breaking news
Kamalakar raO
-
పీఆర్సీ అమలుకు కృషి చేస్తా: స్వామిగౌడ్
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగులకు రావాల్సిన పీఆర్సీపై కృషి చేస్తానని మండలి చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి మామిళ్ల రాజేందర్ అధ్యక్షతన ‘ఈద్ మి లాప్’కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి స్వామిగౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణ చరిత్రను పుస్తక రూపంలో తీసుకురావాలని కోరారు. సకలజనుల సమ్మెలో ఉద్యోగుల పాత్ర ఎంతో ఉందన్నారు. ప్రతి ఉద్యోగి ఐదు చెట్లు నాటాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీఎన్జీవో కేంద్ర సంఘం నేతలు పాల్గొన్నారు. పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కమలాకర్‌రావు సాక్షి, హైదరాబాద్: పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నిజామాబాద్ జిల్లాకు చెందిన బీరెల్లి కమలాకర్‌రావు ఎన్నికయ్యారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.సరోత్తంరెడ్డి అధ్యక్షతన బుధవారం ఇక్కడ జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన్ను ఏకగ్రీవంగా ఎనుకున్నారు. ఈ సందర్భంగా ప్రస్తుత ప్రధాన కార్యదర్శి చెన్నకేశవరెడ్డికి ఘనంగా వీడ్కోలు పలికారు. అనంతరం పలు అంశాలపై కార్యవర్గం తీర్మానాలు చేసింది. ఉపాధ్యాయ బదిలీల్లో నష్టపోయిన వారికి న్యాయం చేయటంతో పాటు ఖాళీగా ఉన్న జీహెచ్ఎం, ఎంఈవో పోస్టులను సత్వరమే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని కోరుతూ తీర్మానించింది. -
తాజా నిర్ణయాలు, ప్రకటనలపై ఈసీ సీరియస్
సాక్షి, హైదరాబాద్: వివిధ నిర్ణయాలు.. ప్రకటనలతో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల కమిషన్ తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి వివరణ కోరింది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈసీ ఈ చర్యకు ఉపక్రమించింది. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కోడ్‌ను ఉల్లంఘించినట్లుగా ఇటీవల ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కుమార్‌రావు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. రాష్ట్ర మంత్రులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, ముఖ్యమంత్రి, మంత్రులు ఓటర్లను ప్రభావితం చేసే నిర్ణయాలను ప్రకటిస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ కమలాకర్‌రావు ఫిర్యాదు చేశారు. క్రిస్మస్ను అధికారిక ఉత్సవాలుగా ప్రకటించటం, కాలేజీ హాస్టళ్లకు సన్న బియ్యం, ఉస్మానియా యూనివర్సిటీకి మెస్ చార్జీల బకాయిల చెల్లింపులు, బీసీలకు కల్యాణ లక్ష్మి పథకం వర్తింపు, కాళోజీ హెల్త్ వర్సిటీకి వీసీ నియామకం కోడ్ ఉల్లంఘన పరిధిలోకి వస్తాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. సకల జనుల సమ్మె కాలాన్ని స్పెషల్ లీవ్‌గా పరిగణించటం, టెట్ నిర్వహణ, పోలీస్ కానిస్టేబుళ్ల నియామకానికి ఆమోదం తెలిపిందని.. ప్రభుత్వం కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతోందని ఎమ్మెల్యే లక్ష్మణ్ ఆధ్వర్యంలో బీజేపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని భన్వర్‌లాల్ కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించారు. దీని ఆధారంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు.. ప్రకటనలపై వివరణ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీని ఆదేశించింది. కొత్త ప్రకటనలు వద్దు: భన్వర్‌లాల్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే కొత్త నిర్ణయాలు, కొత్త పథకాలను ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణిస్తుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ హెచ్చరించారు. ఎన్నికలు ముగిసేంత వరకు ఓటర్లను ప్రభావితం చేసే నిర్ణయాలు, ప్రకటనలేవీ చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఇలాంటి నిర్ణయాలన్నీ ఎన్నికల కోడ్ ఉల్లంఘన పరిధిలోకి వస్తాయన్నారు. వరంగల్ ఉప ఎన్నికకు సంబంధించి వివిధ పార్టీల నుంచి ఎన్నికల కమిషన్‌కు మొత్తం తొమ్మిది ఫిర్యాదులు అందాయని, వీటిలో నాలుగింటిని పరిశీలించి ప్రాథమిక నివేదికను కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పంపించినట్లు చెప్పారు. మిగతా ఫిర్యాదులపై జిల్లా ఎన్నికల అధికారి నుంచి నివేదిక కోరినట్లు వివరించారు. ఉత్తర్వులేవీ జారీ చేయలేదు: సీఎస్ ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌కు వివరణ సమర్పించింది. పాలనాపరమైన కారణాలతో కొన్ని నిర్ణయాలు తీసుకున్నామని, ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఈసీకి లేఖ రాశారు. ఎన్నికల కమిషన్ నుంచి తగిన ఆమోదం పొందిన తర్వాతే సంబంధిత ఉత్తర్వులు జారీ చేస్తామని పేర్కొన్నారు.