మాణిక్‌ సర్కార్‌ (మాజీ సీఎం) రాయని డైరీ

Madhav Writes On Manik Sarkar - Sakshi

ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. త్రిపుర కొత్త సీఎం విప్లవ్‌ కుమార్‌ కుదురుగా ఒకచోట కూర్చోకుండా డయాస్‌ మీద లెఫ్ట్‌ నుంచి రైట్‌కి, రైట్‌ నుంచి లెఫ్ట్‌కి కలియదిరుగుతున్నాడు.
నవ్వుతున్నాడు. నమస్తే పెడుతున్నాడు. ఎవరైనా అడ్డొస్తే, వాళ్లని చూసీ నవ్వుతున్నాడు, నమస్తే పెడుతున్నాడు. అంతే తప్ప ‘తప్పుకోండి’ అని మాత్రం అనడం లేదు. అలా నవ్వుతూ, నమస్తే పెడుతూ తప్పించడం బాగుంది!
డయాస్‌ మీద నేనూ ఓ పక్కగా కూర్చొని ఉన్నాను. నా పక్కనే లెఫ్ట్‌లో అద్వానీ, రైట్‌లో మురళీమనోహర్‌ జోషీ కూర్చొని ఉన్నారు. అద్వానీ పక్కన రాజ్‌నాథ్‌ సింగ్‌ ఉన్నారు.
ఇంకో వరుసలో నరేంద్ర మోదీ, అమిత్‌షా, రామ్‌ మాధవ్‌ ఉన్నారు. వాళ్ల వెనకే బీజేపీ రాష్ట్రాల సీఎంలు ఉన్నారు.
బీజేపీ వాళ్లను అంత దగ్గరగా చూడ్డం అదే మొదటిసారి నాకు!
విప్లవ్‌ కుమార్‌ మేమున్న వరుస వైపు వస్తున్నాడు. నవ్వుకుంటూ, నమస్తే పెట్టుకుంటూ వస్తున్నాడు. నెక్స్‌›్ట అతడు అద్వానీకో, జోషీకో, రాజ్‌నాథ్‌కో నమస్తే పెడతాడనుకున్నాను. కానీ నాకు పెట్టాడు!
జోషీ ఆకాశంలోకి, అద్వానీ అగాధంలోకి, రాజ్‌నాథ్‌.. ఆకాశానికీ, అగాధానికీ మధ్య ఉన్న ఏదో ప్లేస్‌లోకి ముఖం తిప్పుకుని కూర్చున్నారు. అందుకే విప్లవ్‌ కుమార్‌ నాకు నమస్తే పెట్టి ఉంటాడనుకున్నాను.
నమస్తే పెట్టాక, సడన్‌గా కిందికి వంగాడు విప్లవ్‌ కుమార్‌. జోషీకో, అద్వానీకో, రాజ్‌నాథ్‌కో పాదాభివందనం చేయబోతున్నాడని అనుకున్నాను. కానీ నాకు చేశాడు!
జోషీ, అద్వానీ, రాజ్‌నాథ్‌ల ముఖాలు అందుబాటులో లేకపోవచ్చు. వాళ్ల పాదాలైతే అందుబాటులోనే ఉన్నాయి కదా! మరి నాకెందుకు పాదాభివందనం చేసినట్టు?!
‘‘నన్ను దీవించండి మాణిక్‌జీ’’ అన్నాడు విప్లవ్‌కుమార్‌.
భుజాలు పట్టుకుని పైకి లేపాను.
‘‘నాకు మీ బ్లెస్సింగ్‌ కావాలి మాణిక్‌జీ’’ అన్నాడు మళ్లీ.
‘‘నేనేమి ఇవ్వగలను విప్లవ్‌. ఇరవై ఏళ్లుగా నేను ఏమీ ఇవ్వలేదనే కదా నిన్ను ఎన్నుకున్నారు త్రిపుర ప్రజలు’’ అన్నాను.
‘‘ఎప్పుడైనా నాకు డౌట్‌లు వస్తే మీకు ఫోన్‌ చేస్తాను మాణిక్‌జీ. అప్పుడు మీరు నా ఫోన్‌ లిఫ్ట్‌ చెయ్యాలి’’ అన్నాడు.
‘‘డౌట్‌లు అడగటానికి మీ మోదీజీ, మీ అమిత్‌జీ ఉన్నారు కదా విప్లవ్‌’’ అన్నాను.
‘‘వాళ్లే చెప్పారు మాణì క్‌జీ.. ముందుగా పెద్దల్ని గౌరవించాలని’’ అన్నాడు, మళ్లీ కాళ్ల మీద పడబోతూ. వద్దొద్దన్నాను.
బీజేపీలో ఇదొకటి బాగుంటుంది. ఫామ్‌లో లేని పెద్దల్ని గౌరవించడం!
- మాధవ్‌ శింగరాజు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top