హాజీపూర్‌ బాధిత కుటుంబాలకు అందని సాయం!

Hajipur Minor Girls Murder Case Complete 16 Months Nalgonda - Sakshi

హాజీపూర్‌ బాధిత కుటుంబాలకు అమలు కాని హామీలు

ఎక్స్‌గ్రేషియా కోసం ఏడాదికి పైగా ఎదురుచూపులు

జాడ లేని డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు.. ఊసే లేని ఉద్యోగాలు 

బొమ్మలరామారం (ఆలేరు) : తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది హాజీపూర్‌ ముగ్గురు బాలికల వరుస హత్యల సంఘటన. ఈ ఘోరం జరిగి 16 నెలలు గడుస్తున్నా బాధిత కుటుంబాలకు ప్రభుత్వం భరోసా అందించడంలో విఫలం అయింది. నల్లగొండ పోక్సో కోర్టు ఫిబ్రవరి 6న సైకో కిల్లర్‌ మర్రి శ్రీనివాస్‌రెడ్డికి ఉరి శిక్ష విధించింది. కోర్టు తీర్పుతో బాధిత కుటుంబ సభ్యులు కొంత ఊరట పొందారు. కాని నిందితుడికి ఉరి శిక్ష అమలు కోసం బాధిత కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం నుంచి అందిన పరిహారం తమను పరిహాసం చేస్తుందని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధిత కుటుంబసభ్యులతోపాటు గ్రామస్తుల ప్రధాన డిమాండ్‌ అయిన హాజీపూర్‌ గ్రామ సమీపంలోని వాగుపై బ్రిడ్జి నిర్మాణం హామీ ఇంకా అమలుకాలేదు.

నెరవేరని డిమాండ్‌లు..
బాధిత కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా, బాధిత కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, బాధితులకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం ప్రభుత్వం ప్రకటించింది. మూడు బాధిత కుటుంబాల వారు నిరుపేదలే.. లీగల్‌ సెల్‌ నుంచి సైతం నేటికీ ఎలాంటి సహాయ సహకారాలు అందకపోవడంతో వారు ఆందోళనలో ఉన్నారు. ఉపాధి కోసం ఉద్యోగం లేదు, శిథిలావస్థలో చేరుకున్న ఇళ్లలోనే కాలం వెల్లదీస్తున్నారు. ఏ ఒక్క హామీ నెరవేరకపోవడంతో బాధితులు ప్రభుత్వ సాయం వైపు ధీనంగా ఎదురుచూస్తున్నారు. 

దయనీయ స్థితిలో మైసిరెడ్డిపల్లి బాధిత కుటుంబం..
సైకో శ్రీనివాస్‌రెడ్డి దురాగతాలకు బలైన ముగ్గురు బాలికల కుటుంబాల వారు నిరుపేదలే. వీరిలో ఇద్దరు హాజీపూర్‌ గ్రామానికి చెందిన వారు కాగా, మరో అమ్మాయిది మైసిరెడ్డిపల్లి గ్రామం. ఈ కుటుంబాన్ని విధి వెక్కిరించి మరింత దయనీయంగా మారింది. మృతురాలికి ఉన్న ఒక్క తమ్ముడు దివ్యాంగుడు. ఇతనికి ప్రభుత్వం పరంగా నాణ్యమైన వైద్యం అందజేస్తామని పింఛన్‌ మంజూరు చేస్తామని అధికారులు హామీ ఇచ్చినా నెరవేరలేదు. పింఛన్‌ కోసం మూడు నెలల క్రితం దరఖాస్తు చేసుకున్నా నేటికీ మంజూరు కాలేదు. ఎప్పుడు కూలుతుందో తెలియని స్థితిలో ఉన్న ఇంటిలోనే కాలం వెల్లదీస్తున్నారు.

అందిన సాయం లక్షలోపే..
బాధిత కుటుంబ సభ్యులకు ప్రభుత్వం నుంచి అందిన సాయం రూ. లక్షలోపే ఉంది. బీసీ కార్పొరేషన్‌ నుంచి రూ. 50 వేల చొప్పున రుణ సాయంతోపాటు మరో రూ. 25 వేల చొప్పున ఒక్కో బాధిత కుటుంబానికి రూ. 75 వేల ఆర్థిక సాయం మాత్రమే అందింది.

కల్పన కుటుంబ సభ్యులు: పెద్దసార్లు కనికరించాలి
కూతురు పోగొట్టుకొని పుట్టెడు దుఃఖంలో ఉన్నాం. సర్కారు నుంచి సాయం చేస్తామని మాటిచ్చి ఏడాది దాటింది. ఇకనైనా తమను ఆదుకునేలా పెద్దసార్లు కనికరించాలి. సైకో శ్రీనివాస్‌ రెడ్డిని వెంటనే ఉరితీయాలి. మా పిల్లల ఉసురు తీసునోన్ని ఇంకా ఎన్ని రోజులు మేపుతారో అర్థం కావడం లేదు. 
– తిప్రబోయిన మల్లేష్, బాధితురాలి తండ్రి, హాజీపూర్‌

మనీషా కుటుంబ సభ్యులు : ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నాం
ఘటన జరిగి 16 నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీలు నెరవేరలేదు. ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నాం. తమ్ముడు దివ్యాంగుడు కావడంతో నాకు ఉద్యోగం కల్పిస్తే మా కుటుంబానికి ఆసరాగా ఉంటుంది. ఇల్లు కూడా ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి. డబుల్‌ బెడ్‌ రూం ఇల్లు మంజూరీ చేసి ఎక్స్‌గ్రేషియా అందజేయాలి. నిందితుడిని ఉరి తీసిన రోజే మాకు సంపూర్ణ న్యాయం జరిగినట్లు.
– తుంగని మీనా, బాధితురాలి సోదరి, మైసిరెడ్డిపల్లి

హామీలు అమలు కాలేదు
మా కూతురు మృత్యువాత పడి ఏడాది దాటినా ప్రభుత్వ హామీలు అమలు కాలేదు. ప్రభుత్వ పరంగా ఆదుకుంటారని ఎదురుచూస్తున్నాం. కాని కాలయాపన జరుగుతోంది. మమ్మల్ని ఆదుకునేందుకు కలెక్టర్‌ ప్రత్యేక చొరవ చూపాలి. నిందితుడిని ఉరి తీయకుండా ప్రజాధనంతో మేపుతున్నారు. శ్రీనివాస్‌రెడ్డిని ఉరి తీసినప్పుడే పిల్లల ఆత్మలు శాంతిస్తాయి.
– పాముల నర్సింహ, బాధితురాలి తండ్రి, హాజీపూర్‌

పరిహారం అందేలా చర్యలు తీసుకుంటాం
హాజీపూర్‌ బాధితులకు పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వానికి, లీగల్‌ సెల్‌ అథారిటీకి నివేదికలు పంపాం. బొమ్మలరామారం మండలంలో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు పనులు ప్రారంభించగానే బాధితులకు ఇళ్ల నిర్మాణం చేపడుతాం. బాధిత కుటుంబంలోని ఒకరికి విద్యార్హతను నిర్ధారించి ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం. – కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top