
వెన్నపూస గోపాల్ రెడ్డికి వైఎస్ఆర్ సీపీ మద్దతు
రాయలసీమ వెస్ట్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గం అభ్యర్థిగా వెన్నపూస గోపాల్ రెడ్డిని వైఎస్ఆర్సీపీ బలపరుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి 2017 మార్చిలో జరగనున్న ఎన్నికల్లో రాయలసీమ వెస్ట్(కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల) గ్రాడ్యుయేట్ నియోజకవర్గం అభ్యర్థిగా వెన్నపూస గోపాల్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరుస్తోంది. ఈ మేరకు పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన నిర్ణయాన్ని గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు.
గోపాల్ రెడ్డి అభ్యర్థిత్వానికి, పట్టభద్రుల నియోజకవర్గం ఓటర్ల నమోదు మొదలు ఆయన విజయం సాధించేంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గాల కోఆర్డినేటర్లు, పార్టీకి చెందిన ఇతర నాయకులు, కార్యకర్తలు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని పార్టీ అధినేత వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు.
గోపాల్ రెడ్డి గతంలో ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన విషయం తెలిసిందే. 1975 నుంచి 1978 వరకు భారత సైన్యంలో పారా ట్రూపర్ గానూ, ఆ తరువాత కో ఆపరేటివ్ డిపార్ట్ మెంట్లో సేవలు అందించారు. టీచర్లు, ఉద్యోగులు, వర్కర్ల జేఏసీకి ఆయన ఛైర్మన్ గానూ వ్యవహరించారు.