ఈ సారైనా నిధులిస్తారా..?

ఈ సారైనా నిధులిస్తారా..? - Sakshi

 

  •  గతేడాది రొట్టెల పండుగకు రాష్ట్ర పండుగగా గుర్తింపు

  • అయినా నిర్వహణకు నిధులను విడుదల చేయని ప్రభుత్వం

  • రూ.కోటికిపైగా ఖర్చు చేసిన కార్పొరేషన్‌

  • ఈ ఏడాది రూ.50లక్షలు ఇవ్వాలని ప్రభుత్వానికి కమిషనర్‌ లేఖ  

నెల్లూరు, సిటీ: నెల్లూరులోని బారాషహీద్‌ దర్గాలో ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే రొట్టెల పండుగకు దేశ, విదేశాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు  తరలి వస్తుంటారు. రొట్టె పండుగ ప్రాముఖ్యత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది జూన్‌లో రాష్ట్ర పండుగగా గుర్తిస్తున్నట్లు ప్రకటించింది. గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన రొట్టెల పండుగ నిర్వహణకు కోటి రూపాయలకుపైగా ఖర్చు అయింది.  ప్రభుత్వం నిధులను విడుదల చేయకపోవడంతో ఈ మొత్తాన్ని నెల్లూరు నగర పాలక సంస్థ భరించాల్సి వచ్చింది. దీంతో కార్పొరేషన్‌ ఆర్థిక భారంతో అప్పుల ఊబిలో కూరుకుపోయింది. 

రూ.80లక్షలతో శాశ్వత మరుగుదొడ్లు నిర్మాణం

బారాషహీద్‌ దర్గాలో జరిగే రొట్టెల పండుగకు వచ్చే భక్తుల సౌకర్యార్థం నగర పాలక సంస్థ రూ.80లక్షలతో 120 శాశ్వత మరుగుదొడ్ల నిర్మాణం చేపడుతోంది. గత ఏడాది ఓ కాంట్రాక్ట్‌ సంస్థకు రూ.35లక్షలు చెల్లించి తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. ఏటా జరిగే పండుగకు శాశ్వత మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టకుండా తాత్కాలిక మరుగుదొడ్లకు భారీగా ఖర్చుచేయడంపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఈ ఏడాది శాశ్వతంగా మరుగుదొడ్లను నిర్మిస్తున్నారు. రాష్ట్ర పండుగగా గుర్తించిన ప్రభుత్వం నిధులను విడుదల చేయకపోవడంతో శాశ్వత మరుగుదొడ్ల కోసం ఖర్చు చేస్తున్న రూ.80లక్షలను ప్రస్తుతం కార్పొరేషన్‌ నిధులు నుంచి కాంట్రాక్టర్‌కు చెల్లిస్తున్నారు. అయితే అధికారులు మాత్రం మరుగుదొడ్లకు కేటాయించిన నిధులను త్వరలో స్వచ్ఛభారత్‌ నిధుల నుంచి కార్పొరేషన్‌కు మళ్లిస్తామని చెబుతుండడం విశేషం.

రూ.50లక్షలు ఇవ్వాలని ప్రభుత్వానికి కమిషనర్‌ లేఖ 

రొట్టెల పండుగ నిర్వహణకు ఈ ఏడాది రూ.కోటికిపైగా ఖర్చు అయ్యే అవకాశం ఉందని, రూ.50లక్షలు విడుదల చేయాలని కార్పొరేషన్‌ కమిషనర్‌ కరణం వెంకటేశ్వర్లు ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ ఏడాదైన రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రొట్టెల పండుగకు నిధులు కేటాయిస్తుందా..లేక గత ఏడాది పరిస్థితే పునరావృతం అవుతుందో వేచి చూడాల్సిందే.
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top