ఏర్పాటుకు కూడా అన్నివిధాలా సాయం చేశారని వివరించారు. ఢిల్లీ స్థాయిలో తన తండ్రి పలుకుబడి, పరిచయాలను రామోజీ పూర్తిగా వాడుకుని ఎదిగారని చెప్పారు.చట్టపరమైన మార్గాల ద్వారా తన తండ్రి వాటాలను, పెట్టుబడులను రాబట్టుకునే ఆలోచన ఉందని ‘సాక్షి’ ఇంటర్వ్యూలో తెలిపారు. వివరాలు...    
 

రామోజీ మీ నాన్న కోసం పని చేసేవారని అంటారు?
అవును. రామోజీరావుకు మా నాన్నతో సన్నిహిత సంబంధముండేదన్నది నిజం. ఆయన మా నాన్న దగ్గర పని చేసేవారని విన్నాను. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో తొలి నుంచీ మా నాన్నకు వాటాలుండేవి. అప్పట్లో రామోజీకి ఓ కంపెనీ పెట్టేంత స్తోమత ఉండేది కాదని, మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు మీ నాన్నే ప్రైమ్ మూవర్ అని, అందుకే ఆ సంస్థలో ఆయన వ్యవస్థాపక ఇన్వెస్టర్‌గా చేరారని, అందులో ఉన్నది మీ నాన్న డబ్బేనని అంటారు. నిజమేనా? నిజమే. మా నాన్న మార్గదర్శి వ్యవస్థాపక డెరైక్టర్లలో ఒకరు. దాని ప్రారంభ పెట్టుబడి (సీడ్ క్యాపిటల్) పెట్టింది ఆయనే. మా నాన్నే నాతో ఎన్నోసార్లు చెప్పారిది. నవభారత్ ఎంటర్‌ప్రైజెస్, మార్గదర్శి వంటి ఈ కంపెనీలన్నీ పరస్పరం ఇంటర్ లింక్డ్ అనేవారు. మా నాన్న ఒక స్నేహితునిగా తన కంపెనీల నుంచి డబ్బును రామోజీ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేశారు. నేను కొంచెం ఎమోషనల్‌గా ఫీలవుతున్నాను. మరణశయ్య నుంచి ఒక తండ్రి తన కుమారునికి చెప్పిన సత్యాలను మీతో పంచుకుంటున్నాను. డాల్ఫిన్ హోటల్స్‌లో కూడా తన పెట్టుబడులున్నాయని మా నాన్న తన చివరి క్షణాల్లో నాతో చెప్పారు. ‘ఈనాడు’ పత్రికకు అవసరమైన ప్రింటింగ్ ప్రెస్‌ను కూడా తూర్పు జర్మనీ నుంచి మా నాన్నే దిగుమతి చేయించారని మా అంకుల్స్ నాకు చెప్పారు. ఇప్పుడు భారత్‌లో ఆస్తుల ధరలు బాగా పెరగడంతో నాటి మా నాన్న పెట్టుబడుల విలువ కూడా భారీగా పెరిగింది. భారత్‌లోని తన ఆస్తులు తదితరాలకు ఏఎస్ చౌదరి అనే ఆయన కేర్‌టేకర్‌అని మా నాన్న నాతో చెప్పారు.

మీ నాన్న నాటిన విత్తనమే ఇప్పుడు ఏటా కొన్ని వేల కోట్ల టర్నోవర్‌తో కూడిన వ్యాపార సామ్రాజ్యంగా మారిందని భావిస్తున్నారా?
అవును. ఇక్కడి తన ఆస్తులను, షేర్ల ద్వారా డివిడెండ్ వంటివేమైనా వస్తే వాటిని ఆంధ్రప్రదేశ్‌లోనే ధార్మిక కార్యకలాపాలకు వినియోగిస్తే ఎంతో సంతోషిస్తానని మా నాన్న తన చివరి రోజుల్లో మాతో చెప్పేవారు.

మీ తల్లిదండ్రులకు హైదరాబాద్, ఢిల్లీల్లో భూములు, పలు కంపెనీల్లో మంచి పెట్టుబడులుండేవా?
అవును. బిగ్ మనీ, బిగ్ పాలిటిక్స్. వాటి మధ్య విభజన రేఖ చాలా సన్ననిది! మీ నాన్న తన వ్యాపార భాగస్వాముల సంస్థల్లో చాలా పెట్టుబడులు పెట్టారని, వాటిని వారే నియంత్రించేవారని అంటారు. ఆయన తదనంతరం ఆ పెట్టుబడుల జాడే లేకుండా పోయిందంటారు.

వ్యాపార భాగస్వాములే మీ నాన్నను ముంచారా?
నిజం.

ఢిల్లీలోని మీ బంగ్లాకు రామోజీరావు తరచూ వచ్చేవారట?
అవును, నిజం. ఆయన తరచు అక్కడకు వస్తుండేవారు.

‘ఈనాడు’ పత్రిక పెట్టాలన్న ఆలోచన కూడా మీ నాన్నదేనటగా?
అవును. ఆ ఐడియా మా నాన్నదే.
 
ఈనాడుకు ప్రింటింగ్ ప్రెస్‌ను మీ నాన్నే సమకూర్చారటగా!

అవును. తూర్పు జర్మనీ నుంచి వాయిదాల చెల్లింపు పద్ధతిన మా నాన్నే సమకూర్చారు. అప్పట్లో ఆయన చాలా పెద్ద ఇన్‌ఫ్లుయెన్షియల్ పర్సన్. రామోజీ తన సంస్థ ఎదుగుదలకు మా నాన్న పలుకుబడిని, పరిచయాలను వాడుకోవడాన్ని ఆయనెప్పుడూ కాదనలేదు.

రామోజీ గురించి మీ నాన్న ఏం చెప్పేవారు?
ఆయన్ను తన కొలీగ్‌గా, క్లోజ్ ఫ్రెండ్‌గా భావించేవారు.

మీ నాన్న తీర్చిదిద్దిన రామోజీ, 1985 నాటికి  ప్రభుత్వాలనే మార్చగలిగే స్థాయికి ఎదిగారు. దీనిపై మీ నాన్న ఏమంటుండేవారు?
పోలియో బాధితుడైన మా నాన్న తన జీవితంలో చాలామందికి సాయం చేశారు. ఎంతోమందిని పెంచి పోషించారు. తన పర్యవేక్షణలో విజయం సాధించిన రామోజీని చూసి, అలాంటి వ్యక్తిని పెంచి పోషించింది తానేనని ఆయన చాలా సంతోషపడేవారు. అప్పట్లో మా నాన్నకు డబ్బు ప్రధానం కాదు. రామోజీ సంస్థల్లో డబ్బు ఇన్వెస్ట్ చేసినా, మెషినరీ వంటిది ఏర్పాటు చేసినా... సాయపడాలన్నది మాత్రమే ఆయన తత్వం.

మార్గదర్శి-నవభారత్ లింకు గురించి మీ నాన్న ఏం చెప్పేవారు?
వాటిది చాలా సన్నిహిత సంబంధం. భారత్‌లో అప్పట్లో పన్ను భారం ఎక్కువగా ఉండేది. దాన్ని తప్పించుకునేందుకు మిగులు నిధులన్నింటినీ బినామీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేవారు. అదంతా ఇప్పటి ప్రమాణాల ప్రకారం చట్టబద్ధం కాకపోవచ్చు. మా నాన్న పలు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. ఆస్తులు కొన్నారు. కానీ వాటిని ఆయన పేరుతో పెట్టేందుకు వీల్లేకపోవడంతో ఎన్నో కంపెనీల్లో బినామీ పేర్లతో పెట్టారు. అలా ఎందుకు చేశారో నాకిప్పటికీ అర్థం కాదు. బహుశా అప్పట్లో పరిస్థితులు, వ్యాపార వాతావరణం అలా ఉండేవేమో. అయితే ఇలాంటి అనధికారిక విషయాల గురించి నేను మాట్లాడటం లేదు. చట్టప్రకారం మా తండ్రికి వారసులుగా మాకుండే హక్కుల గురించే మాట్లాడుతున్నాం. మా నాన్న ఇన్వెస్ట్ చేసిన సంస్థల్లో మా వాటాను మాకిప్పించమని కోరుతున్నాం. అప్పట్లో వీటి గురించి మేం పట్టించుకోలేదు. నాన్న పేరిట ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి, పోలియో బాధితులకు ఆసరాగా ఉండటం నా ఆశయం.
 
ఒక వ్యక్తిగా రామోజీ గురించి ఏమంటారు?
కొన్నేళ్ల క్రితం ఆయన్ను కలిశాను. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో మా నాన్న పెట్టుబడి రూ.35 వేలు మాత్రమేనని ఆయనన్నారు. అదంత పెద్ద మొత్తం కాదనిపించింది. దాంతో వదిలేశాను.
 
మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో మీ నాన్నకు ఇప్పటికీ 288 షేర్లున్న విషయం మీకు తెలుసా?
ఇటీవలే తెలిసింది. అయితే 90 షేర్లేనన్నారు.

మార్గదర్శి   చిట్‌ఫండ్స్‌లోని మీ నాన్న వాటాల విలువను తెలుసుకునే ప్రయత్నమేమైనా చేశారా? రామోజీ కంపెనీల్లోని మీ నాన్న పెట్టుబడులను రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తారా?
దీనిపై చర్చిస్తాను. నా సోదరుడు నాకిప్పటికే పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చాడు. అయినా ఆయనతో కూడా ఈ విషయమై మాట్లాడాలి.

రామోజీ ఎప్పుడన్నా మిమ్మల్ని సంప్రదించే ప్రయత్నం చేశారా?
అప్పట్లో ప్రాగ్ (చెకస్లొవేకియా రాజధాని)లో నేను ప్రియా పచ్చళ్ల వ్యాపారం చేసేవాడిని. కొన్నేళ్ల క్రితం దాన్ని తిరిగి మొదలు పెట్టాలనుకున్నాను. అందుకు రామోజీ ఆఫర్ ఇచ్చారు.

Advertisement
 
Advertisement
 
Advertisement