ఉగ్రవాద అస్త్రం

US Intelligence Department Reported Against President Trump - Sakshi

అధికారంలోకొచ్చిన దగ్గరనుంచి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఇజ్రాయెల్‌ చిరకాల వాంఛల్ని ఈడేర్చడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. ఇరాన్‌తో అమెరికాకు ఉన్న అణు ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేశారు. అమెరికా రాయబార కార్యాలయాన్ని జెరుసలేంకు తరలిం చారు. గోలన్‌హైట్స్‌ ఇజ్రాయెల్‌దేనన్నారు. వీటన్నిటికీ పరాకాష్టగా ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్‌ కోర్‌(ఐఆర్‌జీసీ)దళాలను ఉగ్రవాద బృందంగా పరిగణిస్తున్నట్టు ప్రకటించారు. దీనిపై ఇరాన్‌ కూడా తీవ్రంగానే స్పందించింది. పశ్చిమాసియాలో ఉన్న అమెరికా సైనికుల్ని ఉగ్రవాదులుగా పరి గణిస్తూ ఇరాన్‌ సుప్రీం నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ తీర్మానం ఆమోదించింది. 

కేవలం పశ్చి మాసియాలో ఉన్నవారిని మాత్రమే కాదు...మొత్తం అమెరికా సైన్యాన్ని ఉగ్రవాదులుగా లెక్కే యాలని కొందరు సభ్యులు తీవ్రంగా వాదించారని వార్త. ట్రంప్‌ నిర్ణయం పశ్చిమాసియాను మాత్ర మే కాదు...అమెరికాను కూడా ప్రమాదంలో పడేసింది. ఇజ్రాయెల్‌లో పోలింగ్‌ జరగడానికి సరిగ్గా 24 గంటల ముందు ట్రంప్‌ ఇరాన్‌పై ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణముంది. ఆ ఎన్నికల్లో ప్రధాని నెతన్యాహూ గెలవడం దాదాపు అసాధ్యమని సర్వేలన్నీ తేల్చిచెప్పాయి. ట్రంప్‌ ప్రకటన పర్యవసానమో, మరే కారణమోగానీ నెతన్యాహూ స్వల్ప ఆధిక్యతతో ఆ ఎన్నికల్లో విజయం సాధిం చారు. ఇలా ఇజ్రాయెల్‌ కోసం పనిచేస్తూ దేశ ప్రయోజనాలకు ట్రంప్‌ ఎగనామం పెడుతున్నారని స్వదేశంలో విమర్శలు వస్తున్నా ఆయన ఖాతరు చేయడం లేదు. 

ఇరాన్‌పై కఠిన చర్యలు తీసుకోవడానికి ట్రంప్‌ రెండేళ్లుగా తహతహలాడుతున్నారు. అణు బాంబు తయారీకి ఇరాన్‌ ప్రయత్నిస్తున్నదంటూ ఆయన ఊదరగొడుతున్న సమయంలో అందులో నిజం లేదని ఇంటెలిజెన్స్‌ విభాగం నివేదించింది. 2015లో కుదిరిన అణు ఒప్పందంలోని అంశా లను ఇరాన్‌ తుచ తప్పకుండా పాటిస్తున్నదని కితాబునిచ్చింది. ఇది ట్రంప్‌కు ఆగ్రహం తెప్పిం చింది. ‘మీరు కొన్నాళ్లు ఉద్యోగాలకు సెలవుపెట్టి మళ్లీ శిక్షణ తీసుకోండి’ అని వారినుద్దేశించి కటువుగా వ్యాఖ్యానించారు. ఇరాక్, సిరియాల్లో ఏర్పడ్డ సంక్షోభాలు ఇప్పుడిప్పుడే ఒక కొలిక్కి వస్తున్న సూచనలు కనిపిస్తున్నాయని, ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్‌) కార్యకలాపాలను అణిచే యగలిగామని...ఈ దశలో ఇరాన్‌తో వైరం మంచిదికాదని సీఐఏ భావన. ఒబామా హయాంలో ఇరాన్‌తో అమెరికా, మరి అయిదు దేశాలు కుదుర్చుకున్న అణు ఒప్పందం నుంచి నిరుడు మే నెలలో ఏకపక్షంగా అమెరికా బయటికొచ్చింది. కొత్త ఒప్పందానికి సిద్ధపడకపోతే ఆంక్షలు విధిస్తా మని బెదిరించింది. దీన్ని ఇరాన్‌ ఖాతరు చేయకపోవడంతో ఆర్నెల్ల తర్వాత ఆంక్షలు అమల్లోకి తెచ్చింది. దానికి కొనసాగింపుగా ఇప్పుడు ఐఆర్‌జీసీని ఉగ్రవాద బృందంగా ప్రకటించింది. 

ఇరాన్‌ను ఎలాగైనా అంతర్జాతీయంగా ఏకాకిని చేయాలని ట్రంప్‌ శక్తివంచన లేకుండా ప్రయ త్నిస్తున్నారు. మొన్న ఫిబ్రవరిలో పోలాండ్‌లోని వార్సాలో అమెరికా ఆధ్వర్యంలో పశ్చిమాసియా భద్రతా సదస్సు కూడా ఏర్పాటైంది. అయితే అణు ఒప్పందంపై ట్రంప్‌ వైఖరితో విభేదించి ఆ ఒప్పందంలో తాము భాగస్వాములుగా ఉంటామని ప్రకటించిన జర్మనీ, ఫ్రాన్స్‌ ఈ భద్రతా సద స్సుకు దూరంగా ఉన్నాయి. యూరప్‌కు చెందిన ఇతర దేశాలు కొన్ని, అరబ్‌ దేశాలు మాత్రమే ఇందులో పాల్గొన్నాయి. ఆ దేశాలనుంచి కూడా ద్వితీయ శ్రేణి నాయకులు మాత్రమే వచ్చారు. ఫలి తంగా ఇరాన్‌ను ఏకాకి చేద్దామనుకున్న అమెరికాయే ఒంటరైంది. 

వాస్తవానికి నిరుడు అక్టోబర్‌లోనే ఐఆర్‌జీసీ ని ట్రంప్‌ ఉగ్రవాద సంస్థగా పరిగణిస్తున్నట్టు చెప్పారు. అయితే అమెరికా ఆర్థిక విభాగం నిబంధనలకింద ఆ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు విదేశాంగ శాఖ ఆ పని చేసింది. తాజా నిర్ణ యం వల్ల ఐఆర్‌జీసీతో వాణిజ్యపరమైన సంబంధాలు పెట్టుకున్నవారిని నేరస్తులుగా ముద్రేసి అరె స్టు చేయడానికి అమెరికాకు అధికారం లభిస్తుంది. సరిగ్గా ఈ కారణం వల్లనే అటు రక్షణ విభాగం పెంటగాన్, గూఢచార విభాగం సీఐఏ అధికారులు ట్రంప్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. అమెరికా నిర్ణయాన్ని సాకుగా చూపి ఇరాన్‌కు చెందిన ఛాందసవాద బృందాలు విదేశాల్లోని అమెరికా భద్రతా విభాగం అధికారులపైనా, పారామిలిటరీ దళాలపైనా దాడులకు దిగే ప్రమాదం ఉన్నదని హెచ్చరిస్తున్నాయి. ఇదంతా చివరకు ఇరాన్‌తో యుద్ధాన్ని తీసుకొస్తుందన్నది వారి వాదన. 

యుద్ధమే వస్తే ఇరాక్‌లో ఉన్న అమెరికా సైన్యం పెను ముప్పును ఎదుర్కొనవలసి వస్తుంది. ఇరాక్‌లో ఐఎస్‌ సంస్థ 60 శాతం భూభాగాన్ని ఆక్రమించుకుని ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నప్పుడు దాన్ని ఎదుర్కొన్నది అమెరికా సైన్యం కాదు. దాన్ని అణచడం అసాధ్యమని అది ఎప్పుడో చేతులెత్తేసింది. అప్పుడు పొరుగునున్న ఇరాన్‌ రంగంలోకి దిగి ఐఆర్‌జీసీద్వారా ఇరాక్‌లోని షియా పౌర సైన్యానికి అండగా నిలబడింది. ప్రస్తుతం ఇరాక్‌లో ఉన్న 5,200మంది అమెరికా సైన్యానికి వీరే రక్షణ కల్పిస్తున్నారు. ఇరాన్‌ అమెరికా సేనల్ని ఉగ్రవాదులుగా పరిగణించడం మొదలుపెట్టినా లేక వారికి సహకరించడం మానుకున్నా కష్టాలు తప్పవు. ఏకకాలంలో అమెరికా సేనలు ఇరాక్‌లో, ఇరాన్‌లో దాడులు ఎదుర్కొనవలసివస్తుంది. 

ఇప్పుడిప్పుడే కొడిగడుతున్న ఐఎస్‌ సైతం మళ్లీ కోరలు చాస్తుంది. అదే జరిగితే అమెరికా, ఇరాన్‌లతోపాటు పశ్చిమాసియా దేశాలన్నీ సంక్షోభంలో పడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా విదేశాంగ శాఖ ఇంతవరకూ అల్‌ కాయిదా, ఐఎస్, కొన్ని పాలస్తీనా సంస్థలను ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించింది. కానీ ఒక దేశ సైన్యంలో భాగంగా ఉంటున్న విభాగాన్ని ఉగ్రవాద సంస్థగా పరిగణించడం ఇదే ప్రథమం. పర్యవసానంగా ఇరాన్‌తో దౌత్య సంబంధాలున్న ఏ దేశమైనా ఐఆర్‌జీసీతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటే అది అమెరికా దృష్టిలో నేరం అవుతుంది. ఇందువల్ల ఆ దేశాలకు మాత్రమే కాదు...వాటితో వ్యవహరించవలసి రావడం అమెరికాకు కూడా సమస్యే అవుతుంది. కనుక ట్రంప్‌ చర్యను అడ్డుకుని, సమస్య ముదరకుండా చూడాల్సిన బాధ్యత అమెరికా ప్రజానీకానిది, ప్రత్యేకించి అమెరికా ప్రతినిధుల సభది.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top