పరామర్శకు వెళ్లి వస్తూ.. | Road accident | Sakshi
Sakshi News home page

పరామర్శకు వెళ్లి వస్తూ..

Sep 15 2016 10:17 PM | Updated on Apr 3 2019 7:53 PM

పరామర్శకు వెళ్లి వస్తూ.. - Sakshi

పరామర్శకు వెళ్లి వస్తూ..

వారిద్దరూ అక్కాచెల్లెలు.. సోదరి కూతురి కోడలు దినకర్మకు పెదపూడి నుంచి రాజానగరం వచ్చారు. కార్యక్రమం అనంతరం తిరిగి వెళ్లేందుకు రాజానగరం సెంటర్‌కు వచ్చారు. బస్సు మిస్‌కావడంతో అటుగా కాకినాడవైపు వెళుతున్న కారును ఆపి ఎక్కారు. ఎక్కిన కొద్ది నిముషాలకే వారు ప్రయాణిస్తున్న కారు ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది.

  • రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు మహిళలు 
  • వడిశలేరు వద్ద ఏడీబీ రోడ్డుపై ఘటన 
  • ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కారు
  • ఆస్పత్రికి తరలిస్తుండగా డ్రైవర్‌ మృతి
  • వడిశలేరు (రంగంపేట) : 
    వారిద్దరూ అక్కాచెల్లెలు.. సోదరి కూతురి కోడలు దినకర్మకు పెదపూడి నుంచి రాజానగరం వచ్చారు. కార్యక్రమం అనంతరం తిరిగి వెళ్లేందుకు రాజానగరం సెంటర్‌కు వచ్చారు. బస్సు మిస్‌కావడంతో అటుగా కాకినాడవైపు వెళుతున్న కారును ఆపి ఎక్కారు. ఎక్కిన కొద్ది నిముషాలకే వారు ప్రయాణిస్తున్న కారు ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. తీవ్రగాయాలపాలైన కారు డ్రైవర్‌ కూడా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో కన్నుమూశాడు. రంగంపేట మండలం వడిశలేరులో ఏడీబీ రోడ్డుపై గురువారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. 
    ఈ ప్రమాదంలో మృతులతో పాటు మరికొందరు గాయపడ్డారు. పోలీసులు, మృతుల బంధువుల కథనం ప్రకారం.. రాజానగరంలోని దివంగత కురుకూరి అన్నపూర్ణ కుమార్తె కొండపల్లి భవాని కోడలు అరుణ ఈ నెల రెండో తేదీన అనారోగ్యంతో మృతి చెందగా.. ఈ నెల 12న ఆమెకు పెద్దదిన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం పూర్తి చేసుకుని పెదపూడి గ్రామానికి చెందిన ఈదేటి మాచరమ్మ(70), పెద్దాడ గ్రామానికి చెందిన యార్లగడ్డ వెంకటలక్ష్మి(65) పెదపూడి వెళ్లేందుకు రాజానగరం హైస్కూల్‌ సెంటర్‌కు వచ్చారు. గొల్లలమామిడాడ వెళ్లే ఆర్టీసీ బస్సు ఆపకపోవడంతో కాకినాడ వెళ్లే చిన్నకారు ఎక్కారు. వడిశలేరు గ్రామం దాటిన తరువాత చిన్నకారు రాళ్ల లోడు లారీని తప్పించి, రంగంపేట వైపు నుంచి రాజమహేంద్రవరం వెళ్లే ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. చిన్నకారులో ప్రయాణిస్తున్న మాచరమ్మ, వెంకటలక్ష్మిలకు తలకు తీవ్రగాయాలవడంతో ప్రమాదస్థలంలోనే వారు మృతి చెందారు. కాకినాడ వలసపాకలకు చెందిన టాక్సీ డ్రైవర్‌ రాయుడు సతీష్‌కుమార్‌(35) రాజానగరం జీఎస్‌ఎల్‌ ఆసుపత్రికి తీసుకువెళుతుండగా మార్గమధ్యలో చనిపోయాడు. చిన్నకారులో ప్రయాణిస్తున్న కాకినాడకు చెందిన జాల సరస్వతికి, ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న పుట్టా సత్యవతి, రాజమహేంద్రవరం రూరల్‌ మండలం నామవరానికి చెందిన పెంటా అప్పల నరసమ్మకు స్వల్పగాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం రాజానగరం పంపారు. సంఘటన స్థలాన్ని పెద్దాపురం సీఐ ఎస్‌ ప్రసన్నవీరయ్యగౌడ్, ఎస్సై ఎన్‌ సన్యాసినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టమ్‌ నిమిత్తం తరలించారు. రాజమహేంద్రవరం ఆర్టీసీ బస్‌ డ్రైవర్‌ అడ్డూరి అబ్బాయి చాకచక్యంగా ఎడమవైపు కాలువలోకి బస్సును పోనిచ్చి ఆపడంతో ఎదురుగా ఉన్న కల్వర్టును ఢీకొట్టకుండా 56 మంది ప్రాణాలను కాపాడగలిగాడని స్థానికులు చెప్పారు. ప్రమాద స్థలాన్ని ఎంపీడీఓ కె.కిషోర్‌కుమార్, తహసీల్దార్‌ బి.రామారావు, స్థానిక ఎంపీటీసీ సభ్యుడు కోన సత్యనారాయణ తదితరులు సందర్శించి మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. 
     ‘కోడలి దిన కార్యక్రమానికి వచ్చి నాలుగు రోజులు పాటు కలిసి మెలసి ఉన్న పెద్దమ్మ మాచరమ్మ, పిన్నమ్మ వెంటలక్ష్మిలు ప్రమాదంలో మృతి చెందడాన్ని మృతురాళ్ల సోదరి కుమార్తె కొండపల్లి భవానీ జీర్ణించుకోలేకపోతోంది. హైదరాబాద్‌ నుంచి వచ్చిన పిన్నమ్మ ఏకైక కుమారుడికి ఏ విధంగా సమా«ధానం చెప్పను దేవుడా!’’ అంటూ బోరున విలపించింది. తమకు ధైర్యం చెప్పి వెళ్లిన వాళ్లు విగతజీవులుగా మారడం ఊహించలేకపోతున్నామని భవాని భర్త రామన్న, కుమారుడు సురేష్‌కుమార్‌ కన్నీళ్లు పెట్టుకున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement