– మెగాసిరి ఫంక‌్షన్‌హాల్‌లో నిర్వహణ
– ప్రత్యేక పరిశీలకుడిగా తిరుపతి ఎంపీ వరప్రసాద్ రాక
– ప్రత్యేక ఆహ్వానితులుగా అనంత, రవీంద్రనాథ్‌రెడ్డి హాజరు
– నియోజకవర్గాల ప్లీనరీ తీర్మానాలపై లోతైనా విశ్లేషణ
– విజయవంతం చేయాలని ఎంపీ బుట్టా, ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పిలుపు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్లీనరీ సమావేశాన్ని ఈ నెల 22 మెగాసిరి ఫంక‌్షన్ హాల్‌లో నిర్వహించనున్నట్లు కర్నూలు ఎంపీ బుట్టా రేణుక తెలిపారు. మంగళవారం వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కార్యాలయంలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి అధ్యక్షతన ఉదయం 10గంటలకు ప్రారంభించనున్న కార్యక్రమానికి ప్రత్యేక పరిశీలకుడిగా తిరుపతి ఎంపీ వరప్రసాద్, ప్రత్యేక ఆహ్వానితులుగా అనంతపురం మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి హాజరు కానున్నట్లు వివరించారు. ఇటీవల నియోజకవర్గాల వారీగా నిర్వహించిన ప్లీనరీలు విజయవంతమయ్యాయన్నారు. చెరుకులపాడు నారాయణరెడ్డి మరణంతో పత్తికొండలో మాత్రం ప్లీనరీ జరగలేదన్నారు. ప్రతి నియోజకవర్గంలో సీఎం చంద్రబాబునాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన అమలుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైందన్నారు.
13 నియోజకవర్గాల ప్లీనరీల్లో తీర్మానించిన సమస్యలపై జిల్లా స్థాయి ప్లీనరీలో లోతైనా విశ్లేషణ చేసి ప్రభుత్వానికి డిమాండ్‌గా ఉంచుతామన్నారు. జిల్లా స్థాయి ప్లీనరీలో ఆమోదించిన సమస్యలను రాష్ట్ర స్థాయి ప్లీనరీలో కూడా ఉంచి ఆమోదం తరువాత ఉద్యమాలకు శ్రీకారం చుడతామని వివరించారు. జిల్లా స్థాయి ప్లీనరీ సమావేశానికి వైఎస్‌ర్‌సీపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో నాయకులు తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, మద్దయ్య, కర్నాటి పుల్లారెడ్డి, పర్ల శ్రీధర్‌రెడ్డి, సత్యం యాదవ్, శౌరీ విజయకుమారి, నరసింహులు యాదవ్, కృష్ణారెడ్డి, రాజా విష్ణువర్దన్‌రెడ్డి, టీవీ రమణ, ఫిరోజ్‌ఖాన్, గోపీనాథ్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
సీఎం అభివృద్ధి శిలాఫలకాలకే పరిమితం: గౌరు చరితారెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే
సీఎం చంద్రబాబునాయుడు జిల్లాలో చేసిన అభివృద్ధి శిలాఫలకాలకే పరిమితమైంది. జిల్లాకు సీఎం ఎన్నికల సమయంలో 93హామీలు, 2014 ఆగస్టు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో 33 హామీలు ఇచ్చినా అందులో 20 శాతం కూడా అమలు కాలేదు. అమలైనా వాటిలో టీడీపీ నాయకులు, మంత్రులకు మేలుచేసే పథకాలే ఎక్కువగా ఉన్నాయి. పాణ్యం నియోజకర్గంలోని ఓర్వకల్‌లో పరిశ్రమలు ఏర్పాటు చేస్తామంటూ మభ్యపెడుతున్నారు.
సీఎం జిమ్మిక్కులను ముస్లింలు నమ్మరు: హఫీజ్‌ఖాన్, కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త
ఉప ఎన్నికల నేపథ్యంలో సీఎం చంద్రబాబునాయుడు నంద్యాలలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రూ.90 లక్షలతో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసి ముస్లింలను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన జిమ్మిక్కులను ముస్లింలెవరూ నమ్మరు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ముస్లింలను బలవంతంగా అధికార బలంతో బస్సుల్లో నంద్యాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పద్ధతి కాదన్నారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్‌ను కల్పించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరాధ్య దైవం. సీఎం చంద్రబాబునాయుడుకు నిజంగా ముస్లిలపై ప్రేమ ఉంటే ఉర్దూ యూనివర్సిటీ, పాఠశాలలు, కళాశాలల సమస్యలను పరిష్కరించాలి. ముస్లింలకు మంత్రి పదవి ఇవ్వాలి. వక్ఫ్‌బోర్డు చైర్మన్ పదవి భర్తీ చేయాలి.
ఉప ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ విజయాన్ని ఆపలేరు: బీవై రామయ్య, పార్టీ రాష్ట్ర కార్యదర్శి
నంద్యాల ఉప ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్‌ఆర్‌సీపీదే విజయం. సీఎం చంద్రబాబునాయుడు ఎన్నికల వరకు నంద్యాలలోనే తిష్టవేసినా వైఎస్‌ఆర్‌సీపీ విజయాన్ని అడ్డుకోలేరు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పోరాట పటిమను చూసిన ప్రజలు ముఖ్యమంత్రిని చేయాలని చూస్తున్నారని అభిప్రాయపడ్డారు.