గురువులు నవ సమాజ నిర్మాతలు

గురువులు నవ సమాజ నిర్మాతలు - Sakshi


ఉపాధ్యాయ దినోత్సవంలో వక్తలు

ఉత్తమ గురువులకు అవార్డుల ప్రదానం




అనంతపురం సిటీ: ఉపాధ్యాయులే నవ సమాజ నిర్మాతలని ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, ఉరవకొండ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి, జిల్లా కలెక్టర్‌ వీరపాండియన్‌లు అన్నారు. మంగళవారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘గురు పూజోత్సవం’ నిర్వహించారు. డీఈఓ లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ, తరగతి గదుల్లోనే దేశ నిర్మాణం జరుగుతుందన్నారు. ఓ ఉపాధ్యాయుడు మార్గనిర్దేశం లేకుండా ఏ విద్యార్థీ రాణించలేరన్నారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యమని, అందువల్ల తల్లిదండ్రులందరూ తమ చిన్నారులకు ఉన్నత విద్య అందించాలన్నారు.



మారుతున్న సాంకేతిక పరిజ్ఞాన్ని పరిచయం చేస్తూ యువతను టెక్నికల్‌ కోర్సుల వైపు మళ్లించగలిగితే అనంత కరువు సీమలో సిరులు కురిపించే వారు తయారవుతారన్నారు.  ప్రధానంగా 10వ తరగతి ఉత్తీర్ణత విషయంలో ప్రతి ఉపాధ్యాయుడు వంద శాతం విజయం సాధించేలా చూడాలన్నారు. 2018 పదవ తరగతి ఫలితాల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి 10కి 10 పాయింట్లు తెచ్చుకున్న విద్యార్థులకు ఈసారి కూడా విమానంలో ప్రయాణించే అవకాశం కల్పించాలన్నారు. కార్యక్రమానికి ముందు సర్వేపల్లి రాధాకృష్ణ చిత్ర పటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శన ఆహూతులను ఆకట్టుకుంది.



ఉత్తమ గురువులకు అవార్డుల ప్రదానం

జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 56 మందిని అధికారులు ఘనంగా సన్మానించారు. ముఖ్య అతిథిలు వారికి  అవార్డులు అందజేశారు. కార్యక్రమంలో రాయల సీమ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు ప్రతాప్‌రెడ్డి, ఎస్‌ఎస్‌ఏ పీఓ సుబ్రమణ్యం, ట్రైనీ కలెక్టర్‌ వెంకటేశం, అసిస్టెంట్‌ కమిషనర్‌ (ఎగ్జామినేషన్‌) గోవిందు నాయక్, ధర్మవరం, అనంతపురం డిప్యూటీ డీఈఓలు ఉమామహేశ్వర్, మల్లికార్జున, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top