‘మట్టి’ మాయ

‘మట్టి’ మాయ - Sakshi

  • ఈ ఏడాది 77 లక్షల క్యూ.మీ మట్టి వెలికితీత

  • దారిమళ్లుతున్నా పట్టించుకోని యంత్రాంగం

  • టీడీపీ నేతల జేబులు నింపుతున్న నీరు–చెట్టు 

  • పక్కదారి పట్టిన మట్టి విలువ రూ.100 కోట్ల పైమాటే

  • ‘నీరు–చెట్టు’ మట్టి గుటకాయ స్వాహా అవుతోంది. అధికారులకు, అధికార పార్టీ నేతలకు  కల్పతరువుగా మారుతోంది. తవ్వుతున్న మట్టికి లెక్కాపత్రం చెప్పే పరిస్థితి లేకపోవడంతో అమ్ముకున్న వాళ్లకు అమ్ముకున్నంత అన్నట్టుగా తయారైంది. గతేడాది 18 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి ఏమైపోయిందో తెలియలేదు. తాజాగా ఈ ఏడాది ఇప్పటివరకు ఏకంగా 77 లక్షల క్యూ.మీ. మట్టిని వెలికి తీసినట్టు రికార్డుల్లో చూపిస్తున్నారు. అయితే ఆ మట్టిని ఏ విధంగా వినియోగిస్తున్నదీ చెప్పే నాధుడు కరువయ్యాడు. ఇప్పటి వరకు వెలికి తీసినదానిలో పక్కదారి పట్టిన మట్టి విలువ అక్షరాల రూ. వంద కోట్ల పైమాటేనని తెలుస్తోంది.

    సాక్షి, విశాఖపట్నం: 

    నీరు–చెట్టు పథకం కింద జిల్లాలో గతేడాది రెండు విడతలుగా 92 చెరువుల్లో రూ.23 కోట్లతో  పనులు చేపట్టారు. 73 చెరువు పనులు ప్రారంభించినప్పటికీ  20 శాతం పనులు మాత్రమే పూర్తి కాగా రూ.ఐదు కోట్ల చెల్లింపులు చేశారు.  ఏకంగా 18 లక్షల క్యూ.మీ. మట్టిని మాత్రం వెలికి తీశారు. ఇక ఈ ఏడాది  326 చెరువుల్లో పూడిక తీయాలన్న లక్ష్యంతో రూ.107 కోట్లతో 1068 పనులకు పరిపాలనామోదం ఇచ్చారు. వీటిలో 756 పనులు గ్రౌండ్‌ కాగా, వాటిలో 356 పనులు పూర్తయ్యాయి. మరో 406 పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇప్పటివరకు రూ.21 కోట్లు ఖర్చు చేయగా.. రూ.9 కోట్ల మేర చెల్లింపులు చేశారు. మరో రూ.11 కోట్ల మేర చెల్లింపులు చేయాల్సి ఉంది. 

    అనధికారికంగా మరింత మట్టి

     ఇప్పటివరకు పూర్తయిన, ప్రగతిలో ఉన్న పనుల ద్వారా 77 లక్షల క్యూ.మీ. మట్టిని వెలికి తీసినట్టు అధికారులు లెక్కతేల్చారు. ఇందుకోసం 271 ఎక్స్‌వటర్స్‌ వినియోగించగా, 1650 ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా ఈ మట్టిని తరలించినట్టు రికార్డుల్లో చూపారు.   ఇంత పెద్దఎత్తున వెలికి తీసిన మట్టి్ట ఏమైందంటే మాత్రం అధికారుల వద్ద సమాధానం లేదు. ప్రతి చెరువులోనూ మీటర్‌ నుంచి రెండున్నర మీటర్ల (ఆరడుగులు) లోతున సిల్ట్‌ తొలగిస్తున్నట్టు చూపిస్తున్నారు. ఈ లెక్కన  ఎకరాకు 4వేల క్యూ.మీ వరకు మట్టి వస్తుందని అంచనా. అధికారికంగానే 77 లక్షల క్యూ.మీ. మట్టిని వెలికి తీసినట్టు చెబుతున్నారంటే అనధికారికంగా ఇంకెంత మట్టిని వెలికి తీశారో అర్థమవుతుంది. ఎందుకంటే ఇరిగేషన్‌ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన చెరువులన్నీ దాదాపు వందెకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్నవే. వెలికితీసిన మట్టిని పంచాయతీల పరిధిలోనే  రైతులు.. స్థానికుల అవసరాలకు వినియోగించాలి. కాని ఇప్పటివరకు ఏ ఒక్క పంచాయతీలో మట్టికి సంబంధించి సీనరేజ్‌ సొమ్ము జమైన దాఖలాలు లేవు. స్థానికంగా వినియోగించిన ఛాయలు లేవు. పొలాల గట్లను ఎత్తు చేసుకునేందుకు రైతులు తరలించుకు పోతున్నారని ఇరిగేషన్‌ అధికారులు చెబుతున్నారు. ఇంత పెద్దఎత్తున వస్తున్న మట్టిని ఉపయోగించి బలహీనంగా ఉన్న శారదా, వరహా, గోస్తని వంటి నదుల కరకట్టలను బలోపేతం చేసుకునే వెసులుబాటు ఉంది. కానీ ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు కన్పించడం లేదు.

    క్యూ.మీ మట్టి రూ.250

     మార్కెట్‌లో క్యూ.మీ మట్టి రూ.250 పలుకుతోంది. విశాఖలో  రియల్టర్లు తమ వెంచర్స్‌లో ఎర్త్‌ ఫిల్లింగ్‌ కోసం నీరు చెట్టు మట్టినే వినియోగిస్తున్నట్టు తెలిసింది. వీరికి కొంత మంది టీడీపీ నేతలు మట్టిని సరఫరా చేస్తున్నారని చెబుతున్నారు. గతేడాది మాటెలాగున్నా ఈ ఏడాది ఇప్పటి వరకు వెలికి తీసిన మట్టిలో కనీసం 50 లక్షల క్యూ.మీ. దారి మళ్లినట్టు తెలుస్తోంది. ఈ మట్టి విలువ  రూ.100 కోట్ల పైమాటేనని అంచనా. ఇదే విషయాన్ని ఇరిగేషన్‌ శాఖాధికారులను వివరణ కోరితే వెలికి తీసిన మట్టిని తిరిగి చెరువు గట్లు, స్థానిక రైతుల పొలాల గట్ల పటిష్టతకు, పంచాయతీల పరిధిలోని శ్మశానవాటికలు, పల్లపు ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ స్థలాలను ఎత్తు చేసేందుకే వినియోగిస్తున్నారని.. ఎక్కడా పక్కదారి పట్టలేదని చెప్పుకొస్తున్నారు.

     
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top