తాజా నిర్ణయాలు, ప్రకటనలపై ఈసీ సీరియస్ | Sakshi
Sakshi News home page

తాజా నిర్ణయాలు, ప్రకటనలపై ఈసీ సీరియస్

Published Thu, Nov 19 2015 12:46 AM

The latest decisions, the statement on the EC Series

సాక్షి, హైదరాబాద్: వివిధ నిర్ణయాలు.. ప్రకటనలతో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల కమిషన్ తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి వివరణ కోరింది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈసీ  ఈ చర్యకు ఉపక్రమించింది. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కోడ్‌ను ఉల్లంఘించినట్లుగా ఇటీవల ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కుమార్‌రావు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. రాష్ట్ర మంత్రులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, ముఖ్యమంత్రి, మంత్రులు ఓటర్లను ప్రభావితం చేసే నిర్ణయాలను ప్రకటిస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ కమలాకర్‌రావు ఫిర్యాదు చేశారు.

క్రిస్‌మస్‌ను అధికారిక ఉత్సవాలుగా ప్రకటించటం, కాలేజీ హాస్టళ్లకు సన్న బియ్యం, ఉస్మానియా యూనివర్సిటీకి మెస్ చార్జీల బకాయిల చెల్లింపులు,  బీసీలకు కల్యాణ లక్ష్మి పథకం వర్తింపు, కాళోజీ హెల్త్ వర్సిటీకి వీసీ నియామకం కోడ్ ఉల్లంఘన పరిధిలోకి వస్తాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. సకల జనుల సమ్మె కాలాన్ని స్పెషల్ లీవ్‌గా పరిగణించటం, టెట్ నిర్వహణ, పోలీస్ కానిస్టేబుళ్ల నియామకానికి ఆమోదం తెలిపిందని.. ప్రభుత్వం కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతోందని ఎమ్మెల్యే లక్ష్మణ్ ఆధ్వర్యంలో బీజేపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని భన్వర్‌లాల్ కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించారు. దీని ఆధారంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు..  ప్రకటనలపై వివరణ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీని ఆదేశించింది.

 కొత్త ప్రకటనలు వద్దు: భన్వర్‌లాల్
 రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే కొత్త నిర్ణయాలు, కొత్త పథకాలను ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణిస్తుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్  హెచ్చరించారు. ఎన్నికలు ముగిసేంత వరకు ఓటర్లను ప్రభావితం చేసే నిర్ణయాలు, ప్రకటనలేవీ చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఇలాంటి నిర్ణయాలన్నీ ఎన్నికల కోడ్ ఉల్లంఘన పరిధిలోకి వస్తాయన్నారు. వరంగల్ ఉప ఎన్నికకు సంబంధించి వివిధ పార్టీల నుంచి ఎన్నికల కమిషన్‌కు మొత్తం తొమ్మిది ఫిర్యాదులు అందాయని,  వీటిలో నాలుగింటిని పరిశీలించి ప్రాథమిక నివేదికను కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పంపించినట్లు చెప్పారు. మిగతా ఫిర్యాదులపై జిల్లా ఎన్నికల అధికారి నుంచి నివేదిక కోరినట్లు వివరించారు.

 ఉత్తర్వులేవీ జారీ చేయలేదు: సీఎస్
 ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై  ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌కు వివరణ సమర్పించింది. పాలనాపరమైన కారణాలతో కొన్ని నిర్ణయాలు తీసుకున్నామని, ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఈసీకి లేఖ రాశారు. ఎన్నికల కమిషన్ నుంచి తగిన ఆమోదం పొందిన తర్వాతే సంబంధిత ఉత్తర్వులు జారీ చేస్తామని పేర్కొన్నారు.

Advertisement
Advertisement