సమూల ప్రక్షాళన అవసరం

Sakshi Editorial On Plus Two Results

ఇది పరీక్ష ఫలితాలు వెల్లడయ్యే కాలం. రాష్ట్రాల స్థాయిలో ఉండే పదో తరగతి, ఇంటర్మీడియెట్‌ వార్షిక పరీక్షల ఫలితాలు... కేంద్ర స్థాయిలోని సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఐఎస్‌సీ వంటి బోర్డులు నిర్వ హించిన పది, పన్నెండు తరగతుల ఫలితాలు వరసబెట్టి వెలువడుతున్నాయి. కొన్నింకా వెలువడ వలసి ఉంది. గురువారం వెల్లడైన సీబీఎస్‌ఈ పన్నెండో తరగతి ఫలితాల్లో ఎప్పటిలాగే బాలికల్లో ఉత్తీర్ణత శాతం అధికంగా ఉంది. సీబీఎస్‌ఈ రీజియన్‌లన్నిటా ఇదే ధోరణి. ఫలితాలు వచ్చిన ప్పుడల్లా సహజంగానే అగ్రస్థానాల్లో నిలిచినవారిని మీడియాతోసహా సమాజంలో అందరూ గుర్తి స్తారు. చానెళ్లు, పత్రికలు విజేతలతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకుంటారు. ఏడాది పొడవునా వారు శ్రమించిన తీరు, వారి విజయానికి దోహదపడిన ఇతర అంశాలు వంటివన్నీ ప్రస్తావన కొస్తాయి.

విజేతల్లో కొందరు తాము సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండటం వల్ల పాఠ్యాం శాలపై దృష్టి పెట్టగలిగామని చెప్పారు. ఒత్తిడికి లోనయినప్పుడు దాన్నుంచి బయటపడటానికి పాటలు వినడం, ఆటలాడటం వంటివి చేశామని కొందరు తెలిపారు. ఒకామె ఖాళీ సమయాల్లో దివ్యాంగులకు కథక్‌ నృత్యం నేర్పుతుంటానని చెప్పింది. ఇలాంటి అనుభవాలు ఇతర విద్యార్థులకు ఉపకరిస్తాయి. సీబీఎస్‌ఈ ఫలితాల్లో ఈసారి చాలా రికార్డులున్నాయి. ఆఖరి పరీక్ష పూర్తయిన 28 రోజుల వ్యవధిలోనే ఫలితాలు వెలువడ్డాయి. అంతేకాదు... 90 శాతంకన్నా ఎక్కువగా మార్కులు సాధించిన విద్యార్థుల సంఖ్య 94,299. ఇద్దరు బాలికలకైతే 500 మార్కులకూ 499 వచ్చాయి. 498 తెచ్చుకున్నవారు ముగ్గురైతే, అంతకన్నా ఒక మార్కు తక్కువతో వచ్చినవారు 18మంది. గత ఏడా దితో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత శాతం అధికం. వీటన్నిటివల్లా ఈసారి ఢిల్లీ యూనివర్సిటీ అడ్మిషన్ల కోసం కటాఫ్‌ మార్కుల్ని పెంచవలసిన పరిస్థితి ఏర్పడింది. 

ఢిల్లీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలల విజయగాధను ప్రత్యేకించి చెప్పుకోవాలి. ఆ పాఠశాలల్లో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 94.29. అంతేకాదు... 203 పాఠశాలల్లో వందశాతం విద్యా ర్థులు ఉత్తీర్ణులయ్యారు. అక్కడి ప్రైవేటు స్కూళ్లతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉత్తీర్ణత అధికంగా ఉంది. 2015 నుంచి అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ బడులపై ప్రత్యేక శ్రద్ధపెట్టి వాటికి అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ కల్పించింది. అందువల్లే అప్పటినుంచీ ఏటా మంచి ఫలితాలు వస్తున్నాయి. పైలట్‌ ప్రాజెక్టుకింద మొదట 54 పాఠశాలల్ని ఎంపిక చేసి అవసరమైన టీచర్లను నియమించారు. పాఠశాల భవనాలను తీర్చిదిద్దారు. పిల్లల్లో ప్రతిభను వెలికితీసే కార్యక్రమాలు అమలు చేశారు. ప్రధానంగా పిల్లల్ని కొట్టడమనే అలవాటును మాన్పించారు. క్రమేపీ దీన్ని విస్తరించుకుంటూ వెళ్లారు. ప్రభుత్వ పాఠశాలల్లో బాగా చదువు చెబుతున్నారన్న అభిప్రాయం కలగడం మొదలయ్యేసరికి ప్రైవేటు బడులకు పిల్లల్ని పంపే ధోరణి తగ్గిపోయింది. అలాగే మధ్యలో బడి మానేసేవారు దాదాపు లేకుండాపోయారు. కెరీర్‌ విషయమై పిల్లలకు సలహా లిచ్చేందుకు నిపుణుల్ని రప్పించే విధానం మొదలుపెట్టారు. ఇవన్నీ పన్నెండో తరగతిలో ఈ మాదిరి ఫలితాలు రావడానికి దోహదపడ్డాయి. తెలంగాణలోని సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్‌ పాఠశాలలు సైతం ఇదేవిధమైన ఫలితాలు అందిస్తున్నాయి.

గతనెల 29న వెలువడిన జేఈఈ ఫలితాల్లో ఈ పాఠశాలల నుంచి 506 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 35మంది ఓపెన్‌ క్యాటగిరీకి అర్హత సాధించారు. ఈ పిల్లలంతా గ్రామీణప్రాంతాలనుంచి వచ్చినవారే కావడం... వారి తల్లిదండ్రులంతా కూలీలుగా, కూరగాయల వ్యాపారులుగా, టీ అమ్ముకునేవారిగా, నిర్మాణ కార్మికులుగా బతుకీడుస్తున్నవారే కావడం గమనిం చదగ్గది. ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే, అంకితభావంతో పనిచేసేవారిని గుర్తించి వారికి సారథ్యం అప్పగిస్తే విద్యా ప్రమాణాలు ఎంత ఉన్నత స్థాయికి చేరతాయో ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలు, తెలంగాణ సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ పాఠశాలలు నిరూపిస్తున్నాయి. అయితే ఈ ఫలి తాలతో సంతృప్తి పడి ఊరుకోకూడదు. వీటినుంచి వచ్చిన అనుభవాలతో ఇతర పాఠశాలల్ని సైతం తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకోవాలి. తగిన సంఖ్యలో ఉపాధ్యాయులను నియమించడంతోపాటు ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలి. విద్యాహక్కు చట్టం కింద ఇలాంటివన్నీ తప్పనిసరిగా చేయాల్సి ఉన్నా ప్రభుత్వాలు తగిన శ్రద్ధ పెట్టడం లేదు. 

అయితే ఇప్పుడు సీబీఎస్‌ఈ పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా విమర్శిస్తున్నవారు లేకపోలేదు. ముఖ్యంగా అన్ని పాఠ్యాంశాల్లో విద్యార్థులకు లోతైన అవగాహన కలిగేలా, ఆ అంశాల్లో తార్కిక శక్తిని పెంచి వారిలో కొత్త ఆలోచనలు రేకెత్తించేలా విద్యావిధానం ఉండటం లేదన్నది వారి ఆరోపణ. ఇటీవలికాలంలో సీబీఎస్‌ఈ పరీక్ష పత్రాల్లో విద్యార్థుల తార్కిక శక్తిని, వారి పరిజ్ఞానాన్ని అంచనా వేసే వ్యాసరూప ప్రశ్నలు ఇవ్వకుండా బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు, సంక్షిప్త సమాధానాలు కోరే ప్రశ్నలతో సరిపెడుతున్నారని వారంటున్నారు. ఈ విధానం బట్టీపట్టే ధోరణిని పెంచుతుంది. లోతుగా అధ్యయనం చేసే అలవాటును పోగొడుగుతుంది. ప్రధానంగా కేంద్ర సిలబస్‌లోని పన్నెండో తరగతి అయినా, రాష్ట్రాల స్థాయిలో ఉండే ఇంటర్మీడియెట్‌ అయినా విద్యార్థి జీవితంలో అత్యంత కీలకమైనవి. జీవితంలో తాను ఏ రంగంలో స్థిరపడాలో నిర్ణయించుకునేది ఈ సమ యంలోనే. కనుక ఈ దశలో అందించే విద్య తదనంతర స్థాయికి పిల్లల్ని సంసిద్ధుల్ని చేసేదిగా ఉండాలి. దేనిలో ఆసక్తి ఉందో, ఎక్కడ రాణించడం సాధ్యమో పిల్లలు ఎవరికి వారు అంచనా వేసు కోవడానికి అనువైన విద్య వారికి అందుబాటులో ఉండాలి. సంక్లిష్ట సమస్యలను పరిష్కరించడం, సృజనాత్మకత, విశ్లేషణా సామర్థ్యం, పరిశోధనా తత్వం, టీంవర్క్, నాయకత్వంవహించడం వంటి నైపుణ్యాలు వారిలో పెంచాలి. ఇవన్నీ వారు స్వతంత్రంగా ఆలోచించడానికి, నిర్దిష్టమైన అభిప్రా యాలు ఏర్పరుచుకోవడానికి, పరిణతి సాధించడానికి తోడ్పడతాయి. ప్లస్‌ టు విద్యను సమూలంగా ప్రక్షాళన చేయడంపై ప్రభుత్వాలు దృష్టిపెట్టాలి. 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top