నీరు లేదని... ఆ...‘పరేషాన్‌’

surgeries stopped for water supply in kakinada sarvajana hospital - Sakshi

జిల్లా పెద్దాసుపత్రిలో వి‘చిత్రం’

నిర్లక్ష్యానికి పరాకాష్ట

మోటార్లు పాడైనకారణంగానే: సూపరింటెండెంట్‌

భానుగుడి (కాకినాడ సిటీ): రక్తం కొరతతో శస్త్ర చికిత్సలు వాయిదా వేస్తారు ... సంబంధిత వైద్య నిపుణులు లేకపోయినా వాయిదా వేడయం చూశాం...కానీ కేవలం నీటి సరఫరా నిలిచిపోయిందంటూ ఆపరేషన్లు చేయకపోవడం విచిత్రమే. ఇది ఏ మారుమూలనో ఉన్న ఆసుపత్రిలో చోటుచేసుకుందంటే ‘సరేలే’ అని సరిపెట్టుకోవచ్చు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న కాకినాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోనే ఈ దుస్థితి నెలకొంది. రెండు జిల్లాలకు అతి పెద్ద పేదల ఆసుపత్రిగా గుర్తింపుపొందిన ఇక్కడ నీళ్ల సరఫరా లేదంటూ ముందస్తుగా తేదీలు  ఇచ్చిన రోగులకు కూడా తిరిగి పంపించేస్తున్నారు. రోజుల తరబడి ఆసుపత్రి చుట్టూ తిరిగితే గానీ ఆపరేషన్లు చేసేందుకు సంబంధిత వైద్యులు నిర్ధిష్ట తేదీని ఇవ్వరు.

ఆ తేదీ నాటికి సిద్ధపడి ...కుటుంబ సభ్యులతో అన్నీ సర్దుకొని వస్తే ఇలా చేస్తారా అని రోగులు మండిపడుతున్నారు. ఒకటి, రెండు కాదు గురువారం ఒక్క రోజునే 14 శస్త్ర చికిత్సలు నిలిపివేశారు. కాకినాడ జీజీహెచ్‌లో ట్విన్‌ ఆఫరేషన్‌ థియేటర్స్‌ (టీఓటీ), ఆర్థోపెడిక్‌ ఆపరేషన్‌ థియేటర్‌లో నీటి సరఫరా లేకపోవడంతో ఈ దుస్థితి ఏర్పడింది.  ఈ సంఘటనతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు పలు అవస్థలకు గురయ్యారు. దీనిపై ఆసుపత్రి సూపరిండెంట్‌ ఎం.రాఘవేంద్రరావును వివరణ కోరగా ఆపరేషన్‌ థియేటర్లకు వెళ్లాల్సిన వాటర్‌ మోటార్లు పాడైపోయిన కారణంగా ఈ రోజుకు ఆపరేషన్లు నిలుపుదల చేశామన్నారు. త్వరితగతిన మోటార్లు మరమ్మతు చేయించే ఏర్పాట్లు చేయాలని మెకానిక్‌లకు ఆదేశించామని తెలిపారు.

Read latest East Godavari News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top