ప్రొ కబడ్డీ పాట్నా పైరేట్స్‌కు సతీష్‌కుమార్‌ ఎంపిక | Sakshi
Sakshi News home page

ప్రొ కబడ్డీ పాట్నా పైరేట్స్‌కు సతీష్‌కుమార్‌ ఎంపిక

Published Fri, May 26 2017 12:10 PM

ప్రొ కబడ్డీ పాట్నా పైరేట్స్‌కు సతీష్‌కుమార్‌ ఎంపిక

► రూ.12 లక్షలకు కొనుగోలు చేసిన జట్టు యాజమాన్యం
►జూలైలో జరిగే ఐదో సీజన్‌లో పాల్గొనే అవకాశం  

కొడవలూరు (కోవూరు) :  ప్రొ కబడ్డీ పాట్నా పైరేట్స్‌ జట్టుకు కోవూరుకు చెందిన పూనుగుంట సతీష్‌కుమార్‌ ఎంపికయ్యారు. ఈనెల 22, 23 తేదీల్లో ముంబైలో జరిగిన బహిరంగ ఆక్షన్‌లో పాట్నా పైరేట్స్‌ జట్టు యాజమాన్యం రూ.12 లక్షలకు సతీష్‌ను కొనుగోలు చేశారు. ఈ ఏడాది జూలైలో జరిగే ఐదో సీజన్‌ ప్రొకబడ్డీ పోటీల్లో పాల్గొనే పాట్నా జట్టుకు డిఫెండర్‌గా సతీష్‌ ఎంపికయ్యారు. నాలుగో సీజన్‌లో బెంగళూరు బుల్స్‌ జట్టులో స్థానం దక్కించుకున్న సతీష్‌ ఈసారి పాట్నా పైరేట్స్‌ జట్టు నుంచి బరిలో దిగుతున్నాడు. సతీష్‌ 20కి పైగా జాతీయస్థాయి కబడ్డీ పోటీల్లో రాష్ట్ర జట్టు నుంచి పాల్గొని బహుమతులు సాధించాడు.

జూనియర్స్‌ జాతీయ జట్టుకు కూడా ప్రాతినిథ్యం వహించాడు. క్రీడా కోటాలో రైల్వేలో టీటీఐ ఉద్యోగం సాధించిన సతీష్‌కుమార్‌ ఆ తర్వాత రైల్వేస్‌ జట్టుకు ఎనిమిదిసార్లు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ సందర్భంగా సతీష్‌కుమార్‌ సాక్షితో మాట్లాడుతూ ఏపీ కబడ్డీ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు కేఈ ప్రభాకర్, వీర్ల వెంకయ్యల ప్రోత్సాహంతోనే తాను ఈస్థాయికి ఎదిగినట్లు తెలిపారు. కాగా సతీష్‌ ఎంపిక పట్ల క్రీడా సంఘాల నాయకులు హర్షం వ్యక్తంచేశారు. పోటీల్లో రాణించి మరింత ఉన్నత స్థానానికి ఎదగాలని ఆకాక్షించారు. 
 

Advertisement
 
Advertisement
 
Advertisement