కోరిక తీర్చనందుకు ఉన్మాదిలా మారిన వ్యక్తి.. ఓ వితంతువును సజీవ దహనం చేసిన ఘటన వరంగల్ జిల్లా పరకాల మండలం కామారెడ్డిపల్లిలో చోటుచేసుకుంది.
పరకాల: కోరిక తీర్చనందుకు ఉన్మాదిలా మారిన వ్యక్తి.. ఓ వితంతువును సజీవ దహనం చేసిన ఘటన వరంగల్ జిల్లా పరకాల మండలం కామారెడ్డిపల్లిలో చోటుచేసుకుంది. పరకాల సీఐ బి.మల్లయ్య కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన తిక్క లలిత(35) భర్త కుమారస్వామి ఎనిమిదేళ్ల క్రితం మృతి చెందాడు. అప్పటి నుంచి ఆమె కూలీ పనులు చేస్తూ ముగ్గురు పిల్లలను పోషిస్తోంది. అయితే రెండేళ్లుగా అదే గ్రామానికి చెందిన కొయ్యడ రాజేశ్ తో ఆమెకు వివాహేతర సంబంధం కొనసాగుతోంది.
వీరిద్దరి వ్యవహారన్ని పసిగట్టిన రాజేశ్ భార్య.. 8 నెలల క్రితం పెద్దలను ఆశ్రయించగా, మరోసారి వారిద్దరు కలవొద్దని హెచ్చరించి వదిలేశారు. అప్పటి నుంచి లలిత దూరంగా ఉంటుండగా రాజేష్ మాత్రం బలవంతం చేస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఒంటరిగా ఉన్న లలిత వద్దకు వచ్చిన రాజేష్ తన కోరిక తీర్చమని బలవంతం చేశాడు. లలిత నిరాకరించడంతో ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. 95 శాతం కాలిన గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న లలితను 108లో ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతిచెందింది. మృతురాలి పెద్ద కుమారుడు దిలీప్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.