పార్టీ ఓటమితో సోనియా బాధపడ్డారు | Sonia suffered by the party defeat | Sakshi
Sakshi News home page

పార్టీ ఓటమితో సోనియా బాధపడ్డారు

Nov 19 2015 3:13 AM | Updated on Oct 22 2018 9:16 PM

పార్టీ ఓటమితో సోనియా బాధపడ్డారు - Sakshi

పార్టీ ఓటమితో సోనియా బాధపడ్డారు

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఒత్తిడితోనే యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని ఏఐసీసీ నాయకుడు,

వరంగల్: తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఒత్తిడితోనే యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని ఏఐసీసీ నాయకుడు, రాజ్యసభలో కాంగ్రెస్ పక్షనేత గులాంనబీ ఆజాద్ తెలిపారు. వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా బుధవారం వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి ఎంజీఎం ఆస్పత్రి చౌరస్తా వరకు నిర్వహించిన రోడ్ షోలో ఆయన ప్రసంగించారు. ‘‘తెలంగాణ కోసం యూపీఏ భాగస్వామ్య పక్షాలను ఒప్పించి తెలంగాణ బిల్లు తెచ్చేందుకు సోనియా కృషి చేశారు. ఆమె ఆదేశాల మేరకే సీడబ్ల్యూసీ, కేంద్ర కేబినెట్‌లో తీర్మానం ఆమోదింపజేశాం. దీనిపై ఆంధ్రాలో వ్యతిరేకత వచ్చినా పట్టించుకోలేదు. ఆంధ్రా నాయకులు, సీఎంలు వ్యతిరేకించినా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజలకు న్యాయం చేశారు.

అయినా 2014లో పార్లమెంటుతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడం సోనియాను బాధపెట్టింది’’ అని ఆయన పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి సర్వే సత్యనారాయణను గెలిపించి సోనియాకు కానుకగా ఇవ్వాలని కోరారు.ప్రజల ఆకాంక్ష మేరకే 2009లో జరిగిన ఎన్నికల సందర్భంగా తెలంగాణ ఏర్పాటు అంశాన్ని యూపీఏ ఉమ్మడి అజెండాలో పెట్టామన్నారు. తమ పార్టీ ఎంపీలు నిత్యం పార్లమెంట్‌ను స్తంభింపజేయడం, ఒత్తిడి తేవడంతో సోనియా తెలంగాణ ఇవ్వాలని నిర్ణయించినట్లు వివరించారు. టీఆర్‌ఎస్‌కు ఉన్న ఇద్దరు ఎంపీలతో ప్రత్యేక రాష్ట్రం సాధ్యమయ్యేదా అని ప్రశ్నించారు.

 మాఫీపై మోసంతోనే ఆత్మహత్యలు
 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయని ఆజాద్ పేర్కొన్నారు. రుణమాఫీపై మోసం చేయడం వల్లే తెలంగాణలో ఆత్మహత్యలు ఆగడం లేదన్నారు. యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.70 వేల కోట్ల మేరకు రుణాలు మాఫీ చేసిందని చెప్పారు. టీఆర్‌ఎస్ కేవలం 25 శాతం రుణాన్నే మాఫీ చేయడంతో రైతులకు మళ్లీ అప్పులు పుట్టడం లేదని చెప్పారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేయకుంటే ఉద్యమాలు చేస్తామని స్పష్టంచేశారు.

మోదీ ప్రభుత్వానికి బిహార్‌లో పతనం మొదలైందని, టీఆర్‌ఎస్ ప్రభుత్వ పతనం వరంగల్ ఉప ఎన్నికతో ప్రారంభం కావాలని అన్నారు. రోడ్‌షోలో ఎంపీ అభ్యర్థి సర్వే సత్యనారాయణ, పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్, మాజీ మంత్రి సారయ్య, మాజీ ఎంపీ వివేక్, డీసీసీ అధ్యక్షుడు నారుుని రాజేందర్‌రెడ్డి, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు నేరెళ్ల శారద పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement