
సెల్‌టవర్ ఎక్కిన యువకుడు
మండలాన్ని శంషాబాద్ జిల్లాలో కలపాలని కోరుతూ ఓ యువకుడు ఆదివారం సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశాడు. మొయినాబాద్ మండలాన్ని శంషాబాద్ జిల్లాలో కలపుతామని ప్రభుత్వం ప్రకటించకపోతే టవర్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు.
⇒ అర గంటపాటు మండల కేంద్రంలో కలకలం
⇒ పోలీసులు, అఖిలపక్షం నాయకుల జోక్యంతో కిందికి దిగిన వైనం
మొయినాబాద్: మండలాన్ని శంషాబాద్ జిల్లాలో కలపాలని కోరుతూ ఓ యువకుడు ఆదివారం సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశాడు. మొయినాబాద్ మండలాన్ని శంషాబాద్ జిల్లాలో కలపుతామని ప్రభుత్వం ప్రకటించకపోతే టవర్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు. అరగంటపాటు టవర్‌పైనే కూర్చొని కలకలంరేపాడు. పోలీసులు, అఖిలపక్షం నాయకుల జోక్యంతో కిందికి దిగివచ్చాడు. మొయినాబాద్‌ను శంషాబాద్‌లో కలపాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో మండల కేంద్రంలో రిలే నిరహార దీక్షలు చేపడుతున్నారు. అన్ని గ్రామాల అంబేద్కర్ యువజన సంఘాల అధ్యక్షులు, సభ్యులు దీక్షలో ఆదివారం కూర్చున్నారు. దీక్ష కొనసాగుతుండగానే మొయినాబాద్‌కు చెందిన కంజర్ల నరేష్ రోడ్డుపక్కనే ఓ భవనంపై ఉన్న సెల్ టవర్‌పైకి ఎక్కాడు.
మొయినాబాద్, శంషాబాద్‌లో కలపకపోతే ఇక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటాని పెద్దగా కేకలు వేయడంతో కిందన్న జనం అతన్ని చూశారు. కిందకు దిగాలని ఎంత అరిచినా దిగలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు భవనంపైకి ఎక్కి అతన్ని కిందకి రావాలని కోరారు. అయినా రాకపోవడంతో అఖిలపక్షం నాయకులు భవనంపైకి వెళ్లి కిందకు దిగాలని కోరారు. ఉద్యమాన్ని శాంతియుతంగా చేపట్టి డిమాండ్‌ను సాధించుకోవాలని నచ్చజెప్పారు. అరగంటపాటు సెల్‌టవర్‌పైనే ఉన్న యువకుడు చివరకు పోలీసులు, అఖిలపక్షం నాయకుల జోక్యంతో కిందికి దిగాడు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం పలువురు నాయకులు, యువకులు అతనికి పూలమాలలు వేసి సన్మానించారు. మొయినాబాద్ మండలాన్ని శంషాబాద్ జిల్లాలో కలపకపోతే ప్రాణత్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆ యువకుడు తెలిపాడు.