ఎస్‌ఐనా.. టీడీపీ కార్యకర్తా? | veldurthi si under vr | Sakshi
Sakshi News home page

ఎస్‌ఐనా.. టీడీపీ కార్యకర్తా?

May 30 2017 10:54 PM | Updated on Jul 27 2018 12:33 PM

ఎస్‌ఐనా.. టీడీపీ కార్యకర్తా? - Sakshi

ఎస్‌ఐనా.. టీడీపీ కార్యకర్తా?

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారుల వ్యవహారశైలి అధ్వానంగా తయారవుతోంది.

జగన్‌ను విమర్శిస్తూ ‘సపోర్టు టీడీపీ’ పోస్టును షేర్‌ చేసిన వైనం
– వెల్దుర్తి ఎస్‌ఐ తులసీ ప్రసాద్‌ నిర్వాకంపై సర్వత్రా విమర్శలు
– తాజాగా పోస్టు తొలగింపు
– వెల్దుర్తి ఎస్‌ఐపై వేటు– వీఆర్‌కు పంపిన ఉన్నతాధికారులు
– నారాయణ రెడ్డి హత్య, ఇతర ఆరోపణలపై బదిలీ
 
సాక్షి ప్రతినిధి, కర్నూలు: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారుల వ్యవహారశైలి అధ్వానంగా తయారవుతోంది. ఏకంగా పచ్చ కండువా కప్పుకున్న టీడీపీ కార్యకర్తల్లా ప్రవర్తిస్తున్నారు. తాజాగా వెల్దుర్తి ఎస్‌ఐగా ఉన్న తులసీ ప్రసాద్‌ వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పత్తికొండ ఇన్‌చార్జి నారాయణ రెడ్డి హత్యపై ప్రతిపక్ష నేత జగన్‌ చేసిన వ్యాఖ్యలు తప్పని విమర్శిస్తూ ‘సపోర్టు టీడీపీ’ చేసిన పోస్టును తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌ ద్వారా సదరు ఎస్‌ఐ ఏకంగా షేర్‌ చేశారు. పచ్చకండువా వేసుకున్న పార్టీ కార్యకర్త తరహాలో ఆయన వ్యవహరించిన శైలి చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఇప్పటికే నారాయణ రెడ్డి హత్యలో ఎస్‌ఐ పాత్ర ఉందంటూ ఆయన కుటుంబీకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇదే నేపథ్యంలో అదే నారాయణ రెడ్డి హత్యపై టీడీపీ మద్దతుదారులు చేసిన పోస్టును షేర్‌ చేయడంపై మరింత విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే, తాజాగా ఆయన ఈ పోస్టును తొలగించడం గమనార్హం. 
 
ఆరోపణల పరంపర
వాస్తవానికి తులసీ ప్రసాద్‌ వ్యవహారశైలిపై మొదటి నుంచీ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇసుక అక్రమ వ్యాపారంతో పాటు స్టేషన్‌కు వచ్చిన ప్రతీ కేసు వ్యవహారంలో సెటిల్‌మెంట్లు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇక ఇసుక అక్రమ వ్యాపారం చేస్తున్న అధికారపార్టీ నేతలతో చెట్టాపట్టాలు వేసుకునే తిరిగేవారనే ఆరోపణలున్నాయి. అంతేకాకుండా చెరకులపాడు నారాయణ రెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్న వారిపై బైండ్వోర్‌ కేసులు ఉన్నాయి. అయితే, వీరు స్టేషన్‌కు వచ్చినప్పుడు భుజంపై చేతులు వేసుకుని తిరిగేవారనే విమర్శలు వినిపించాయి. తాజాగా చెరకులపాడు నారాయణ రెడ్డి హత్య తర్వాత ఆయన వ్యవహారశైలిపై అనేక ఆరోపణలు వచ్చాయి. దీంతో నేరుగా డోన్‌ డీఎస్పీ ఆధ్వర్యంలో ఎస్పీ విచారణ జరిపించారు. 
 
మరో వివాదంలో.. 
ఇప్పటికే అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు ఎస్‌ఐ ఏకంగా అధికారపార్టీ పోస్టింగులను తన ఫేస్‌బుక్‌ ద్వారా షేర్‌ చేయడం మరింత విమర్శల పాలవుతోంది. చంద్రబాబు మద్దతుతో కేఈ కృష్ణమూర్తి తెగనరికినట్టు స్క్రీన్‌ప్లే అల్లేశారని జగన్‌పై విమర్శలు చేయడంతోపాటు పాతకక్షలతోనే హత్య జరిగిందని పేర్కొంది. ఫేస్‌బుక్‌లో ‘సపోర్టు టీడీపీ’ పేరుతో పోస్టు చేశారు. ఈ పోస్టును ఎస్‌ఐ తులసీ ప్రసాద్‌ షేర్‌ చేయడం ఇప్పుడు మరింత విమర్శల పాలవుతోంది. ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి... ఇటువంటి రాజకీయ పోస్టింగులను షేర్‌ చేయడంతో ఆయన ఎంతగా అధికారపార్టీతో అంటకాగుతున్నారనే విషయాన్ని తెలియజేస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
 
ఎస్‌ఐపై వేటు...!
వెల్దుర్తి ఎస్‌ఐ తులసీ ప్రసాద్‌పై వేటు పడింది. ఆయనను వేకన్సీ రిజర్వ్‌ (వీఆర్‌)కు పంపుతూ పోలీసు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఆయన స్థానంలో కర్నూలు టూ టౌన్‌లో ఉన్న ఖాజావలీని నియమిస్తూ పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పత్తికొండ ఇంచార్జీ చెరకులపాడు నారాయణ రెడ్డి హత్యతో పాటు ఆయనపై అనేక ఆరోపణల నేపథ్యంలో ఆయనపై బదిలీ వేటు పడింది. వాస్తవానికి చెరకులపాడు నారాయణ రెడ్డి హత్యకు వెల్దుర్తి ఎస్‌ఐ తులసీ నాగప్రసాద్‌ కారణమని ఆయన కుటుంబం ఆరోపణలు చేసింది. నారాయణ రెడ్డి వద్ద గన్‌లేదన్న సమాచారాన్ని ఎస్‌ఐ చేర్చడంతోనే హత్య జరిగిందని కుటుంబ సభ్యులు మండిపడ్డారు. అక్రమ ఇసుక వ్యాపారం, ఇతర దందాల వ్యవహారంపై డోన్‌ డీఎస్పీ బాబా ఫక్రుద్దీన్‌ విచారణలో నిజమని తేలడంతోనే ఎస్‌ఐపై వేటు పడింది.  
 
విధుల్లో నిర్లక్ష్యం కారణంగా..: ఎస్పీ రవికృష్ణ
వెల్దుర్తి ఎస్‌ఐను వీఆర్‌కు పంపాం. ప్రధానంగా విధులు సరిగ్గా నిర్వహించడంలో విఫలం కావడంతోనే వీఆర్‌కు పంపాము. ఆయన స్థానంలో కర్నూలు టూ టౌన్‌లో ఎస్‌ఐగా ఉన్న ఖాజావలీని నియమించాం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement