రొయ్యల ఘాటు.. చేపకు చేటు | Sakshi
Sakshi News home page

రొయ్యల ఘాటు.. చేపకు చేటు

Published Sat, May 20 2017 1:50 AM

SELINITY OF PRAWNS PONDS.. HARM TO FISH PONDS

ఆకివీడు : చేపలపై రొయ్యలు ఉప్పు ఘాటు పంజా విసురుతున్నాయి. నిన్నటివరకు వరి చేలకే పరిమితమైన ఉప్పు శాతం ఇప్పుడు చేపల చెరువుల్నీ నిండా ముంచుతోంది. మొత్తానికి రొయ్యల చెరువులు అటు వరి సాగును.. ఇటు చేపల పెంపకాన్ని తీవ్రంగా ఆటంకపరుస్తున్నాయి. రొయ్యల సాగు విస్తరించడంతో నీటిలో సెలినిటీ (ఉప్పు) శాతం పెరిగిపోతోంది. ఇది చేపల చెరువుల్లోకి ప్రవేశించడంతో మత్స్యాలు ఎదుగుదల లేక గిడసబారిపోతున్నాయి. టన్నుల కొద్దీ మేత వేసిపెంచినా చెరువుల్లోని చేపలు తగిన స్థాయిలో ఎదగక దిగుబడి తగ్గిపోతోంది. ఫలితంగా చేపల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. 
 
ఉప్పు ముప్పే కారణం
అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో 2.30 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు విస్తరించిది. ఇందులో 1.10 లక్షల ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతోంది. రొయ్యల చెరువులు ఎంత విస్తీర్ణంలో ఉన్నాయనేది అధికారిక లెక్కలు లేవు. నిబంధనలకు విరుద్ధంగా చెరువులు తవ్వడం.. రొయ్యల చెరువుల్లోని నీటిని పంట కాలువలు, మురుగు బోదెల్లోకి విచ్చలవిడిగా వదిలేయడం పరిపాటిగా మారింది. రొయ్యల చెరువుల్లో ఉపయోగించే నీటిలో ఉప్పు (సెలినిటీ) శాతం 20 వరకూ ఉంటుంది. ఈ నీరు కాలువల్లోకి చేరడం వల్ల అందులోనూ సెలినిటీ పెరిగిపోతోంది. చేపలు మహా అయితే 2నుంచి 4శాతం లోపు సెలినిటీని మాత్రమే తట్టుకోగలవు. చేపల చెరువుల్లోకి చేరే నీటిలో ఈ శాతం 10నుంచి 15 శాతం వరకు ఉండటంతో తట్టుకోలేకపోతున్నాయి. దీనివల్ల రోగాల బారిన పడటం, పెరుగుదల క్షీణించడం వంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఫలితంగా దిగుబడి గణనీయంగా పడిపోయి చేపల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. 
కొల్లేరు తీర ప్రాంతాల్లో ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కొల్లేరు సరస్సులోకి సముద్రపు నీరు ప్రవేశించడం, మరోవైపు రొయ్యల చెరువుల నీరు పంట, మురుగు కాల్వల్ని ముంచెత్తడంతో చేపల పెంపకం ఇబ్బందిగా మారింది. సెలినిటీ వల్ల చేపల్లో రోగనిరోధక శక్తి కూడా తగ్గిపోయి వ్యాధులు విజృంభిస్తున్నాయి. తెల్లమచ్చ, శంకు లోపం, డీఓ (నీటిలో ఆక్సిజ¯ŒS శాతం) తగ్గిపోవడం వంటి పరిస్థితులతో చెరువుల్లోని చేపలు చనిపోతున్నాయి. ఏడాదిపాటు టన్నులకొద్దీ మేతలు వేసి పెంచినా చేపల్లో ఎదుగుదల ఉండటం లేదు. 100 గ్రాముల బరువైన చేపను పెంచడం మొదలుపెడితే 6 నెలలకు కేజీ వరకు పెరగాలి. కనీసం అరకేజీ కూడా పెరగటం లేదని చెబుతున్నారు. 
 
ఎదుగుదల క్షీణిస్తోంది
ఉప్పు శాతం పెరిగిపోవడంతో చేపల ఎదుగుదల క్షీణిస్తోంది. 100 గ్రాముల చేప పిల్లల్ని పెంపకం నిమిత్తం చెరువుల్లో వేస్తే 6 నెలల్లో కేజీకి పైబడి ఎదుగుదల ఉండాలి. ఆ పరిస్థితి లేదు. 
 కట్రెడ్డి మోహన్, ఆక్వా రైతు, పెదకాపవరం
 
రొయ్యల చెరువుల నీటితో తీవ్ర ఇబ్బంది
ఒకప్పుడుయ కొల్లేరు సరస్సు ప్రాంతంలోని చెరువుల్లో చేపలు పెంచితే ఎదుగుదల బాగుండేది. త్వరితంగా ఎదిగి రైతుకు లాభాలు వచ్చేవి. ఉప్పునీటి ప్రభావంతో చేపల పెంపకం తీవ్ర నష్టానికి గురిచేస్తోంది. మేత ఎంత వేసినా చేపల్లో ఎదుగుదల కనిపించడం లేదు. 
 కొల్లి రాంబాబు, కొల్లేరు రైతు, కొల్లేటి కోట
 
సెలినిటీ సున్నా ఉండాలి
చేపల చెరువుల్లోని నీటిలో సెలినిటీ శాతం సున్నా ఉండాలి. నీటిలో ఉప్పు శాతం ఏ మాత్రం పెరిగినా చేపల ఎదుగుదలలో లోపం వస్తుంది. వ్యాధులొస్తాయి. రైతు ఆర్థికంగా నష్టపోతాడు. మంచినీరు లభించక చేపల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
 పి.రామారావు, ఆక్వా ల్యాబ్‌ టెక్నీషియన్, ఆకివీడు 
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement