గోపాల్ రెడ్డిని గెలిపించండి
పార్టీకి కార్యకర్తలే మూలస్తంభాలని, ఎమ్మెల్సీ అభ్యర్థి గోపాల్‌రెడ్డిని ముందుండి గెలిపించుకోవాలని కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక పిలుపునిచ్చారు.
– ఎమ్మెల్సీ ఎన్నికల అవగాహన సదస్సులో ఎంపీ బుట్టా రేణుక
కర్నూలు (ఓల్డ్‌సిటీ): పార్టీకి కార్యకర్తలే మూలస్తంభాలని, ఎమ్మెల్సీ అభ్యర్థి గోపాల్‌రెడ్డిని ముందుండి గెలిపించుకోవాలని కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక పిలుపునిచ్చారు. బుధవారం సాయంత్రం స్థానిక రాయల్ ఫంక్షన్ హాల్‌లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అవగాహన సదస్సు జరిగింది. కార్యక్రమానికి వైఎస్‌ఆర్‌సీపీ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ ఖాన్ అధ్యక్షత వహించారు. ఎంపీ బుట్టా రేణుక, ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎన్నికల జిల్లా సమన్వయకర్త కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ, వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు రంగారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఆరేళ్లలకు ఒకసారి వస్తాయని, ఈ ఎన్నికలను ఎవరూ ఆపలేరన్నారు. ఇతర ఎన్నికల్లాగా వీధుల్లో ప్రచారం చేసేది కాదని, విద్యావంతులు ఆలోచించి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి గోపాల్ రెడ్డిని గెలిపించాలన్నారు. ఓటరు నమోదుకు నవంబరు 5వ తేదీ వరకు గడువు ఉందన్నారు. ఈనెలాఖరులోపే నమోదు ప్రక్రియ పూర్తి చేసుకోవాలని కోరారు.
మోసం..బాబు నైజం: ఎమ్మెల్సీ అభ్యర్థి గోపాల్‌రెడ్డి
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలను నిట్టనిలువునా మోసం చేశారని పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ (కడప–అనంతపురం, కర్నూలు) అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి అన్నారు. ఎన్నికల్లో 600 అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారన్నారు.. ప్రమాణ స్వీకార సమయంలో ఫైల్‌పై సంతకం పెట్టి.. ఇప్పుడు నిరుద్యోగ భృతి ఇవ్వలేమని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థల యజమానుల ప్రాతినిధ్యంతో విద్యా సంస్కరణలు చేసి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నారని ఆరోపించారు. రాజధాని నిర్మాణానికి మూడు పంటలు పండే 36 వేల ఎకరాలను రైతుల నుంచి బలవంతంగా లాక్కున్నారన్నారు. అద్భుతమైన రాజధానంటూ ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబు నాయుడు ప్రజలకు, రైతులకు పనికొచ్చే రాజధాని నిర్మిస్తే చాలన్నారు. హోదా కోసం ఉద్యమిస్తే పీడీ యాక్టు పెడతామని హెచ్చరించడం అప్రజాస్వామికమన్నారు.
25న యువభేరి: హఫీజ్ ఖాన్, కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త
ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు డ్రైవ్‌లో ప్రతిఒక్కరు భాగస్వాములు కావాలని కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ ఖాన్ పిలుపునిచ్చారు. ఈనెల 25న వీజీఆర్ కన్వెషన్ హాల్‌లో జరిగే యువభేరి కార్యక్రమానికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రానున్నారని, కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, లీగల్‌సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాటి పుల్లారెడ్డి, ఎస్సీసెల్ కార్యదర్శి సి.హెచ్.మద్దయ్య, మైనారిటీసెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బి.జహీర్ అహ్మద్ ఖాన్, వివిధ శ్రేణుల నాయకులు డి.కె.రాజశేఖర్, విజయకుమారి, సలోమి, టి.వి.రమణ, అన్వర్‌బాష, గోపినాథ్ యాదవ్, కటారి సురేశ్ కుమార్, పేలాల రాఘవేంద్ర, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.