అదే నిర్లక్ష్యం! | The same neglect! | Sakshi
Sakshi News home page

అదే నిర్లక్ష్యం!

Mar 21 2017 12:45 AM | Updated on Jun 1 2018 8:39 PM

అదే నిర్లక్ష్యం! - Sakshi

అదే నిర్లక్ష్యం!

పదో తరగతి పరీక్షల నిర్వహణలో విద్యా శాఖ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. తొలిరోజు మడకశిర పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ‘బీ’ కేంద్రంలో తెలుగు పేపర్‌–1 ప్రశ్నపత్రం లీక్‌ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. ఈ ఘటన తర్వాత అధికారులు హడావుడి చేశారు.

  • ‘పది’ పరీక్షల నిర్వహణలో విద్యాశాఖ వైఫల్యం
  • మొన్న మడకశిర, నిన్న కదిరిలో ప్రశ్నపత్రం లీక్‌
  • లీక్‌ వ్యవహారం వెనుక ‘నారాయణ’ హస్తం?
  •  

    పదో తరగతి పరీక్షల నిర్వహణలో విద్యా శాఖ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. తొలిరోజు మడకశిర పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ‘బీ’ కేంద్రంలో తెలుగు పేపర్‌–1 ప్రశ్నపత్రం లీక్‌ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. ఈ ఘటన తర్వాత అధికారులు హడావుడి చేశారు. మరింత పకడ్బందీగా నిర్వహిస్తామని, ఏ స్థాయి సిబ్బంది నిర్లక్ష్యం చేసినా యాక్ట్‌ -25 కింద క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని ప్రకటించారు. ఇది జరిగి మూడు రోజులు కూడా గడవకనే సోమవారం కదిరి పట్టణంలో హిందీ ప్రశ్నపత్రం లీకైంది. పరీక్ష ప్రారంభమైన అరగంటకే జవాబుల జిరాక్స్‌ ప్రతులు బయట  హల్‌చల్‌ చేశాయి. చివరకు సామాజిక, ప్రసార మాధ్యమాల్లోనూ దుమారం రేకెత్తించాయి. మడకశిర, హిందూపురంతో పాటు కదిరి పట్టణంలో చోటు చేసుకున్న లీక్‌ ఘటనల వెనుక కార్పొరేట్‌ శక్తులున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మంత్రి నారాయణకు చెందిన పాఠశాలల సిబ్బందిపై ఆరోపణలు వస్తున్నాయి. హిందూపురం పట్టణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ ఉద్యోగిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. తాజాగా కదిరిలో దొరికిన హిందీ పరీక్ష జవాబు పేపర్ల వెనుక నారాయణ పాఠశాల హస్తముందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

     

    సిబ్బంది పాత్రపైనా అనుమానాలు

      పరీక్షా కేంద్రాల్లో విధులు నిర్వర్తిస్తున్న కొందరు చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్లు, ఇన్విజిలేటర్ల పాత్రపై కూడా అనుమానాలు తలెత్తుతున్నాయి. వీరి ప్రమేయం లేకుండా ప్రశ్నపత్రం బయటకు వెళ్లదని, ఒకవేళ వెళ్లినా తిరిగి జవాబులు వచ్చి వాటిని పిల్లలు రాయాలంటే వీరి సహకారం ఉండాల్సిందేనని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో కార్పొరేట్‌ యాజమాన్యాలతో కొందరు సిబ్బంది కుమ్మక్కై అక్రమాలకు తెర తీశారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కదిరి పట్టణంలోని వివిధ కేంద్రాల్లో పరీక్షలు రాస్తున్న నారాయణ పాఠశాల విద్యార్థులకు జవాబులు చేరవేశారు. ఆయా కేంద్రాల్లో విధుల్లో ఉన్న సిబ్బంది కాకుండా పోలీసులు ఈ వ్యవహారాన్ని బయటకు తేవడం గమనార్హం. దీంతో కేంద్రాల్లోని సిబ్బంది తీరుపై అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఈ వ్యవహారం వెనుక భారీ ఎత్తున డబ్బు చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది.

    అధికారుల ఆదేశాలు బేఖాతర్‌

    తొలిరోజు మడకశిరలో చోటు చేసుకున్న ఘటనతో రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ కమిషనర్, ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్, జిల్లా కలెక్టర్, రీజనల్‌ జాయింట్‌ డైరెక్టర్, డీఈఓ తీవ్రంగా స్పందించి గట్టి ఆదేశాలు జారీ చేశారు. అయినా సిబ్బందిలో ఏమాత్రమూ భయం లేదనేది కదిరి ఘటనతో స్పష్టమవుతోంది. ఒకవైపు అధికారుల హెచ్చరికలు, మరోవైపు యాక్ట్‌ -25 నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయని తెలిసినా బరి తెగిస్తుండటం గమనార్హం. అక్రమార్కులకు ప్రభుత్వంలోని ‘కీలక’ శక్తుల అండ ఉండటంతో కొన్ని కేంద్రాల్లో పని చేస్తున్న సిబ్బంది ‘చూసీ చూడనట్లు’ వెళ్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement