పెళ్లి వ్యాన్ -ప్రైవేటు బస్సు ఢీ: 15 మంది మృతి | road accident in pralasham district, many fear dead | Sakshi
Sakshi News home page

పెళ్లి వ్యాన్ -ప్రైవేటు బస్సు ఢీ: 15 మంది మృతి

Oct 17 2015 9:36 AM | Updated on Sep 3 2017 11:06 AM

ప్రమాదానికిగురైన తర్వాత ప్రైవేట్ బస్సు నుంచి ఎగిసిపడుతున్న పొగ

ప్రమాదానికిగురైన తర్వాత ప్రైవేట్ బస్సు నుంచి ఎగిసిపడుతున్న పొగ

ప్రకాశం జిల్లాలో శనివారం ఉదయం జరిగిన రోడ్డ ప్రమాదంలో మరో 12 మంది దుర్మరణం చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

-ప్రకాశం జిల్లా చెర్లోపాళెం వద్ద దుర్ఘటన
- పెళ్లి బృందం వ్యాన్‌ను ఢీకొన్న బస్సు..15 మంది దుర్మరణం,25 మందికి తీవ్రగాయాలు
- కారులో వెళ్లడంతో పెళ్లికుమార్తె, పెళ్లికుమారుడు క్షేమం

కందుకూరు :
మరికాసేపట్లో గుడిలో పెళ్లికి హాజరవుతామని ఆనందంలో ఉన్న బంధువులను మృత్యువు వెంటాడింది. దీంతో పెళ్లి కుటుంబంతో పాటు బంధువుల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా ఓలేటివారిపాళెం మండలం చెర్లోపాళెం శివారులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 15 మంది అక్కడికక్కడే మృతిచెందగా, మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతిచెందిన వారిలో ఐదుగురు పిల్లలు, ఆరుగురు మహిళలు ఉన్నారు. ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం చేవూరు నుంచి పెళ్లి బృందం డీసీఎంలో మానకొండలో ఆలయానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

 

పెళ్లి కూమార్తె, పెళ్లి కుమారుడు ముందు కారులో వెళ్లగా కుటుంబసభ్యులు, బంధువులు వెనుక డీసీఎంలో బయలుదేరారు. మానకొండకు వెళుతున్న డీసీఎంను ఎదురుగా కందుకూరు వైపు వస్తున్న శ్రీకృష్ణ ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేటు బస్సు ఢీకొంది. ఈ సంఘటనలో బస్సు క్యాబిన్‌లోకి డీసీఎం దూసుకుపోవడంతో మంటలు చెలరేగి బస్సు మొత్తం కాలిపోయింది. డీసీఎం ఢీకొట్టిన వెంటనే బస్సు పక్కనున్న కాల్వలోకి బోల్తాకొట్టింది. పెళ్లి బృందంలో 15 మంది అక్కడికక్కడే మృతిచెందగా మరో 25మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

 

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ప్రయాణికులు ఎవరూ లేరు. డ్రైవర్ ఒక్కడే ఉన్నాడు. బస్సు డ్రైవర్ మద్యం సేవించి ఉన్నాడని, అతివేగంగా నడపడంవల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పి మృతదేహాలను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు. క్షతగాత్రులను కందుకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. వారిని మెరుగైన వైద్యం కోసం ఒంగోలు, విజయవాడ ఆస్పత్రులకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement