అమ్మ, నాన్న, ప్రేమ...
	ఎంత చిన్నపదాలు!
	స్నేహం.. నేస్తం.. దోస్త్...
	ఎంత చిన్న పదాలు!
	మరెంత చిత్రమో...
	ఈ అలతి అలతి అక్షరాల పదాలే
	జీవితాన్ని ఎంత అర్ధవంతం చేస్తాయి!
	బతుకుకు ఎంత అందాన్నిస్తాయి!
	అవధుల్లేని జీవన పయనంలో
	ఈ అనుబంధాలే కదూ మనల్ని నడిపిస్తాయి!
	చిన్ననాటి తప్పటడుగుల నుంచి
	ప్రాజ్ఞత నేర్పిన పరుగుల వరకు
	అడుగడుగునా అల్లుకున్న అల్లిబిల్లి స్నేహాలే
	బతుకులో తీపిని రుచి చూపిస్తాయి..
	జీవితాన్ని నిత్యనూతనం చేస్తాయి..
	ఈ స్నేహగీతాలే, చెలిమి పలుకులే
	నిన్నూ నన్నూ, సమస్త మానవాళినీ
	కలుపుతాయి.. నిలుపుతాయి.
	హ్యాపీ ఫ్రెండ్షిప్ డే!
	 
	ఈ రోజు తలపులోకి రాగానే..ఎద లోతులో..ఏ మూలనో..నిదురించే జ్ఙాపకాలు నిద్రలేస్తున్నాయి కదూ!
	ఔను ఫ్రెండ్‌షిప్‌డే అంటే ఎన్నో జ్ఞాపకాలు..మరెన్నో మధుర స్మతులు కళ్లముందు కదలనిదెవరికి?
	ఆగొద్దు.. ఆలోకంలో అలానే విహరించండి!
	ఒక్కసారి కళ్లు మూసుకోండి... అద్భుత స్నేహ ప్రపంచం కనిపిస్తోంది కదూ...
	ఊహలాటి అద్వితీయ అనుభవం.. మీకే తెలిసిన అపురూప భావం కదలాడుతోంది కదూ
	ఎంజాయ్ చేయండి..
	ఆనాటి కబుర్లు... ఆ స్నేహితుల చిలిపి చేష్టలు... కళ్లలో, మనసులో నింపుకోండి
	తనివితీరా నవ్వుకోండి..
	ఫ్రెండ్ దగ్గరగా ఉంటే హాయిగా హగ్ చేసుకోండి. కనీసం స్మార్ట్ ఫోన్ తీసుకోండి. విష్ చేస్తూ ఓ మెసేజ్ పెట్టండి. ఫ్రెండ్ నుంచి వచ్చే సందేశాన్ని మదిలో మననం చేసుకోండి.. సష్టిలో తీయనిది స్నేహమే అనుకుంటూ సంతోషంగా స్నేహగీతం పాడుకోండి.