గుడివాడ పట్టణానికి చెందిన ఓ మహిళ డెంగ్యూతో మృతి చెందింది.
గుడివాడ టౌన్ (కృష్ణా జిల్లా): గుడివాడ పట్టణానికి చెందిన ఓ మహిళ డెంగ్యూతో మృతి చెందింది. వివరాల ప్రకారం.. స్థానిక ఎన్టీఆర్ కాలనీకి చెందిన మర్రాపు లక్ష్మీకుమారి(45) గత మంగళవారం జ్వరంతో బాధపడుతూ పట్టణానికి చెందిన ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్ళారు. వైద్య పరీక్షల అనంతరం గురువారం మెరుగైన వైద్యం కోసం తేలప్రోలులోని మరో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
డెంగ్యూ వ్యాధి సోకిందని, దాని తీవ్రత అధికంగా ఉందని, ప్లేట్లెట్లు ఎక్కించాలని వైద్యులు సూచించారని బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. వైద్యం చేస్తుండగా ఆమె శనివారం రాత్రి మృతి చెందినట్లు ఆమె బంధువులు ఆదివారం ఉదయం తెలిపారు. ఆమెకు భర్త, ఇరువురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.