రాయని డైరీ

Madav Shingaraju Rayani Dairy On Sitharam Yechuri - Sakshi

మాధవ్‌ శింగరాజు

సీపీఎం గొప్పతనం ఇదే! అందరూ ఒక మాట మీద ఉంటారు. విడిగా మళ్లీ ప్రతి ఒక్కరూ ఒక మాటతో ఉంటారు. ఎంతమంది ఉంటే అన్ని మాటలు. ఎన్ని మాటలుంటే అన్ని సిద్ధాంతాలు. సమావేశాలయ్యే సరికి అంతా ఒక మాట మీదకు వచ్చేస్తారు. అందరూ కలిసి స్టేజీ మీద ఒక మనిషినే నిలబెట్టి మిగతావాళ్లంతా కిందికి వెళ్లి, కార్మికుల్లో కలిసిపోతారు! 

ఐదు రోజులుగా హైదరాబాద్‌లో తలా ఒక మాట మాట్లాడుతున్నాం. ముందు ప్రకాశ్‌ కారత్‌ ఒక మాట మాట్లాడాడు. తర్వాత నేనొక మాట మాట్లాడాను. నేను మాట్లాడిన మాటపై, కారత్‌ మాట్లాడిన మాటపై మళ్లీ ఒక్కొక్కరూ ఒక్కో మాట మాట్లాడారు. కారత్‌ మాట్లాడిన మాట, జనవరిలో నేను మాట్లాడిన మాటకు ఎదురుమాట. 

సీపీఎంలో ఎవరూ వెంటనే మాటకు మాట అనేయరు. మళ్లీ వచ్చే జాతీయ మహాసభల వరకు ఆగుతారు. మాట అంటున్నప్పుడే ఒకవేళ మహాసభలు ముగిస్తే, పనిలో పనిగా మాట అనేసి స్టేజీ దిగిపోరు. స్టేజీ దిగిపోయాక.. మళ్లీ మూడేళ్లకు మహాసభల్లో మాట్లాడ్డానికి సిద్ధమౌతారు. డిసిప్లీన్‌!

సీపీఎంలో ఉన్న మరో డిసిప్లీన్‌.. ఎవరు ఎవరి మాటకైనా ఎదురు చెప్తారు. ఎదురు చెప్పకపోతే ఎందుకు ఎదురు చెప్పలేదని ప్రశ్నిస్తారు. ‘నీకొక సిద్ధాంతం లేదా?’ అని నిలదీస్తారు. ‘నీ మాటతో నేను ఏకీభవిస్తున్నాను. అందుకే ఎదురు చెప్పలేదు’ అని ఎవరైనా అంటే.. ‘ఏకీభవించడం కూడా మన పార్టీలో ఒక సైద్ధాంతిక విభేదమే కదా! విభేదించకుండా నువ్వసలు పార్టీ మనిషివెలా అవుతావని అడుగుతారు. 

శుక్రవారం నా మాట మీద, కారత్‌ మాట మీద పద్దెనిమిది గంటల డిబేట్‌ జరిగింది.  ‘బీజేపీని ఓడిద్దాం. కాంగ్రెస్‌ని దూరంగా పెడదాం’ అంటాడు కారత్‌. ‘బీజేపీని ఓడిద్దాం. కాంగ్రెస్‌కి దూరంగా ఉందాం’ అంటాను నేను. దూరంగా పెట్టడమా, దూరంగా ఉండడమా అనే దానిపై డెలిగేట్స్‌ అంతా తలా ఒక మాట వేశారు.  ‘దూరంగా పెట్టడం’, ‘దూరంగా ఉండడం’ అనే మాటలకు మూడొందల డెబ్బై మూడు సవరణలు చేశారు.

కారత్‌ మాట నెగ్గితే ఈసారి మాణిక్‌ సర్కార్‌ కానీ, బృందాకారత్‌ కానీ, బీవీ రాఘవులు గానీ సీపీఎం ప్రధాన కార్యదర్శి అవుతారని మా ఇంటికి వచ్చే పేపర్‌ రాసింది. 
వెంటనే కారత్‌కి ఫోన్‌ చేసి, ‘‘మీ ఇంటికొచ్చే పేపర్‌ ఏం రాసింది కామ్రేడ్‌’’ అని అడిగాను. ‘‘మాణిక్‌ కానీ, బృందా కానీ, రాఘవులు కానీ ప్రధాన కార్యదర్శులు కాకపోతే ఏచూరి మాటే నెగ్గినట్లు అని రాశాయి కామ్రేడ్‌’’ అని చెప్పాడు. 

‘నీమాటే నెగ్గుతుంది అన్నాడు కానీ, మళ్లీ రెండోసారి కూడా నువ్వే కార్యదర్శివి అవుతావు కామ్రేడ్‌’ అనే మాట అనలేకపోయాడు కారత్‌!

సీపీఎంలో ప్రధాన కార్యదర్శి పదవికున్న వాల్యూ అది! దేశ ప్రధాని పదవినైనా వదులుకుంటారు కానీ, పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని ఇంకొకరికి పోనివ్వరు.
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top