రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణకు ఈనెల 18 నుంచి చేపట్టాల్సిన ఫీజు చెల్లింపు, 19వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల సమర్పణ
ఎన్నికల సంఘం నుంచి రాని స్పష్టత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణకు ఈనెల 18 నుంచి చేపట్టాల్సిన ఫీజు చెల్లింపు, 19వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల సమర్పణ ప్రక్రియకూ బ్రేక్ పడింది. రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి మంగళవారం స్పష్టత వస్తే, బుధవారం నుంచి దరఖాస్తులను ప్రారంభించాలని విద్యాశాఖ భావించింది. అయితే, ఎన్నికల సంఘం నుంచి వివరణ వచ్చేసరికి కొంత సమయం పడుతుందని సమాచారం అందింది. దీంతో ఉప ఎన్నిక తరువాతే ఫీజు చెల్లింపు, దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించాలని విద్యాశాఖ యోచిస్తోంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా టెట్‌ను ఎలా నిర్వహిస్తారని ఒక రాజకీయ పార్టీకి చెందిన నాయకులు ఫిర్యాదు చేయడంతో విద్యాశాఖ స్పష్టత కోరింది.
టెట్‌కు అనుమతి ఇవ్వండి
టెట్ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని డీఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌కు విజ్ఞప్తి చేసింది. సచివాలయంలో మంగళవారం భన్వర్‌లాల్‌ను సంఘం ప్రతినిధులు కలిశారు. టెట్ ఉద్యోగ పరీక్ష కాదని, గత ఏడాది సాధారణ ఎన్నికల సమయంలోనూ టెట్ నిర్వహణకు అనుమతి ఇచ్చారని అభ్యర్థులు పేర్కొన్నారు. ఆయనను కలిసిన వారిలో డీఎడ్ సంఘం నాయకులు రామ్మోహన్‌రెడ్డి, రవి, భారతి తదితరులు ఉన్నారు.