సమగ్రత కొరవడిన బిల్లు | Sakshi Editorial On Anti Human Trafficking Bill | Sakshi
Sakshi News home page

Aug 7 2018 1:26 AM | Updated on Sep 2 2018 5:18 PM

Sakshi Editorial On Anti Human Trafficking Bill

ప్రతీకాత్మక చిత్రం

మనుషుల అక్రమ తరలింపును సమర్ధవంతంగా అరికట్టేందుకు వీలుగా చట్టం తీసుకురావాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించిన పద్నాలుగేళ్లకు ఆ అంశంపై రూపొందించిన బిల్లు లోక్‌సభ ఆమోదం పొందింది. వ్యక్తుల అక్రమ తరలింపు(నిరోధం, పరిరక్షణ, పునరావాసం) బిల్లు తొలిసారి మనుషుల్ని అమ్మడం, కొనడం నేరంగా పరిగణించింది. అత్యంత అనాగరికమైన ఈ దుర్మార్గం ప్రపంచంలోని అనేక దేశాలతోపాటు మన దేశంలో కూడా ఎన్నాళ్లనుంచో వేళ్లూనుకుంది. దీని వెనక మాఫియా ముఠాలు పని చేస్తున్నాయి. ఇంకా కళ్లు తెరవని పసి గుడ్డుల నుంచి బాల బాలికలు, యువతుల వరకూ దీని బారిన పడనివారంటూ లేరు. మాఫియా ముఠాలు బాధితులను ఒక రాష్ట్రంలో ఓ మూల నుంచి మరో మూలకు తరలించటం మాత్రమే కాదు...రాష్ట్రాలు దాటిస్తున్నారు. కొందరిని వేరే దేశాలవారికి అమ్ముతున్నారు. అలాగే బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్‌ తదితర దేశాలనుంచి యువతులను ఇక్కడకు తీసుకొచ్చే ముఠాలు కూడా ఉన్నాయి. ఈ దారుణాన్ని నిరోధించి, నేరగాళ్లను కఠినంగా శిక్షించడానికి అనువైన చట్టాలను తీసుకురావాలన్న ఐక్యరాజ్యసమితి ఒడంబడికపై మన దేశం కూడా సంతకం చేసింది. ఈమధ్య తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రిలో అనేకమంది పిల్లల్ని పో లీసులు కాపాడారు. చాక్లెట్లు ఆశ చూపటం దగ్గర నుంచి మాయమాటలు చెప్పి వలలో వేసుకోవటం వరకూ ఈ ముఠాలు అనేక రూపాల్లో మనుషుల్ని మాయం చేస్తున్నారు. ఇలా తరలిస్తున్న వారిని వివిధ రకాల పనులకు వినియోగిస్తున్నారు. బాలికలు, యువతులు అయితే వ్యభిచారంలోకి, మగ పిల్లల్ని వెట్టి చాకిరీకి అమ్మడం యధేచ్ఛగా సాగుతోంది. బాలికలపై అమానుషంగా హార్మోన్‌ ఇంజ క్షన్లు ప్రయోగించి వారిని చిన్న వయసునుంచే వ్యభిచారం రొంపిలోకి దింపుతున్నారు. పిల్లల అవయ వాలు తొలగించి వారిని భిక్షాటనకు వినియోగిస్తున్నారు. 

వలస పాలకుల హయాంలో 1860లో వచ్చిన భారతీయ శిక్షాస్మృతి(ఐపీసీ)లోని సెక్షన్‌ 370, 1976 నాటి వెట్టి చాకిరీ వ్యవస్థ(నిర్మూలన) చట్టం, 1956నాటి అనైతిక తరలింపు(నిరోధక) చట్టం ఇంతవరకూ మనుషుల అక్రమ తరలింపు కేసుల్లో పట్టుబడిన నిందితులపై ప్రయోగిస్తున్నారు. పిల్లల అక్రమ తరలింపుపై ఎన్నో ఫిర్యాదులొస్తున్నా దాన్ని నేరంగా పరిగణించాలని 2013 వరకూ కేంద్రం అనుకోలేదు. ఆ ఏడాది ఐపీసీ సెక్షన్‌ 370లో ఆ నేరాన్ని కూడా చేర్చారు. అయినా ఈ చట్టాలేవీ ఆచ రణలో అక్కరకు రాలేదు గనుకనే సమగ్రమైన కఠిన చట్టం తీసుకురావాలని ఆదేశించమంటూ సుప్రీం కోర్టులో 2004లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఇప్పుడు ప్రవేశపెట్టిన బిల్లు ఈ చట్టాలతో పోలిస్తే అనేక విధాల మెరుగైనదే. ముఖ్యంగా మనుషుల అక్రమ తరలింపును తొలిసారి ఒక సంఘ టిత నేరంగా గుర్తించింది. అది ప్రశంసించదగ్గది. అలాగే బాధితుల మానసిక, సామాజిక, ఆర్థిక సమ స్యలను కూడా ఇది పరిగణనలోకి తీసుకుంది. తమను అక్రమంగా తరలించారని బాధితులు నిరూ పించుకోవటం కాక, తాము నేరానికి పాల్పడలేదని నిందితులే రుజువు చేసుకోవాల్సిన స్థితి కల్పిం చటం కూడా ఆహ్వానించదగ్గదే. అయితే సమగ్రత పేరుతో తీసుకొచ్చిన కొన్ని అంశాలు బాధితులను ఇబ్బందుల్లో పడేస్తాయని పౌర సమాజ కార్యకర్తలు, బాలల హక్కుల కార్యకర్తలు, మహిళా సంఘాల ప్రతినిధులు, ఈ రంగంలో పనిచేసే న్యాయవాదులు అంటున్నారు. ఇప్పుడున్న చట్టాల్లో లోటు పాట్లున్నాయని చెబుతూ తీసుకొచ్చిన బిల్లులో సైతం సమగ్రత కొరవడితే అనుకున్న లక్ష్యమెలా నెర వేరుతుందని వీరు ప్రశ్నిస్తున్నారు. వీటిని పరిగణనలోకి తీసుకోవటంలో ప్రభుత్వానికొచ్చిన ఇబ్బందే మిటో అర్ధంకాదు.
ముఖ్యంగా అక్రమ తరలింపుల వల్ల బాధితులుగా మారేవారినీ, మరో దారి లేక వ్యభిచార వృత్తి చేస్తున్నవారినీ ఒకే గాటన కట్టడం ఈ బిల్లు ప్రధాన లోపం. ఇప్పుడున్న వివిధ చట్టాలు వ్యభిచారం చేస్తున్నవారిని నేరస్తులుగా పరిగణిస్తున్నాయి తప్ప విటులను నేరగాళ్లుగా గుర్తించటం లేదు. ఇప్పుడు తీసుకొచ్చిన బిల్లు చట్టమైతే పట్టుబడిన సెక్స్‌ వర్కర్లను వారి అభీష్టానికి భిన్నంగా పునరావాస కేంద్రా లకు తరలించాల్సి ఉంటుంది. అలాగే హెచ్‌ఐవీ వంటి ప్రమాదకర వ్యాధుల్ని సంక్రమింపజేసేవారికి బిల్లు కఠిన శిక్షలను ప్రతిపాదిస్తోంది. దీన్ని ఖచ్చితంగా సెక్స్‌వర్కర్లకు వ్యతిరేకంగా వినియోగిస్తారన్న అనుమానాలున్నాయి. అలాంటి భయం అవసరం లేదని బిల్లుపై చర్చ జరిగినప్పుడు మహిళా, శిశు సంక్షేమ మంత్రి మేనకాగాంధీ హామీ ఇచ్చారు. అయితే ఆ సంగతిని బిల్లు స్పష్టంగా చెప్పడం లేదు. దీని రూపకల్పనలో కేవలం సాంఘిక నైతికతను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు తప్ప రాజ్యాంగ నైతికతను పట్టించుకోలేదని మేనకా గాంధీకి సెక్స్‌వర్కర్లు లేఖ రాశారు. 

మనుషుల అక్రమ తరలింపు వ్యవహారం అత్యంత సంక్లిష్టమైనది. తమ పిల్ల లేదా పిల్లవాడు తప్పిపోయాడని పోలీస్‌స్టేషన్లకు ఫిర్యాదు చేయడానికెళ్తే వాటిని స్వీకరించటంలోనే అలసత్వం ప్రదర్శిస్తారు. తప్పిపోయింది యుక్త వయసు బాలికైతే పోలీసుల నుంచి వచ్చే హితవచనం ‘మీ అమ్మాయి ఎవరితోనైనా ఇష్టప్రకారం వెళ్లిపోయిందేమో చూసుకోండ’న్నదే. దిక్కూ మొక్కూ లేనివారి ఫిర్యాదులు వారికి పట్టనే పట్టవు. అందుకే పోలీసు విభాగాన్ని చైతన్యవంతం చేయాలి. మనుషుల అక్రమ తరలింపునకు సంబంధించి నిరుడు దేశవ్యాప్తంగా 8,132 కేసులు నమోదయ్యాయి. ఈ అక్రమ తరలింపుల్లో 59 శాతంమంది బాధితులు పిల్లలే. బాధితులపై మాదకద్రవ్యాలు, రసాయ నాలు, హార్మోన్లు ప్రయోగించటం, వెట్టిచాకిరీ చేయించటం వగైరాలను ఈ బిల్లు నేరాలుగా పరిగ ణించి వాటికి కఠిన శిక్షలు ప్రతిపాదించింది. గత మూడేళ్లుగా వివిధ సంస్థలతో, సంఘాలతో చర్చించి ఈ బిల్లు రూపొందించామంటున్నారు. అది నిజమే అయినా ఇప్పుడొస్తున్న అభ్యంతరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. అలాగైతేనే ఒక సమగ్రమైన చట్టం రూపుదాలుస్తుంది. మనుషుల తరలింపు దుర్మార్గం అంతమవుతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement