ఓటరు ఎటువైపు?!

Sakshi Editorial On Four State Elections Campaign End

దాదాపు రెండు నెలలుగా హోరెత్తుతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం బుధవారం సాయంత్రంతో ముగిసింది. శుక్రవారం జరగబోయే పోలింగ్‌కు ఎన్నికల యంత్రాంగం సర్వ సన్నద్ధమైంది. తెలంగాణతోపాటు ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల్లో ఇప్పటికే ఎన్నికలు పూర్తయ్యాయి. మరో రాష్ట్రం రాజస్తాన్‌ పోలింగ్‌ తెలంగాణతోపాటే జరగబోతోంది. ఇతర రాష్ట్రాల మాటెలా ఉన్నా తెలంగాణలో తొలిసారి జరగబోతున్న ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పక్షం అంతిమ విజేతగా నిలుస్తుందన్న అంశంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల సంఘం నవంబర్‌ 11న తెలంగాణ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసినా అంతకు నెల రోజుల ముందే టీఆర్‌ఎస్‌ తన అభ్యర్థుల్ని ఖరారు చేసుకుని ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టింది.

ప్రతి పార్టీ ఈ ఎన్నికలను చావో రేవో అన్నట్టు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాంగ్రెస్‌ తరఫున ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతోపాటు సీనియర్‌ నాయకులు, కేంద్ర మాజీ మంత్రులు రాష్ట్రా నికొచ్చి సభలూ, సమావేశాల్లో మాట్లాడారు. బీజేపీ నుంచి ప్రధాని నరేంద్రమోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా మొదలుకొని కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ సీనియర్‌ నాయ కులు వివిధ జిల్లాల్లో జరిగిన సభలూ, సమావేశాల్లో పాల్గొన్నారు. టీఆర్‌ఎస్‌ తరఫున ముఖ్య మంత్రి కె. చంద్రశేఖరరావు అన్నీ తానే అయి దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీ అభ్యర్థుల తరఫున విస్తృతంగా ప్రచారం చేశారు. ఎప్పటికప్పుడు పార్టీ వ్యూహానికి పదునుపెడుతూ పార్టీ శ్రేణులను ఉరికించారు. పార్టీ కీలక నేతలు తారకరామారావు, హరీశ్‌రావులు సైతం పలు నియోజక వర్గాల బాధ్యతలను తీసుకుని ప్రచారం చేశారు.

ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని సంకల్పించుకున్న కాంగ్రెస్‌...అందుకోసం తన చిరకాల ప్రత్యర్థి అయిన తెలుగుదేశంతో పొత్తుకు సైతం సిద్ధపడి సీపీఐని, తెలంగాణ జన సమితి(టీజేఎస్‌) లను కూడా కలుపుకొని ప్రజా కూటమి పేరుతో ఎన్నికల బరిలో నిల్చుంది. ఏం చేసైనా అధికారం అందుకుని తీరాలని తహతహలాడిన కాంగ్రెస్‌ పార్టీ అందుకు తగినట్టుగా సకాలంలో అభ్యర్థుల్ని మాత్రం ఖరారు చేసుకోలేకపోయింది. తమ పార్టీలోనూ, కూటమిలోనూ కూడా చివరి నిమిషం వరకూ గందరగోళాన్ని మిగిల్చింది. మిత్రపక్షాలకు కేటాయించిన కొన్ని స్థానాల్లో తన అభ్యర్థులకు బీ ఫారాలిచ్చింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు తేదీ అయిన నవంబర్‌ 22కు కూడా తేల్చ కపోవడంతో నాలుగైదుచోట్ల కూటమిలోని పక్షాలే పరస్పరం తలపడే పరిస్థితి ఏర్పడింది.

తెలంగాణలో నాలుగున్నరేళ్లుగా వివిధ అంశాలపై ఒంటరిగా పోరాడుతున్న కాంగ్రెస్‌ చివరి నిమి షంలో స్వీయ సామర్థ్యంపై నమ్మకం లేకనో, మీడియాలో కథనాలొస్తున్నట్టు భారీగా డబ్బు సమ కూరుస్తానన్న చంద్రబాబు ప్రలోభానికి లొంగిపోవడం వల్లనో... పొత్తుకు సిద్ధపడి రాజకీయంగా తప్పు చేసిందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్‌ పార్టీ ఎంత ఆత్మ విశ్వాసంతో పనిచేసిందో ఎవరూ మరిచిపోరు. 2004లో కేవలం అధిష్టానం ఒత్తిడి వల్ల ఆయన టీఆర్‌ఎస్‌తో పొత్తుకు అంగీకరించారు. 2009లో ఒంటరిగా పోటీకి దిగినా విజయం ఖాయమని అధిష్టానానికి నచ్చజెప్పి ఒప్పించి దాన్ని నిజం చేసి చూపారు.

కానీ రాహుల్‌గాంధీ మొదలుకొని స్థానిక నాయకత్వం వరకూ కాంగ్రెస్‌లో ఎవరూ ఇప్పుడు ఆ స్థాయి ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించలేక ‘పూలమ్మినచోటే కట్టెలమ్మిన’ తరహాలో చంద్రబాబు ప్రతిపాదించిందే తడవుగా దాన్ని శిరసావ హించారు. పోనీ సిద్ధపడితే పడ్డారు...కాంగ్రెస్‌ సగర్వంగా చెప్పుకోవడానికి అవకాశమున్న అత్యంత ప్రతిష్టాత్మక నిర్ణయాలను తమ సమక్షంలోనే చంద్రబాబు సొంత ఖాతాలో వేసుకుంటుంటే అచేతనులుగా గుడ్లప్పగించి చూశారు. ఐటీ అంకురార్పణ, శంషాబాద్‌ అంతర్జాతీయ విమానా శ్రయం, ఔటర్‌ రింగ్‌రోడ్డు వంటివన్నీ ఆయన తన ఘనతగా చెప్పుకుంటుంటే ‘కాద’ని చెప్పడానికి వారికి నోరు పెగల్లేదు. తెలంగాణలో కాంగ్రెస్‌కు అంతో ఇంతో ప్రతిష్ట మిగిలిందంటే అది వైఎస్‌ పుణ్యమే. కానీ ఆయన్ను స్మరించుకోలేని దుస్థితికి కాంగ్రెస్‌ నాయకులు దిగజారారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎన్ని స్థానాలొచ్చినా అది తనవల్లే సాధ్యమైందని ముందూ మునుపూ దబాయించడా నికి  చంద్రబాబుకు చేజేతులా అవకాశమిచ్చారు. నిజానికి తెలంగాణలో తెలుగుదేశం ప్రాభవం ముగిసి చాన్నాళ్లయింది. ఆ పార్టీలో పలుకుబడి ఉన్న నేతలు, కార్యకర్తల్లో అత్యధికులు టీఆర్‌ఎస్‌కు వలసపోయారు. ఇప్పుడున్నది నామ మాత్రావశిష్టమైన టీడీపీ మాత్రమే.

 చంద్రబాబు తన బ్రాండ్‌ మకిలిని కూటమిలోని ఇతర పక్షాలకు కూడా అంటించారు. మరి 48 గంటల్లో పోలింగ్‌ జరగబోతున్నదనగా తెలంగాణలోని వివిధ జిల్లాలు మొదలుకొని రాజధానిలోని కూకట్‌పల్లి వరకూ పట్టుబడుతున్న కరెన్సీ మూటలు, బంగారం నిల్వలు తెలంగాణ ప్రజల్ని దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. ఇందులో కరెన్సీ విలువ రూ. 129 కోట్లుకాగా, బంగారం విలువ రూ. 8 కోట్లని వార్తలొస్తున్నాయి. ఇవిగాక లక్షలాది రూపాయల మద్యం ఏరులై పారుతోంది. పట్టుబడిన డబ్బు, బంగారం నిల్వల్లో అధిక భాగం కూటమి అభ్యర్థులదే కావడం, ఇదంతా ఆంధ్రప్రదేశ్‌ నుంచే తరలి వచ్చిందని కథనాలు రావడం తెలంగాణ ప్రజల్ని మాత్రమే కాదు...అక్కడివారిని సైతం కలవరపరుస్తాయి. ఇంతవరకూ రూ. 129 కోట్ల మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నామని బుధ వారం రాత్రి పోలీసులు చేసిన ప్రకటన వెల్లడించిందంటే నాయకులు ఎంతకు దిగజారారో అర్ధమ వుతుంది. తెలంగాణ ప్రజలు రాజకీయంగా ఎంతో చైతన్యం ఉన్నవారు. వివేకమూ, విజ్ఞతా గల వారు. ధన, కనక, మద్య ప్రవాహాలతో ఏమార్చాలని చూసిన పార్టీలకూ, నేతలకూ తమ ఓటు ద్వారా గట్టిగా బుద్ధి చెప్పగలరని గత చరిత్ర చెబుతోంది. ఈ నెల 11న వెలువడే ఫలితాల్లో మరో సారి అదే ప్రస్ఫుటంగా ప్రతిఫలిస్తుందని ఆశిద్దాం.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top