వెలగని ‘దీపం’ | Sakshi
Sakshi News home page

వెలగని ‘దీపం’

Published Sat, Jul 9 2016 4:13 AM

వెలగని ‘దీపం’

పథకానికి లబ్ధిదారులు కావలెను..
గడువు ముగిసినా పూర్తి కాని ఎంపిక
అధికారుల నిర్లక్ష్యంతో ఎంపిక ఆలస్యం
నియోజకవర్గానికి 5వేల గ్యాస్ కనెక్షన్లు

 ఖమ్మ జెడ్పీసెంటర్ : దీపం పథకం ద్వారా నిరుపేదలు గ్యాస్ స్టవ్‌పై వంట చేసుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి.. రాయితీపై కనెక్షన్లు మంజూరు చేస్తోంది. అధికారుల నిర్లక్ష్యమో.. లబ్ధిదారుల అవగాహనా లోపమో కనెక్షన్లు పొందేందుకు ముందుకు రావడం లేదు. జూన్ నెలాఖరులోగా గడువు ముగిసినప్పటికీ లబ్ధిదారుల ఎంపిక ఇంకా పూర్తి కాలేదు. కనెక్షన్లు తీసుకునేందుకు లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదనే అధికారుల వాదన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి వెళ్లగా.. ఆయన ఆదేశాల మేరకు జేసీ దివ్య దీపం కనెక్షన్లు పొందే వారి కోసం బంపర్ ఆఫర్ ప్రకటించారు. రూ.1,970లకే గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలని సర్క్యులర్ జారీ చేశారు. దీపం పథకం కింద జిల్లాకు 50వేల గ్యాస్ కనెక్షన్లు మంజూరయ్యాయి. పది నియోజకవర్గాలకు.. ఒక్కో దానికి 5వేల కనెక్షన్లు జూన్ నాటికి అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ నెలాఖరులోగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి.. కనెక్షన్లు పంపిణీ చేయాల్సి ఉంది. 50వేల కనెక్షన్లకు.. 38,588 మందికి ఇచ్చేందుకు నిర్ణయించి.. 28,581 మంది లబ్ధిదారులకు మాత్రమే పంపిణీ చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల  లబ్ధిదారుల ఎంపిక నెలల తరబడి సాగుతోంది. 

అర్హులు వీరే..
నిరుపేద ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, గతంలో గ్యాస్ కనెక్షన్ తీసుకోని వారు దీపం పథకానికి అర్హులు. గ్యాస్ కనెక్షన్లను నగదు చెల్లించి.. కొనుగోలు చేయని వారికి ప్రభుత్వం సబ్సిడీపై సిలిండర్, స్టవ్, పాస్ పుస్తకం అందిస్తోంది. లబ్ధిదారుల ఎంపికకు ఆధార్‌ను ప్రమాణికంగా తీసుకుంటారు. డీలర్‌కు లబ్ధిదారులు రూ.1,970 అందజేస్తే.. కనెక్షన్‌తోపాటు నిండు సిలిండర్, స్టవ్, రెగ్యులేటర్, పైపు ఇస్తారు.

 ఎంపీడీఓలదే బాధ్యత
మండలస్థాయిలో లబ్ధిదారుల ఎంపిక బాధ్యత ఎంపీడీఓలదే. నిరుపేదలకు మాత్రమే పథకం వర్తింపజేయాల్సి ఉంటుంది. లబ్ధిదారుల గుర్తింపు పూర్తయిన తరువాత ఆ జాబితాను గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లో ప్రదర్శించాల్సి ఉంటుంది. మూడు రోజులు గ్రామసభలు నిర్వహించి.. ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన తరువాత తుది జాబితా మండల స్థాయిలోనే ఖరారు చేస్తారు. అక్కడ ఖరారు చేసిన తుది జాబితాను ఎంపీడీఓల ద్వారా డీఆర్‌డీఏ పీడీకి.. అక్కడి నుంచి కలెక్టర్‌కు పంపుతారు. కలెక్టర్ ఆమోదం తరువాత లబ్ధిదారులకు మంజూరు పత్రాలు, గ్యాస్ కనెక్షన్లు ఇస్తారు.

 వెనుకబాటు
జిల్లాకు మంజూరైన 50వేల గ్యాస్ కనెక్షన్లకు.. 40,837 మంది లబ్ధిదారులను గుర్తించామని.. 38,588 మందికి కనెక్షన్లు ఇచ్చేందుకు చర్యలు చేపట్టామని అధికారులు పేర్కొంటున్నారు. అయితే మొత్తం 28,581 కనెక్షన్లు మంజూరు చేసినట్లు నివేదికల్లో పేర్కొంటున్నారు. ఇంకా 10వేల కనెక్షన్లకు లబ్ధిదారులను గుర్తించడం కష్టంగా మారినట్లు అధికారులు పేర్కొంటున్నారు. కనెక్షన్లు ఇస్తామని చెబుతున్నా లబ్ధిదారులు ముందుకు రావడం లేదని అధికారుల వాదన. జిల్లాలో ఆరు మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ ఉండగా.. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 4,123 దీపం కనెక్షన్లకు.. 1,908 మంది లబ్ధిదారులను గుర్తించగా.. 1,058 మందికి కనెక్షన్లు మంజూరు చేశారు. కొత్తగూడెం మున్సిపాలిటీలో 987 కనెక్షన్లకు.. 770 మంజూరు చేశారు. మణుగూరు మున్సిపాలిటీలో 591 కనెక్షన్లకు.. 41 మందికి మాత్రమే పంపిణీ చేశారు. మణుగూరు మండలంలో 859 కనెక్షన్లకు.. 505 మందికి పంపిణీ చేశారు. ఇల్లెందు మున్సిపాలిటీలో 603 కనెక్షన్లకు.. ఒక్కరికి కూడా పంపిణీ చేయలేదు.

Advertisement
Advertisement