సైనిక సంస్కరణలు

Sakshi Editorial On Indian Military Reforms

రెండేళ్ల నుంచి సాగుతున్న కసరత్తు ఓ కొలిక్కి వచ్చింది. మన సైనిక వ్యవస్థలో సంస్కరణలు తీసుకురాబోతున్నట్టు మీడియా కథనాలు చెబుతున్నాయి. ప్రస్తుతం మన సైన్యం పరిమాణంలో ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది. వివిధ క్యాడర్‌లలో 49,631మంది అధికారులతోసహా దాదాపు13 లక్షలమంది సిబ్బంది ఉన్నారు. అధికారుల్లో ఎక్కువమంది సైనిక ప్రధాన కార్యాలయంలో పోస్టింగ్‌లను కోరుకుంటున్నారన్న విమర్శలున్నాయి. శరవేగంతో మారుతున్న ప్రపంచంతోపాటే సైనిక రంగంలో కూడా పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడంతా వేగంగా ముగిసిపోయే మెరుపు యుద్ధాలు, పరిమిత కాలంపాటు కొనసాగే ఘర్షణలే ఉంటాయి తప్ప దీర్ఘకాలిక యుద్ధాలకు కాలం చెల్లింది. స్వల్పకాలిక యుద్ధాల్లో కూడా కీలకపాత్ర సాంకేతిక నైపుణ్యానిదే. అమెరికా, చైనాలు ఇప్పటికే ఆ విషయంలో చాలా ముందుకెళ్లాయి. అమెరికా రిమోట్‌ కంట్రోల్‌ ఆయుధాలు, ద్రోన్‌ల ద్వారా లక్ష్యాల ఛేదన, కృత్రిమ మేధతో పనిచేసే స్వయంచాలిత ఆయుధాల రూపకల్పన వంటివి అమల్లోకి తెచ్చింది. ఆమేరకు పదాతి సైనికుల సంఖ్యను తగ్గి స్తోంది. బ్రిటన్‌ తన సైన్యాన్ని 20 శాతం మేర తగ్గించుకుంటున్నట్టు  2012లో తెలిపింది.  రష్యా సైన్యం భారీ స్థాయిలో ఉన్న డివిజనల్‌ కార్యాలయాల సంఖ్యను కుదించటం మొదలుపెట్టింది.   చైనా సైతం మూడేళ్లక్రితం సైనిక సంస్కరణలు మొదలుపెట్టింది. త్రివిధ దళాల్లో మొత్తంగా ఉన్న 20 లక్షలమంది సంఖ్యను సగానికి తగ్గించటమే లక్ష్యమని చైనా సైనిక వ్యవహారాల పత్రిక ‘పీఎల్‌ఏ డైలీ’ నిరుడు ప్రకటించింది.

పదాతి దళాల్లో 10 లక్షలమందిని... వైమానిక, నావికా దళాల్లోనూ గణనీయంగా సిబ్బందిని తగ్గించాలని అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ ఆలోచన. నిజానికి 1980 నుంచే ఈ విషయంలో చైనా నాయకత్వం శ్రద్ధ పెట్టింది. సైన్యాన్ని పరిమాణంలో కాకుండా గుణాత్మకంగా మిన్నగా ఉండేలా తీర్చిదిద్దాలనుకుంటున్నట్టు సాయుధ దళాల్లోని అన్ని విభాగాలనూ పర్యవేక్షించే సెంట్రల్‌ మిలిటరీ కమిషన్‌(సీఎంసీ) 2016 జనవరిలో ప్రకటించింది. ఆ తర్వాత కొన్నాళ్లకే మన దేశం కూడా ఆ దిశగా అడుగులేయడం ప్రారంభించింది. అప్పటి రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌ ఇందుకోసం రిటైర్డ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ డీబీ షెకత్కార్‌ నేతృత్వంలో 12మందితో ఒక కమిటీని నియమించారు. సైన్యం, త్రివిధ దళాల్లో సిబ్బంది సంఖ్యను తగ్గించి పటిష్టపరచడానికి, నిర్వహణా వ్యయాన్ని అదుపు చేయడానికి ఈ కమిటీ తగిన సిఫార్సులు చేయాలని అప్పట్లో సూచించారు. సాంకేతికత విస్తరించటం, రంగంలోకి ఎప్పటికప్పుడు కొత్త ఉపకరణాలు రావటం వగైరాల వల్ల అధిక సంఖ్యలో సైనిక సిబ్బంది ఉండాల్సిన అవసరం తగ్గిపోయింది. పైగా ఉన్న సిబ్బంది సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలను అందుకోవాల్సిన స్థితి ఏర్పడింది. ఉపగ్రహాలు అందించే డేటా, సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న కంప్యూటర్లు, కృత్రిమ మేధస్సు వినియోగం వంటివి నానాటికీ పెరుగుతున్నాయి. సైబర్‌ సంగ్రామంలో మెరికల్ని తయారు చేస్తే తప్ప వర్తమాన యుద్ధాలను గెలవటం అసాధ్యం.
 
మన రక్షణ రంగ వ్యయంలో సింహభాగం సిబ్బందికే వ్యయమవుతోంది. ఆయుధాలు, ఇతర అత్యాధునిక ఉపకరణాల కొనుగోలుకు 20 శాతంమించి ఖర్చుచేయటం సాధ్యపడటం లేదు. మూడేళ్లక్రితం త్రివిధ దళాల కమాండర్ల సదస్సులో ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ అగ్ర రాజ్యాలన్నీ తమ దళాలను తగ్గించుకుని సాంకేతికతపై ఆధారపడుతుంటే మనం మాత్రం సైనిక దళాల సంఖ్యను విస్తరించాలనుకుంటున్నామని, ఇది సరికాదని అభిప్రాయపడ్డారు. మన సైనిక దళాలు గత దశాబ్దకాలంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్నాయి. డిజిటలైజేషన్‌ పెరిగింది. కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లు సమర్ధవంతంగా వినియోగించగల విద్యావంతులైన యువకుల్ని తీసుకోవటం ప్రారంభించారు. దానికి తగినట్టుగా దళాల సామర్థ్యాన్ని మెరుగుపర్చుకోవాల్సి ఉంటుంది. న్యూఢిల్లీలోని సైనిక ప్రధాన కార్యాలయంలో అవసరమైన కన్నా అధిక సంఖ్యలో అధికారులు, ఇతర సిబ్బంది ఉన్నారని... అక్కడ వృథాగా ఉన్నవారిని కార్యనిర్వహణ క్షేత్రాల్లోకి మార్చవలసిన అవసరం ఉన్నదని సైనిక డాక్యుమెంటు చెబుతోంది. అలాగే బ్రిగేడియర్‌ ర్యాంకును పూర్తిగా రద్దు చేసి ఏకీకృత బ్రిగేడ్‌లు ఏర్పాటు చేయాలని, ఆ బ్రిగేడ్‌లకు మేజర్‌ జనరల్‌ స్థాయి అధి కారి నాయకత్వంవహించాలన్న ప్రతిపాదన ఉంది. ఇప్పుడున్న సాధారణ బ్రిగేడ్‌ వ్యవస్థలో దరిదాపు మూడు బెటాలియన్లు ఉంటాయి. ఒక్కో బెటాలియన్‌లో 900 నుంచి 1,100మంది సిబ్బంది ఉంటారు. ఏకీకృత బ్రిగేడ్‌లో ఇలాంటి బెటాలియన్ల సంఖ్యను నాలుగు నుంచి అయిదుకు పెంచాలని పత్రం ప్రతిపాదించింది. సరిహద్దుల్లో డివిజన్‌ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి ఈ ఏకీకృత బ్రిగేడ్‌లు నేరుగా సైనిక దళ ప్రధాన కార్యాలయానికి జవాబుదారీగా ఉండేలా రూపొందించాలన్న ఆలోచన ఉంది. ప్రస్తుతం ఒక సైనిక దళ ప్రధాన కార్యాలయం కింద మూడు డివిజన్‌లు, ఒక్కో డివిజన్‌ కింద మూడు బ్రిగేడ్‌లు ఉంటున్నాయి.

ఏ దేశమైనా శాంతియుత వాతావరణం ఏర్పడటానికి దోహదం చేస్తూనే యుద్ధం వచ్చే పక్షంలో సమర్థవంతంగా తలపడేందుకు వీలుగా సైన్యాన్ని తీర్చిదిద్దుకోవాల్సి ఉంటుంది. ఎందు కంటే యుద్ధాన్ని చాలాసార్లు శత్రువే నిర్ణయిస్తాడు. శాంతి అంటే రెండు యుద్ధాల మధ్య ఏర్పడే అయోమయ వాతావరణమేనని ఒక యుద్ధ తంత్ర నిపుణుడి అభిప్రాయం. దాంతో ఏకీభవించినా ఏకీభవించకపోయినా శాంతియుత వాతావరణం ఉన్నప్పుడే సైనికంగా పదును పెట్టుకోవాలి. వర్త మాన కాలానికి అనువైన స్మార్ట్‌ సైనికుల్ని రూపొందించుకోవాలి. సిబ్బందికి పెనుభారంగా ఉండే కాలం చెల్లిన పరికరాల వినియోగానికి స్వస్తి పలికి చేతుల్లో అమరే, సులభంగా ఎక్కడికైనా మోసు కుపోగలిగే ఉపకరణాలను పెంచుకోవాలి. దూరదృష్టితో, వివేకంతో ముందడుగేస్తే సమర్థవంత మైన సైనిక వ్యవస్థ రూపుదిద్దుకుంటుంది.
 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top