ప్రభుత్వ వైఖరి చెప్పాల్సిందే | The government has to stand on | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ వైఖరి చెప్పాల్సిందే

Dec 6 2015 3:49 AM | Updated on Nov 9 2018 5:52 PM

ప్రభుత్వ వైఖరి చెప్పాల్సిందే - Sakshi

ప్రభుత్వ వైఖరి చెప్పాల్సిందే

ఇసుక అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణాను విచారణార్హమైన (కాగ్నిజబుల్), నాన్ బెయిలబుల్ నేరాలుగా

సాక్షి, హైదరాబాద్ : ఇసుక అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణాను విచారణార్హమైన (కాగ్నిజబుల్), నాన్ బెయిలబుల్ నేరాలుగా పరిగణించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని తెలియచేయకపోవడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, జరిమానా విధించడానికి బదులు ఇసుక అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణాను కాగ్నిజబుల్, నాన్ బెయిల్‌బుల్ నేరాలుగా ఎందుకు పరిగణించకూడదో స్పష్టం చేసి తీరాల్సిందేనని గనుల శాఖ సంయుక్త కార్యదర్శికి స్పష్టం చేసింది. అంతేకాక ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి నవంబర్ వరకు ఇసుక అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణాతో సంబంధం ఉన్న వారిలో ఎంత మందిని అరెస్ట్ చేశారో, నెలల వారీగా గణాంకాలను కోర్టు ముందుంచాలని ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది.

ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. ఇసుక రవాణా చేస్తున్న తమ వాహనాలను అధికారులు సీజ్ చేశారని, ఈ విషయంలో వారు చట్టం నిర్ధేశించిన ప్రక్రియను అనుసరించలేదని, తమ వాహనాలను విడుదల చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ మెదక్ జిల్లాకు చెందిన బండారి పాపిరెడ్డి, మరో ముగ్గురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా, న్యాయమూర్తి ఆదేశాల మేరకు గనులశాఖ సంయుక్త కార్యదర్శి తన కౌంటర్ అఫిడవిట్‌ను కోర్టు ముందుంచారు. అయితే ఈ అఫిడవిట్‌లో కాగ్నిజబుల్, నాన్ బెయిలబుల్ నేరాలుగా ఎందుకు పరిగణించకూడదన్న కోర్టు ప్రశ్నకు ఎటువంటి సమాధానం లేదు.

ప్రస్తుతం ఉన్న నిబంధనలకు అదనంగా హైకోర్టు ఏవైనా సూచనలు, సలహాలిస్తే వాటిని అమలు చేస్తామని పేర్కొన్నారు. దీనిపై న్యాయమూర్తి ఒకింత విస్మయం వ్యక్తం చేశారు. కాగ్నిజబుల్, నాన్ బెయిలబుల్ నేరాలుగా పరిగణించే విషయంలో వైఖరి స్పష్టం చేయకుండా, కోర్టు సూచనలు, సలహాలు పాటిస్తామనడాన్ని తప్పుపట్టారు. కోర్టు ఆదేశించిన విధంగా వైఖరిని తెలియచేయాల్సిందేనని తేల్చి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల అక్రమ మైనింగ్, రవాణా తగ్గిందన్న ప్రభుత్వ న్యాయవాది, అందుకు సంబంధించిన వివరాలను కోర్టు ముందుంచకపోవడాన్ని కూడా న్యాయమూర్తి ఎత్తి చూపారు. 371 ట్రక్కులను జప్తు చేశామన్న ప్రభుత్వ న్యాయవాది, అందుకు సంబంధించి ఎంత మందిని అరెస్ట్ చేశారో చెప్పలేదన్నారు. తదుపరి విచారణ సమయానికి పూర్తి వివరాలను కోర్టు ముందుంచాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement