ఎట్టకేలకు రాజీనామా!

Sakshi Editorial On MJ Akbar Resign Over MeToo Allegations

‘మీ టూ’ ఆరోపణలను బేఖాతరు చేస్తూ వచ్చిన విదేశాంగ శాఖ సహాయమంత్రి ఎం.జె. అక్బర్‌ ఎట్టకేలకు తన పదవికి రాజీనామా చేశారు. ఒక మహిళా జర్నలిస్టుపై తాను పెట్టిన పరువు నష్టం కేసు విచారణకు రావడానికి ముందురోజు అక్బర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. వ్యక్తిగత హోదాలోనే న్యాయస్థానంలో పోరాడి అవన్నీ తప్పుడు ఆరోపణలని రుజువు చేస్తానని ఆయన ఒక ట్వీట్‌లో తెలిపారు. ఒకరిద్దరు ఆరోపణలు చేస్తే వారికి ఉద్దేశాలను ఆపాదించటం, కొట్టిపారేయటం సులభం. కానీ ఆ బాధితుల సంఖ్య పెరుగుతూ పోతోంది. అంతేకాదు... ‘అవన్నీ వాస్తవం. బాధి తులకు అనుకూలంగా మేం సాక్ష్యం చెబుతామ’ంటూ మరికొందరు ముందుకు రావటంతో అక్బ ర్‌కు దారులన్నీ మూసుకుపోయాయని చెప్పాలి. ప్రధాని కార్యాలయం జోక్యం చేసుకోవడంతో ఆయన రాజీనామా చేశారని ఒక కథనం, అది ఆయన సొంత నిర్ణయమేనని మరో కథనం మీడి యాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో ఏది నిజం... రేపన్న రోజున న్యాయ స్థానాలు ఏం తేలుస్తాయనే అంశాలు అలా ఉంచితే, బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నవారు ఆరోపణలు వచ్చి నప్పుడు ఎలా ప్రవర్తించాలన్న అంశం ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ రాఫెల్‌ వ్యవహారం జోరు కాస్త తగ్గించి, అక్బర్‌పై స్వరం పెంచి మాట్లా డటంతో ఈ ఎన్నికల సమయంలో బీజేపీకి ఇది నష్టదాయకంగా మారవచ్చునన్న అభిప్రాయం ఏర్పడి ఉండొచ్చు. నిజానికి తనంత తాను రాజీనామా చేయాలనుకుంటే అక్బర్‌ విదేశీ పర్యటన నుంచి తిరిగి రాగానే ఆ పని చేసేవారు. 

అమెరికా మొదలుకొని మన దేశం వరకూ అన్నిచోట్లా ‘మీ టూ’పై విమర్శలు చేస్తున్నవారు బాధితులు ఇప్పుడే ఎందుకు గొంతెత్తుతున్నారని ప్రశ్నిస్తున్నారు. అమెరికాలో రిపబ్లికన్లు సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ఎంపిక చేసిన బ్రెట్‌ కేవనాపై ఆరోపణలొచ్చిన పర్యవసానంగా దర్యాప్తు జరిగినప్పుడు అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కూడా ఇదే ప్రశ్న వేశారు. కానీ దీన్ని మహిళలంతా సమర్థవంతంగా తిప్పికొట్టారు. ఇప్పుడు మాత్రం ఎందుకు చెప్పకూడదని ఎదురు ప్రశ్నించారు. నిజానికిది సామాజిక మాధ్యమాల విస్తృతి ఫలితంగానే సాధ్యమైంది. అంతక్రితం బాధిత మహిళ లకు ఉండే అవకాశాలు చాలా పరిమితం. ఆ అవకాశాలు కూడా నిర్దిష్టమైన చట్రానికి లోబడి మాత్రమే ఉంటాయి. విశాఖ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల పర్యవసానంగా మహిళా సిబ్బందికి లైంగిక వేధింపులు ఎదురైతే విచారించి చర్య తీసుకునేందుకు అంతర్గత కమిటీలు ఏర్పాటయ్యాయి. అలాగే ఏ మహిళైనా పోలీసులకు ఫిర్యాదు చేయడానికి, నేరుగా న్యాయస్థానంలో కేసు దాఖలు చేసేందుకు అవకాశాలున్నాయి. కానీ వీటన్నిటికీ నిర్దిష్టమైన ప్రక్రియ ఉంటుంది.  పైగా అలాంటి మహిళలు దాదాపు ఒంటరి పోరాటం జరపాల్సి ఉంటుంది. సామాజిక మాధ్యమాల్లో ఇటువంటి సమస్యలుండవు. ఒకరి స్వరానికి కొన్ని గంటల్లోనే వందలు, వేల స్వరాలు జత కలుస్తాయి. వారికి నైతిక మద్దతు పుష్కలంగా లభిస్తుంది.

అలాగని తాము ఎదుర్కొన్న ఇబ్బందులను, సమస్యలను సామాజిక మాధ్యమాల ద్వారా బయటపెట్టడం బాధిత మహిళలకు అంత సులభమైన విషయమేమీ కాదు. ఆ వేధింపులు ఎంతో మానసిక క్షోభకు గురిచేస్తే తప్ప, ఇక గత్యం తరం లేదనుకుంటే తప్ప వాటిని బయటపెట్టడానికి ఎవరూ సాహసించరు. ఎంతో అభివృద్ధి చెందిందనుకుంటున్న పాశ్చాత్య దేశాల్లోనే హాలీవుడ్‌ దర్శకుడు హర్వీ వైన్‌స్టీన్‌ వంటి ‘సీరియల్‌ రేపిస్టుల’ అసలు స్వరూపం వెల్లడి కావడానికి దశాబ్దాలు పట్టింది. ఎందుకంటే తమను వేధించే వ్యక్తులతో మాత్రమే కాదు... భిన్న స్థాయిల్లో వారికి అండగా నిలబడే వ్యవస్థలతో కూడా ఆ బాధిత మహిళలు పోరాడవలసి ఉంటుంది. పైగా చాలా సందర్భాల్లో ఆ పోరాటం ఒంటరిగానే సాగిం చాల్సి ఉంటుంది. విలువైన సమయాన్ని, డబ్బును...మొత్తంగా జీవితాన్ని దానికోసమే వెచ్చిం చాల్సి ఉంటుంది. ఈలోగా ఇదంతా ఆమె స్వయంకృతాపరాధమని ముద్ర వేసే ప్రయత్నాలు మొదలవుతాయి. ఒక సమస్యను ఎదుర్కొనడానికి వెళ్తే సవాలక్ష సమస్యలు చుట్టుముడుతున్నపుడు మౌనంగా ఉండటమే శ్రేయస్కరమన్న భావన ఏర్పడుతుంది. సామాజిక మాధ్యమాలు ఇలాంటి అవాంతరాలనూ, అడ్డుగోడలనూ ఛేదించాయి. బాధితులకూ, వారికి అండగా నిలబడేందుకు సిద్ధంగా ఉన్నవారికీ మధ్య వారధి నిర్మించాయి. అందుకే కాస్త ఆలస్యమైంది తప్ప ‘మీ టూ’ మన దేశంలో అన్ని రంగాలనూ ముంచెత్తడం మొదలుపెట్టింది. రాజకీయ పార్టీలు, వాటికి అనుబం ధంగా ఉండే సంఘాలు కూడా దీనికి తలవంచక తప్పని స్థితి ఏర్పడింది. ఆఖరికి బీజేపీ, కాంగ్రె స్‌లు సైతం ఇన్నాళ్లుగా తమ సంస్థల్లో లైంగిక వేధింపుల ఫిర్యాదులపై విచారణ జరిపేందుకు అవస రమైన యంత్రాంగాలను నెలకొల్పుకొనలేదని వెల్లడైంది.

ఇప్పటికిది నగరాల్లోని ఉన్నత వర్గాలకు పరిమితమైన ధోరణిగా కనబడుతున్నా ఇక్కడితో ఇది ఆగుతుందని చెప్పలేం. మన సమాజంలో మహిళలను వేధించే ధోరణి సర్వత్రా ఉన్నప్పుడు,  దాని వల్ల బాధితులుగా మారిన వారికి ఈ ఉద్యమ స్ఫూర్తి ఆలస్యంగానైనా చేరకతప్పదు. తమకు జరుగుతున్న అన్యాయాలను మౌనంగా భరించడంకాక ఎలుగెత్తి చాటితే ప్రయోజనం సిద్ధిస్తుం దన్న భరోసా ఏర్పడుతుంది. అక్బర్‌ వ్యవహార శైలి గురించి ఒకరి తర్వాత ఒకరు బయట పెడుతుండగా అహ్మదాబాద్‌లోని ఒక సంస్థలో పనిచేసే ప్రొఫెసర్‌ తనను లైంగికంగా వేధించాడని ఒక యువతి వెల్లడించింది. ప్రముఖ పెయింటర్‌  జతిన్‌దాస్‌ తమతో అసభ్యంగా ప్రవర్తించేవారని నలుగురైదుగురు యువతులు బయటపెట్టారు. ఎన్‌ఎస్‌యూఐ జాతీయ అధ్యక్షుడిపై ఆరోపణలు రావడంతో అతనితో రాజీనామా చేయించారు. ఏదేమైనా అక్బర్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరో పణలు తీవ్రమైనవి. వాటిలోని నిజానిజాలు నిగ్గుదేలేలోగా ఆయన పదవి నుంచి వైదొలగడమే సరైంది. ఆలస్యంగానైనా అది జరగడం హర్షించదగ్గది. 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top