కలుషితాహారం తిని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బాలలు మృతిచెందారు
విశాఖపట్టణం: విశాఖపట్టణం జిల్లా దుబ్రిగూడ మండలం ఒబియాగూడలో కలుషితాహారం తిని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బాలలు మృతిచెందారు. ఈ సంఘటన ఆదివారం ఉదయం వెలుగుచూసింది. సత్తిబాబు(7), శంకర్(4), సింహాద్రి(3) అనే బాలలు శనివారం రాత్రి అన్నం తిని నిద్రపోయారు. ఉదయం చూసేసరికి ముగ్గురూ విగతజీవులై ఉన్నారు. వీరి తల్లిదండ్రులు కూడా అస్వస్థతకు గురయ్యారు.
రాత్రి తిన్న ఆహారం కలుషితమై ఉంటుందని, అందువల్లే పిల్లలు మృతిచెందారని భావిస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులు మృతిచెందడం, వారి తల్లిదండ్రులు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఇరుగుపొరుగువారు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు అస్వస్థతకు గురైనవారిని ఆస్పత్రికి తరలించారు.