
ఎస్‌ఐ తీరుకు నిరసనగా మహిళల ధర్నా
ఎస్‌ఐ అభిమన్యు తీరుకు నిరసనగా దళిత మహిళలు పోలీస్ స్టేషన్ వద్ద శుక్రవారం ధర్నా చేశారు.
- దళిత మహిళపై చేయిచేసుకున్న ఎస్‌ఐ
- ఆగ్రహించిన గ్రామస్తులు
- స్టేషన్ వద్ద ఆందోళన
కురుమద్దాలి(పామర్రు) : ఎస్‌ఐ అభిమన్యు తీరుకు నిరసనగా దళిత మహిళలు పోలీస్ స్టేషన్ వద్ద శుక్రవారం ధర్నా చేశారు. మహిళలను అన్యాయంగా దుర్భాషలాడడంటూ ఆరోపించారు. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. గ్రామంలో పేకాటాడుతున్న వారిపై దాడులు నిర్వహించేందుకు పామర్రు ఎస్‌ఐ బి.అభిమన్యు గ్రామానికి వచ్చారు. పేకాట శిబాబిరానికి దగ్గరలో కోటే వెంకటేశ్వరమ్మ దుస్తులు ఉతుక్కుని వెళ్తూ పోలీసులు వస్తున్నారని పేకాటరాయుళ్లకు సమాచారం ఇచ్చింది.
పేకాటారాయుళ్లు పరారయ్యారు. దీంతో ఎస్‌ఐ కోటేశ్వరమ్మపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేయిచేసుకున్నారు. ఈ విషయమై మహిళలు ఎస్‌ఐని నిలదీశారు. అయినా పట్టించుకోకుండా మహిళలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెళ్లిపోయారు. ఆగ్రహించిన మహిళలు పామర్రు పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. ఎస్‌ఐ రావాలి మాకు క్షమాపణ చెప్పాలంటూ నినాదాలు చేశారు. స్టేషన్ ఎదురుగా విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారిపై రాస్తారోకోకు ప్రయత్నించారు.
న్యాయం చేసేందుకు ఎమ్మెల్యే, డీఎస్పీ హామీ..
ఆందోళన చేస్తున్న స్టేషన్ వద్దకు పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన, గుడివాడ డీఎస్పీ అంకినీడు ప్రసాద్ వచ్చారు. డీఎస్పీ మాట్లాడుతూ ఎస్‌ఐ తప్పు చేస్తే తగు విధమైన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అయి నా మహిళలు శాంతించ లేదు. గ్రామ ప్రముఖుడు కొరరాజు రాంబాబు పోలీసులతో చర్చించి న్యాయం చేసే విధంగా చూస్తానని చెప్పడంలో ఆందోళన విరమించారు.