హాజీపూర్‌: చదువుకునేందుకు వెళ్లి బలయ్యారు

Hajipur Murder Case: Hajipur Village Have No Transport Facility In Nalgonda - Sakshi

సాక్షి, యాదాద్రి: ‘బేటీ బచావో బేటీ పడావో’నినాదంతో బాలికల రక్షణ, చదువు కోసం ప్రాధాన్యమిస్తున్న ఈ రోజుల్లో చదువు కోసం వెళ్లిన ముగ్గురు అమ్మాయిలు ఓ కిరాతకుడి చేతిలో బలయ్యారు. సరైన రవాణా వసతి లేకున్నా.. తమ కుమార్తెలను చదువు కోసం పొరుగున ఉన్న గ్రామాలకు పంపించాయి ఆ పేద కుటుంబాలు. కానీ లిఫ్ట్‌ ఇచ్చే పేరుతో ఓ రాక్షసుడు ఆ బాలికలపై ఘోరానికి ఒడిగట్టాడు. హాజీపూర్‌ గ్రామానికి చెందిన ఇద్దరు, మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మరో బాలికపై హాజీపూర్‌ గ్రామానికి చెందిన మర్రి శ్రీనివాస్‌రెడ్డి అఘాయిత్యాలకు పాల్పడి హత్య చేసి తన వ్యవసాయ బావిలోనే పూడ్చిపెట్టిన విషయంలో కోర్టు నిందితుడికి ఉరిశిక్ష విధించింది. రాజధానికి శివారునే ఉన్న బొమ్మలరామారం మండలం హాజీపూర్‌కు గ్రామాల మీదుగా భువనగిరి వరకు బస్సు సౌకర్యం లేకపోవడంతోనే ముగ్గురు బాలికలు బలైపోయారని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. 

స్పెషల్‌ క్లాసులకు వెళ్లి.. 
మండలంలోని హాజీపూర్‌ గ్రామానికి చెందిన పాముల నర్సింహా, నాగమణి దంపతుల కుమార్తె(14) మేడ్చల్‌ జిల్లా కీసర మండలంలోని సెరినిటీ మోడల్‌ స్కూల్‌లో పదో తరగతి చదువుతోంది. ఆమె గతేడాది ఏప్రిల్‌ నెల 25న పాఠశాలలో ప్రత్యేక తరగతులకు వెళ్లి సాయంత్రం 3 గంటలు దాటినా ఇంటికి చేరుకోలేదు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. 2019 మార్చి 6 నుంచి కనిపించకుండా పోయిన హాజీపూర్‌ గ్రామానికే చెందిన మరో బాలిక(18) మేడ్చల్‌ జిల్లా కీసర సమీపంలోని కేఎల్‌ఆర్‌ కాలేజీలో బీకామ్‌ రెండో సంవత్సరం చదువుతోంది. ఈ నేపథ్యంలో 2019 మార్చిలో శివరాత్రి పర్వదినం అనంతరం 6వ తేదీన కాలేజీకి వెళ్లిన బాలిక తిరిగి ఇంటికి రాలేదు. ఈ ఇద్దరు బాలికలనూ హాజీపూర్‌కే చెందిన శ్రీనివాస్‌రెడ్డి లిఫ్ట్‌ ఇస్తానని నమ్మించి అత్యాచారం, హత్య చేసినట్లు నేరం రుజువు కావడంతో ఉరిశిక్ష పడింది. 

సాక్షి కథనంతో తెరపైకి మరో మిస్సింగ్‌ కేసు 
మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఆరో తరగతి చదువుతున్న బాలిక (11) 2015లో అదృశ్యమైంది. ఈ మిస్సింగ్‌ కేసులో పోలీసులు నాలుగేళ్లుగా ఎలాంటి పురోగతి సాధించలేకపోయారు. 2019 ఏప్రిల్‌ 29న ‘సాక్షి’దినపత్రికలో ఆ బాలిక మిస్సింగ్‌పై కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన పోలీసు లు కస్టడీలో ఉన్న శ్రీనివాస్‌రెడ్డిని విచారించగా, ఆ బా లికనూ తానే పొట్టన పెట్టుకున్నట్లు ఒప్పుకొన్నాడు.

ఉద్యోగానికి పంపుదామంటే ఊపిరి తీసిండు: 
పేద కుటుంబానికి చెందిన నేను కూతురిని చదివించి ఉద్యోగం చేసే స్థాయికి తీసుకొద్దామంటే సైకో శ్రీనివాస్‌రెడ్డి తన కూతురు ఊపిరి తీసి నా ఆశలు ఆవిరి చేసిండు. శ్రీనివాస్‌రెడ్డికి బతికే హక్కు లేదు. కోర్టు తీర్పుతో పానం నిమ్మలమైంది. వాయిదాలు లేకుండా తొందరగా ఉరి తీసి మా పిల్లల పానాలు తీసిన బావిలోనే సైకోను పాతి పెట్టాలి. అప్పుడే పోకిరీలకు కనువిప్పు కలుగుతుంది. 
– తిప్రబోయిన మల్లేశ్, బాలిక తండ్రి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top