చైర్మన్‌ సీటుపై వరద రాజకీయం | Sakshi
Sakshi News home page

చైర్మన్‌ సీటుపై వరద రాజకీయం

Published Fri, Dec 23 2016 11:25 PM

Varada rajulareddy start in politics municipal cairmen seat

ప్రొద్దుటూరు టౌన్‌: ప్రొద్దుటూరు మున్సిపల్‌ చైర్మన్‌ ఉండేల గురివిరెడ్డిని సీటు నుంచి దింపేందుకు పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి నంద్యాల వరదరాజులరెడ్డి ఆట మొదలు పెట్టారు. ఇందులో భాగంగా 17 మంది టీడీపీ కౌన్సిలర్లు, ముగ్గురు కోఆప్షన్‌ మెంబర్లు కలిసి తాము పార్టీకి రాజీనామా చేస్తామని కడపలో ఉన్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డిని శుక్రవారం రాత్రి కలిశారు. ప్రస్తుత చైర్మన్‌ గురివిరెడ్డికి రెండేళ్లు, రెండ చైర్మన్‌ అభ్యర్థిగా ఉన్న ఆసం రఘురామిరెడ్డికి మూడేళ్లు అని ఎన్నికల సందర్భంగా చెప్పారని, అయితే ఉండేల గురివిరెడ్డి రెండేళ్లు దాటినా సీటు దిగకుండా అలాగే కూర్చోవడంపై వారు జిల్లా అధ్యక్షుని దృష్టికి తెచ్చారు. గతంలో కూడా ఇదే విషయంపై పార్టీ పరిశీలకులు చెప్పామని, అయినా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో తాము రాజీనామాలు చేస్తున్నట్లు చెప్పారు. తాము చైర్మన్‌తో మాట్లాడుతానని జిల్లా అధ్యక్షుడు కౌన్సిలర్లకు తెలిపారు. చెరి రెండున్నర సంవత్సరం ఉండేలా గతంలో చెర్చించామని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లి, చైర్మన్‌ను అక్కడికి పిలిపిస్తామని టీడీపీ అధ్యక్షుడు కౌన్సిలర్లను సముదాయించే ప్రయత్నం చేశారు. ఎవరు ఎలాంటి రాజీనామాలు చేయాల్సిన అవసరం కానీ, ఆందోళన చెందాల్సిన అవసరం కానీ లేదన్నారు.

మూడేళ్లకు ఒక్క రోజు ముందు కూడా దిగనన్న చైర్మన్‌
      మున్సిపల్‌ చైర్మన్‌ ఉండేల గురివిరెడ్డి మూడేళ్లకు ఒక్క రోజు ముందు కూడా దిగనని గతంలో పార్టీ పెద్దలకు తేల్చి చెప్పారు. ఎన్నికల సందర్భంగా మరో చైర్మన్‌ అభ్యర్థి కంటే ఎక్కువ తాను ఎక్కువగా రూ.2కోట్లకుపైగా అదనంగా ఖర్చు చేశానని, ఆరోజుకు ఎన్నికలకు డబ్బు తీసుకెళ్లిన నాయకులకు తాను మూడేళ్లు పదవిలో ఉంటానని ఇదివరకే పార్టీ పరిశీలకులకు గురివిరెడ్డి స్పష్టం చేశారు. దీనిపై వరదరాజులరెడ్డి ఒప్పుకోలేదు. ముందు చెప్పిన విధంగానే 2, 3 ఏళ్లు పదవిలో ఉండాలే తప్ప ఇప్పుడు మూడేళ్లు అంటే కుదరదని దిగాల్సిందేనని పట్టుబట్టారు.
ఆట మొదలైంది
      చైర్మన్‌ను రెండున్నర సంవత్సరం అయ్యే జనవరి 3వ తేదీకి దించాల్సిందేనని వరదరాజులరెడ్డి ఆట మొదలెట్టారు. ఇందులో భాగంగా తన వర్గీయ కౌన్సిలర్లు 17 మందితోపాటు ముగ్గురు కోఆప్షన్‌ మెంబర్లను పిలిపించారు. ప్రస్తుత చైర్మన్‌ దిగకపోతే తాము పార్టీకి రాజీనామా చేస్తామని లేఖలు తయారు చేయించారు. ఆ లేఖలపై కౌన్సిలర్లు, కోఆప్షన్‌ మెంబర్లతో సంతకాలు చేయించారు. ఈ విషయంలో సంతృప్తిగా లేకపోయినా సంతకాలు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని కొందరు కౌన్సిలర్లు తమ సన్నిహితులతో మాట్లాడారు.
మంగళవారం సీఎం నుంచి చైర్మన్‌కు పిలుపు
      జనవరి 3వ తేదీకి రెండున్నరేళ్లు పూర్తికానున్న ఉండేల గురివిరెడ్డి పదవి నుంచి దిగాలని టీడీపీ జిల్లా అధ్యక్షునితోపాటు వరదరాజులరెడ్డి, ఆయన వర్గీయ కౌన్సిలర్లు సోమ, మంగళవారాల్లో ముఖ్యమంత్రిని కలిసి చైర్మన్‌ను అక్కడికి పిలిపించే ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే గురివిరెడ్డి, ఆయన వర్గీయ కౌన్సిలర్లు మూడేళ్లకు ఒక్క రోజు ముందు కూడా దిగేది లేదంటూ స్పష్టం చేస్తున్నారు. ఏది ఏమైనా వరదరాజులరెడ్డి ఆట మొదలు పెట్టారు. ఇందులో ఎవరు గెలుపొందుతారో వేచి చూడాల్సిందే.



 

Advertisement
Advertisement