మండలిలో భంగపాటు

Sakshi Editorial on Pakistan Stance

‘భద్రతామండలిలో మనకోసం ఎవరూ పూల దండలు పట్టుకుని ఎదురుచూడటం లేదు. ఇది మరిచి ప్రవర్తిస్తే మనం పిచ్చివాళ్ల స్వర్గంలో ఉన్నట్టే’ అని పాకిస్తాన్‌ విదేశాంగ మంత్రి షా మహ్మూద్‌ ఖురేషీ ప్రకటించిన నాలుగు రోజులకు మండలిలో ఆ దేశానికి భంగపాటు ఎదు రైంది.370 అధికరణను మన దేశం రద్దు చేయడంపై మొన్న శుక్రవారం మండలి రహస్య సమావేశం జరిగినప్పుడు చైనా తప్ప మరే దేశమూ పాకిస్తాన్‌ పక్షం నిలబడలేదు. 15మంది సభ్యులున్న మండలిలో మెజారిటీ సభ్యులు కశ్మీర్‌ ద్వైపాక్షిక అంశమని, అందులో ఐక్యరాజ్యసమితి జోక్యం అవసరం లేదని అభిప్రాయపడటం పాకిస్తాన్‌కు ఎదురుదెబ్బే. జమ్మూ–కశ్మీర్‌లో ఉద్రిక్తత లను పెంచే చర్యలకు ఎవరూ పాల్పడరాదంటూ తీర్మానిద్దామని చైనా చేసిన సూచన కూడా వీగిపోయింది.  రెండు గంటలపాటు సమావేశం జరిగాక బయటికొచ్చి ఇద్దరే మాట్లాడారు. వారిలో ఒకరు చైనా ప్రతినిధి. మరొకరు రష్యా ప్రతినిధి. చైనా ప్రతినిధి సహజంగానే పాకిస్తాన్‌ అనుకూల వైఖరితో మాట్లాడగా, రష్యా ప్రతినిధి భారత్‌ను సమర్థించారు. భద్రతామండలి చర్చించిన లేదా తీర్మానించిన అంశాలన్నీ చివరకు ఏమవుతున్నాయన్న సంగతలా ఉంచి, ఆ వేదికపై ఎలాగైనా కశ్మీర్‌ అంశం ప్రస్తావనకు రావాలన్న పాకిస్తాన్‌ కోరిక మాత్రం నెరవేరింది. 

మండలిలో పాకిస్తాన్‌కు లభించే మద్దతు అంతంతమాత్రమేనని తాను అనడానికి కారణ మేమిటో ఖురేషీ చెప్పారు. వందకోట్లకు మించి జనాభా ఉన్న భారత్‌లో అనేక దేశాలు పెట్టు  బడులు పెట్టాయని, ఇస్లామిక్‌ దేశాలు కూడా ఆ జాబితాలో ఉన్నాయని ఆయన వివరించారు. కానీ ఇదే మాట పాకిస్తాన్‌కు కూడా వర్తిస్తుంది. గిల్గిట్‌–బాల్టిస్తాన్‌లోని ట్రాన్స్‌ కారకోరంను ఆ దేశం చైనాకు అప్పగించకపోయి ఉంటే... చైనా నిర్మించతలపెట్టిన బృహత్తర ప్రాజెక్టు బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇన్షియేటివ్‌(బీఆర్‌ఐ)లో చేరడానికి సిద్ధపడకపోయి ఉంటే అది కూడా పాకిస్తాన్‌కు మద్దతుగా నిలిచేది కాదు. ప్రపంచం ఇప్పుడు మారిందని ఖురేషీ చెప్పడంలోనూ అర్ధసత్యమే ఉంది. అప్పట్లో పాకిస్తాన్‌ చర్యలకు నలువైపులనుంచీ మద్దతు వచ్చిపడిందీ లేదు...ఇప్పుడు అది తగ్గిందీ లేదు. అయినా ప్రపంచ దేశాల తీరు గురించి ఇంత తెలిసిన పాకిస్తాన్‌ మన దేశంతో మొదటినుంచీ ఎందుకు గిల్లికజ్జాలకు దిగుతున్నదో అనూహ్యం. అంతక్రితం ఎంతో కొంత మెరుగ్గా ఉన్న పాకి స్తాన్‌ పరిస్థితిని ఈ స్థితికి చేర్చింది 80వ దశకంలో ఆ దేశాన్నేలిన సైనిక నియంత జియావుల్‌ హక్‌. పౌర ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని దురాక్రమించిన తనకు బలం చేకూరాలంటే మత తత్వాన్ని పెంచడమే మార్గమని ఆయన అనుకున్నాడు. ప్రతి స్థాయిలోనూ మత ఛాందసులకు చోటిచ్చి వారికి పలుకుబడి పెరిగేలా చేశాడు. అనంతరకాలంలో ఆ ఛాందసవాద ముఠాలు కొరక రాని కొయ్యలా తయారయ్యాయి. అక్కడి సమాజాన్ని శాసిస్తున్నాయి. వాటినుంచే ఉగ్రవాదాన్ని బతుకు తెరువుగా చేసుకున్నవారు పుట్టుకొచ్చారు. అటువంటివారిని సరిహద్దులు దాటించి భారత్‌లోకి పంపి అలజడులు సృష్టించడం, అధీన రేఖ వద్ద తరచు ఆ దేశ సైన్యం అకారణంగా కాల్పులకు దిగడం వగైరాలన్నీ దానికి కొనసాగింపు. ఇలాంటి దేశాన్ని నమ్ముకుని ఎవరూ పెట్టుబడులు పెట్టరు. వ్యాపారాలు చేయరు. భారత్‌ పెద్ద మార్కెట్‌ అనడానికి ముందు.. దాదాపు 20 కోట్లమంది జనాభాతో ఉన్న తమ దేశమూ చెప్పుకోదగ్గ మార్కెటేనని ఖురేషీ గుర్తించి ఉంటే బాగుండేది. జనాభా ఎంత ఉందని కాదు... దేశం ప్రశాంతంగా ఉంటే వ్యాపారులైనా, పారి శ్రామికవేత్తలైనా ఉత్సాహంగా ముందుకొస్తారు. యువతకు ఉపాధి దొరుకుతుంది. అసలు అదంతా జరిగితే మన దేశంతో పాకిస్తాన్‌కు పేచీ పెట్టుకునే అవసరం వచ్చేది కాదు. దేశ ఆర్థిక వ్యవస్థ నానాటికీ క్షీణించడం, ఉపాధి కల్పనలో వెనకబాటు వగైరాలన్నీ పాకిస్తాన్‌ను కుంగ దీస్తున్నాయి. వాటినుంచి తమ ప్రజల దృష్టి మళ్లించడానికి పాకిస్తాన్‌ ఇలాంటి పేచీకోరు చర్యలకు దిగుతోంది.

 అయితే భద్రతామండలి చర్చ సందర్భంగా అటు చైనా తీరుతెన్నులపై, ఇటు రష్యా అడుగులేసిన తీరుపై మన దేశం అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మొదటినుంచీ చైనా పాకిస్తాన్‌ వైపే మొగ్గుచూపుతోంది. అది కొత్త పరిణామమేమీ కాదు. కానీ వచ్చే అక్టోబర్‌లో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, ప్రధాని నరేంద్ర మోదీల మధ్య మన దేశంలో శిఖరాగ్ర చర్చలు జరగాల్సి ఉన్న తరుణంలో...వచ్చే నెల ఇరు దేశాల ప్రతినిధులమధ్యా సరిహద్దు అంశంపై చర్చలు జరగాల్సి ఉండగా చైనా ఇంత దూకుడుగా పాకిస్తాన్‌ ప్రయోజనాల పరిరక్షణకు శ్రమించడం, భద్రతామండలిలో ఒక తీర్మానం చేయాలని పట్టుబట్టడం గమనించదగ్గవి. ఒకపక్క తాను వీగర్‌ ప్రావిన్స్‌లో నిత్యం మానవహక్కుల హననానికి పాల్పడుతూ, హాంకాంగ్‌లో అణచివేత చర్యలకు దిగుతూ కశ్మీర్‌ పౌరుల విషయంలో మాత్రం అది మొసలి కన్నీరు కారుస్తోంది. అటు రష్యా స్వరం కూడా స్వల్పంగా మారిన వైనం కనబడుతోంది. కశ్మీర్‌ సమస్య భారత్‌–పాక్‌ల ద్వైపాక్షిక అంశ మని, వారిద్దరే దాన్ని పరిష్కరించుకోవాలని అది ఇప్పటికీ చెబుతున్నా... అందుకు  1972నాటి సిమ్లా ఒప్పందం, 1998నాటి లాహోర్‌ డిక్లరేషన్‌లను ప్రాతిపదికలుగా తీసుకోవాలని అంటున్నా, కొత్తగా ‘ సంబంధిత ఐక్యరాజ్యసమితి తీర్మానాల’ ప్రస్తావనను వీటికి జత చేసింది. ఇది కొత్త పరి ణామం. అమెరికాతో మన దేశం సన్నిహితం కావడం విషయమై రష్యాకు చాన్నాళ్లనుంచి అసంతృప్తి ఉంది. కనుకనే ఈ రూపంలో దాన్ని వెళ్లగక్కింది. ప్రచ్ఛన్న యుద్ధకాలంలో భద్రతా మండలిలో మనకు గట్టి మద్దతుదారుగా నిలిచి, మనకు వ్యతిరేకంగా వచ్చే తీర్మానాలను ఎప్పుడూ వీటో చేస్తూ వచ్చిన రష్యా ఇలా వ్యవహరించడం గమనించి దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దౌత్య వ్యవహారాలు కత్తి మీది సాము వంటివి. ఆచితూచి అడుగులేయడం చాలా ముఖ్యం. 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top