దిశ నిందితులను చంపినట్టుగానే శ్రీనివాస్‌ను..

Hajipur Case: Victims Families Meet Governor - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హాజీపూర్‌ వరుస హత్యలు చేసిన నిందితుడిని ఉరి తీయాలంటూ బాధిత కుటుంబ సభ్యులు, బీసీ సంఘం నేతలు గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌ను కోరారు. ఈ మేరకు బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌, బాధితుల కుటుంబ సభ్యులు సోమవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో భేటీ అయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌కు చెందిన పాముల శ్రావణి, తిప్రబోయిన మనీషా, మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తుంగని కల్పనలపై నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి అఘాయిత్యాలకు పాల్పడి హత్యచేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడు శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్ష వేయాలని, తమ కుటుంబాలకు తగిన న్యాయం చేయాలని బాధిత కుటుంబసభ్యులు గవర్నర్‌కు వినతిపత్రం అందజేశారు.

గవర్నర్‌తో భేటీ అనంతరం శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. ‘నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి ముగ్గురు అమ్మాయిలను దారుణంగా అత్యాచారం చేసి ఆపై హత్య చేశాడు. ఇప్పటివరకు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇలాంటివి జిల్లాకో ఘటనలు జరుగుతున్నాయి. గవర్నర్‌ కూడా తన లిస్ట్‌లో హాజీపూర్‌ సమస్య ఉందని, తనకు మొత్తం తెలుసన్నారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటానని సానుకూలంగా స్పందించార’ని పేర్కొన్నారు. బాధితురాళ్ల తల్లిదండ్రులు మాట్లాడుతూ.. నిందితుడు శ్రీనివాస్‌రెడ్డిని ఎన్‌కౌంటర్‌ చేయాలన్నారు. దిశ ఘటనలో నిందితులను ఎలా చంపారో శ్రీనివాస్‌ను కూడా అదే విధంగా చంపాలని గవర్నర్‌ కోరామని తెలిపారు. చదవండి: తుదిదశకు ‘హాజీపూర్‌’ విచారణ

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top