అ‘​‍‍ట్రాక‌్షనేనా’? | traction shed construction continuing | Sakshi
Sakshi News home page

అ‘​‍‍ట్రాక‌్షనేనా’?

Jul 27 2017 10:23 PM | Updated on Mar 19 2019 6:15 PM

అ‘​‍‍ట్రాక‌్షనేనా’? - Sakshi

అ‘​‍‍ట్రాక‌్షనేనా’?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సౌత్‌ సెంట్రల్‌ రైల్వే జంక‌్షన్‌గా గుంతకల్లుకు గుర్తింపు ఉంది. ఇటు ఆంధ్ర రాజధాని కేంద్రానికి, అటు తెలంగాణ రాజధాని కేంద్రానికి ప్రధాన కేంద్రంగా గుంతకల్లు జంక‌్షన్‌ నిలిచిపోయింది.

ముందుకు సాగని ట్రాక‌్షన్‌ షెడ్‌ నిర్మాణ పనులు
- పదేళ్లుగా కొన ‘సా..గు’తున్న పనులు
- పూర్తి కావడానికి మరో మూడేళ్లు పట్టే అవకాశం
-  వందలాదిగా మంజూరుకానున్న కొత్తపోస్టులు
- ఉపాధి కోసం నిరుద్యోగ యువత ఎదురుచూపు


గుంతకల్లు: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సౌత్‌ సెంట్రల్‌ రైల్వే జంక‌్షన్‌గా గుంతకల్లుకు గుర్తింపు ఉంది. ఇటు ఆంధ్ర రాజధాని కేంద్రానికి, అటు తెలంగాణ రాజధాని కేంద్రానికి ప్రధాన కేంద్రంగా గుంతకల్లు జంక‌్షన్‌ నిలిచిపోయింది. ఈ రైల్వే డివిజన్‌కు తలమానికంగా రూపుదిద్దుకుంటున్న ట్రాక‌్షన్‌ షెడ్‌ నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు. దాదాపు రూ.180 కోట్ల భారీ బడ్జెట్‌తో ట్రాక‌్షన్‌ షెడ్‌ నిర్మాణ పనులకు 2008లో రైల్వే మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. ఆదిలోనే హంసపాదు అన్న చందంగా రెండేళ్ల ఆలస్యంగా 2010లో పనులు ప్రారంభమయ్యాయి. కేవలం రూ.2కోట్లు మాత్రమే విడుదల కావడంతో శంకుస్థాపన, భూమిపూజ పనులు చేశారు. నాటి నుంచి నిధుల గ్రహణం పట్టుకుంది. పనులు కొనసా..గుతూనే ఉన్నాయి.

డివిజన్‌ కేంద్రమైన గుంతకల్లు జంక‌్షన్‌ సమీపంలో సుమారు 150 విద్యుత్‌ రైలింజన్ల సామర్ధ్యం కలిగిన ట్రాక‌్షన్‌ షెడ్‌ ప్రాజెక్టు పనులకు రూ.100 కోట్ల వ్యయ అంచనాలతో 2008లో రైల్వే మంత్రిత్వ శాఖ అనుమతినిచ్చింది. ట్రాక‌్షన్‌ లోకోషెడ్‌ నిర్మాణ పనుల్లో విద్యుత్‌ లోకో ట్రిప్‌ షెడ్, విద్యుత్‌ లోకోల హెవీ లిప్టింగ్‌ షెడ్, లోకో వాషింగ్‌ షెడ్‌లను నిర్మించాల్సి ఉంది. రూ. వంద కోట్ల వ్యయ అంచనాలతో ప్రారంభమైన ఈ పనులు..  ప్రస్తుతం 180 కోట్ల వ్యయ అంచనాలకు పెరిగింది. తొలుత ట్రాక‌్షన్‌ షెడ్‌ నిర్మాణ పనులు ప్రారంభించారు. అనంతరం ఎలక్ట్రికల్‌ ట్రిప్‌ షెడ్‌ పనులు ప్రారంభించారు.     

గుంతకల్లు–రేణిగుంట మధ్య విద్యుత్‌ లైన్లు పూర్తి కావడంతో రైల్వే ఉన్నతాధికారులు ఒత్తిడి కారణంగా ట్రిప్‌ షెడ్‌ను వినియోగంలోకి తెచ్చారు. అయితే ట్రాక‌్షన్‌ షెడ్‌ నిర్మాణంలో రెండు భారీ షెడ్ల నిర్మాణం దాదాపు 80శాతం పూర్తయ్యింది. మిగిలిన 20 శాతం పనుల్లో భాగంగా ట్రాక్‌ లింకింగ్‌ పనులు, విద్యుత్‌ స్తంభాల ఏర్పాటు చేయాల్సి ఉంది. అదేవిధంగా హెవీ, మీడియం లిప్టింగ్‌ షెడ్లు, లోకో వాషింగ్, లేత్‌ మిషన్‌ ఎలక్ట్రికల్‌ షెడ్‌లో మరిన్ని పనులు చేయాల్సి ఉంది. అందులో లిప్టింగ్‌ బే, హెవీ లిఫ్టింగ్‌ బే, ఇన్స్‌ఫెక‌్షన్‌ బే తదితర పనులు జరగాల్సి ఉంది.

అంతేకాకుండా వీటికి అనుసంధానంగా భారీ స్థాయిలో 60 సర్వీస్‌ భవనాలు నిర్మించాల్సి ఉంది. అయితే ఇంతవరకు వీటికి సంబంధించిన ఫౌండేషన్, నిధులు కేటాయించ లేదు. ఈ పనుల పూర్తికి మరో మూడు లేదా నాలుగు ఏళ్ల సమయం పట్టవచ్చని రైల్వే వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే గుంతకల్లు డివిజన్‌లోని రేణిగుంట–గుంతకల్లు–వాడి,  గుత్తి–ధర్మవరం  మధ్య విద్యుద్దీకరణ పనులు పూర్తయి విద్యుత్‌ రైలింజన్లు పరుగులు పెడుతున్నాయి. ఇక గుంతకల్లు–హోస్పెట్‌ గుంతకల్లు–గుంటూరు, గుంతకల్లు–కల్లూరుల మధ్య విద్యుద్దీకరణ పనులు జరుగుతున్నాయి.

వందల మందికి ఉపాధి : ఈ ట్రాక‌్షన్‌ లోకో షెడ్‌ నిర్మాణం పూర్తయితే వందలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి దొరుకుతుంది. షెడ్‌ మెయిన్‌టెనెన్స్‌లో భాగంగా ఉన్నతాధికారి స్థాయి నుంచి టెక్నీషియన్, నాన్‌ టెక్నీషియన్, 4వ తరగతి ఉద్యోగులైన కళాసి పోస్టులు భారీ స్థాయిలోనే మంజూరయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా విద్యుత్‌ లోకో ఇంజన్లు రాకపోకలు పెరిగి రైల్వేకు భారీగా ఆదాయం సమకూరే అవకాశం లేకపోలేదు. విద్యుత్‌ రైలింజన్ల వల్ల రైలు గమ్యస్థానాలను చేరే సమయం కొద్దిమేర ఆదా అవుతుందని రైల్వే వర్గాలు పేర్కొంటున్నాయి. నత్తనడకన సాగుతున్న ట్రాక‌్షన్‌ షెడ్‌ నిర్మాణ పనులపై రాయలసీమ ప్రాంతానికి చెందిన ఎంపీలు, స్థానిక అధికారులు దృష్టి సారించి యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement