చైతన్యంతోనే బడుగులకు రాజ్యాధికారం | Sakshi
Sakshi News home page

చైతన్యంతోనే బడుగులకు రాజ్యాధికారం

Published Sat, Mar 18 2017 11:43 PM

చైతన్యంతోనే బడుగులకు రాజ్యాధికారం - Sakshi

- బలహీన వర్గాలను పావులుగా వాడుకుంటున్న టీడీపీ
- సామాజిక హక్కుల వేదిక రాష్ట్ర కన్వీనర్‌ రామకృష్ణ
- ముగిసిన ప్రజా చైతన్య బస్సు యాత్ర

అనంతపురం న్యూటౌన్‌ : తెలుగుదేశం ప్రభుత్వ ప్రజాకంటక విధానాలపై ఉద్యమిస్తామని సామాజిక హక్కుల వేదిక రాష్ట్ర కన్వీనర్‌ కె.రామకృష్ణ స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజల సమస్యలపై చేపట్టిన ప్రజాచైతన్య బస్సుయాత్ర ముగింపు సభ శనివారం సాయంత్రం స్థానిక ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో వేదిక జిల్లా కన్వీనర్‌ జగదీష్‌ అధ్యక్షతన నిర్వహించారు. సభలో రామకృష్ణ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీలను టీడీపీ పావులుగా ఉపయోగించుకుంటోందన్నారు. మంత్రి వర్గంలో ఎస్టీలు, ముస్లింలకు చోటు కల్పించకపోవడం శోచనీయమన్నారు. రానున్న రోజుల్లో ఆయా వర్గాల వారిని మంత్రి వర్గంలోకి తీసుకోకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు.

రాజ్యాధికారమే లక్ష్యంగా బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీలు చైతన్యంతో ఏకతాటిపై నడవాలని పిలుపునిచ్చారు. విశిష్ట అతిథిగా విచ్చేసిన కేరళ వ్యవసాయ శాఖ మంత్రి సునీల్‌కుమార్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై పూర్తి నిర్లక్ష్య ధోరణిలో ఉందన్నారు. దేశ వ్యాప్తంగా ఒకే రకమైన అజెండాను అమలు చేయడానికి అణగారిన వర్గాలకు అన్యాయం చేయాలని చూస్తోందని మండిపడ్డారు. అదేవి«ధంగా ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎంఎస్‌ రాజు, బీసీ సంక్షేమ సంఘం రాయలసీమ జిల్లాల అధ్యక్షులు రమేష్‌ గౌడ్, సామాజిక హక్కుల వేదిక నాయకులు సత్యనారాయణమూర్తి, మైనార్టీ నాయకులు డాక్టర్‌ మైనుద్దీన్, జాఫర్, బీసీ సంఘం నాగభూషణం తదితరులు బీసీ, ఎస్సీలపై ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు.

ఆకట్టుకున్న ‘వందేమాతరం’
ముగింపు సభకు మరో ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ సినీ గాయకుడు వందేమాతరం శ్రీనివాస్‌ ఆలపించిన ‘వందేమాతర గీతం’ సభికులను అమితంగా ఆకట్టుకుంది. అలాగే ప్రజా నాట్యమండలి కళాకారులు, ప్రాచీన కళారూపాల ప్రదర్శనలతో, ఆటపాటలతో పలు చైతన్య గీతాలను అద్భుతంగా ఆలపించి అలరించారు. అంతకుముందు స్థానిక అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన సామాజిక హక్కుల వేదిక నేతలు ర్యాలీగా సభాస్ధలికి చేరుకున్నారు. కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన రజక సంఘం నాయకులు కమ్మన్న, దేవేంద్రప్ప, నాయీబ్రాహ్మణ సంఘం నాయకులు ప్రసాద్, మహిళా సమాఖ్య నేతలు జయలక్ష్మి, దుర్గాభవానీ, కురుబ సంఘం బోరంపల్లి ఆంజనేయులు, బంజారా నేతలు కైలాష్‌నాయక్, ముస్లిం మైనార్టీ నాయకులు ఇమామ్, బాషా తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement