ప్రసిద్ధ లక్ష్మీమాత మందిరాలు

Famous Laxmi Goddess Temples Around India - Sakshi

దీపావళి పర్వదినం సందర్భంగా లక్ష్మీమాతకు చాలా ప్రాశస్య్తం ఉంది. దీపావళి పండుగ మూడో రోజున లక్ష్మీదేవి తన భక్తుల ఇంటికి వెళుతుంది. అమ్మవారిని ఇంటిలోకి రమ్మనడానికి ప్రతీకగా భక్తులు తమ ఇంటి గుమ్మాల దగ్గర దీపాలు వెలిగించి లోనికి ఆహ్వానిస్తారు. దేశంలో భిన్న రూపాలలో, అవతారాలలో కొలువుదీరిన లక్ష్మీమాతకు పూజ చేస్తారు. హిందూ సంప్రదాయంలో లక్ష్మీదేవి సిరి సంపదల దేవత.  ఐశ్వర్యలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, రాజ్యలక్ష్మి, వరలక్ష్మి అనే పేర్లతో కూడా అమ్మవారిని పూజిస్తారు. సంపద, సుఖసంతోషాలు, సతానం కోసం లక్ష్మీదేవిని పూజిస్తారు. దీపావళి సందర్భంగా దేశంలోని ప్రసిద్ధమైన లక్ష్మీదేవి ఆలయాలు ఇవి..

1) లక్ష్మీ నారాయణ మందిరం( బిర్లా మందిరం), న్యూఢిల్లీ


 ఈ ఆలయంలో విష్ణుమూర్తి లక్ష్మీదేవి సహితంగా మనకు దర్శనమిస్తారు. ప్రసిద్ధ మందిరంగానే కాక, ఢిల్లీలో  ప్రముఖ పర్యాటక క్షేత్రంగా పేరొందింది. ఈ మందిరంలో దీపావళితో పాటు శ్రీ కృష్ణుని జన్మష్టామి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. అంతేకాక గుడి చుట్టూ  శివుడు, రామభక్త హనుమాన్, వినాయకుడు,  దుర్గ మాత మందిరాలతో పాటు చిన్న బౌద్ధ మందిరం కూడా ఉంది.

2)శ్రీపురం గోల్డెన్‌ టెంపుల్‌, వెల్లూర్‌


ఈ మందిరం తమిళనాడులోని  (వేలూరు) వెల్లూర్‌లో ఉంది. గర్భగుడికి మూడు వైపులా నీరు , ఒకవైపు ద్వారం వుంటుంది.   మలైకుడి ప్రాంతానికి దగ్గర్లోని చిన్న కొండపై లక్ష్మీదేవి కొలువై ఉంది. గర్భగుడి బంగారంతో కప్పబడి, సువర్ణ రంగులో మిళితమై ఉండటం చేత దీనికి బంగారు గుడి అనే మరో పేరుంది. దేశంలోని అతిపెద్ద మందిరాలలో శ్రీపురం ఆలయం ఒకటి. 

3)మహలక్ష్మీ మందిరం, కొల్హాపూర్


హిందువుల పవిత్ర 108 శక్తి పీఠాలలో ఒకటైన కొల్హాపూర్ ప్రముఖ తీర్ధ స్థలంగా ప్రసిద్ధిగాచింది. నవరాత్రుల సందర్భంగా అంబాదేవిగా కొనియాడబడే ఈ దేవి దర్శనానికి.. భక్తులు కొల్హాపూర్‌కు తండోపతండాలుగా క్యూ కడతారు. స్వయంగా లక్ష్మీదేవి నడియాడిన నేల కావడంతో... విష్ణుదేవునికి ఈ ఆలయక్షేత్రం అంటే చాలా ఇష్టమని భక్తుల నమ్మిక. చాలుక్యులు నిర్మించిన ఈ మందిరం మహారాష్ట్రలో పూనేకు సమీపంలో ఉంది. 

4)అష్టలక్ష్మీ మందిరం, చెన్నె


ఈ ఆలయంలో లక్ష్మీమాత ఎనిమిది రూపాలకు పూజ చేస్తారు. అష్టలక్ష్మి -  ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి అవతారాలలో దర్శనమిస్తుంది. అష్టలక్ష్మీ ఆలయం చెన్నెలోని ఇలియట్స్ బీచ్\ బీసెంట్‌ బీచ్‌కు సమీపంలో ఉంది.  సంపద, జ్ఞాన దేవతయిన అష్టలక్ష్మి, భక్తుల కోర్కెలు నెరవేర్చే దేవతగా పేరొందింది. 

5)లక్ష్మీదేవి మందిరం, హసన్‌


తొలితరం హోయసలుల నిర్మాణ శైలి ఈ ఆలయంలో ఉట్టిపడుతుంది. కర్ణాటకలోని హసన్‌ దగ్గర ఉన్న ఈ ఆలయంలో ప్రాచీన వాస్తుకళ మనకు కనిపిస్తుంది.

6)మహలక్ష్మీ మందిరం, ముంబై 


మహారాష్ట్రలో ఉన్న ఈ ఆలయం ముంబైవాసులకు అత్యంత ప్రీతి పాత్రమైంది. ఆలయంలో మహాకాళి, మహాలక్ష్మీ, మహా సరస్వతి రూపాలు దర్శనమిస్తాయి. హార్న్‌బీ వెల్లార్డ్‌ నిర్మాణం చేపడుతున్నపుడు, పాథారే ప్రభు అనే ఇంజనీరుకు వర్లి సమీపంలో దేవి విగ్రహం ఉందనే కల వస్తుంది. దీంతో అక్కడి పరిసరాల్లో తవ్వకాలు చేపట్టిన అతనికి లక్ష్మీమాత విగ్రహం దొరుకుతుంది.  వెంటనే ఆలయాన్ని నిర్మించి, లక్ష్మీదేవి విగ్రహాన్ని ప్రతిష్టించారు.

Read latest Festival News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top