వరంగల్ ఉప ఎన్నికల్లో పోటీచేయనున్న కాంగ్రెస్ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్యకు తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి భీపాం ఇచ్చారు.
హైదరాబాద్: వరంగల్ ఉప ఎన్నికల్లో పోటీచేయనున్న కాంగ్రెస్ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్యకు తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి బీపాం ఇచ్చారు. దాంతో సోమవారం రాజయ్య నామినేషన్ వేయనున్నారు. వరంగల్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయమని ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రజలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం మోసం చేస్తోందని విమర్శించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం కూడా ఎన్నికల హామీల అమల్లో విఫలమైందని దుయ్యబట్టారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే వ్యవసాయ రంగం కుదేలైందని మండిపడ్డారు. వందలాంది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఉత్తమ్ చెప్పారు. వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి రాజయ్య మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి కాంగ్రెస్ మాట నిలుపుకుంటే.. ఎన్నికల హామీలు అమలు చేయకుండా టీఆర్‌ఎస్ మాట తప్పిందని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో ఒకే ధపాలో రుణమాఫీ జరిగితే.. తెలంగాణ ప్రభుత్వం వాయిదాల పర్వం కొనసాగిస్తోందని రాజయ్య విమర్శించారు.