రాష్ట్ర ముఖ్యమంత్రి చం ద్రబాబు నాయుడు తన స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని వైఎస్‌ఆర్ సీపీ
శ్రీకాకుళం అర్బన్: రాష్ట్ర ముఖ్యమంత్రి చం ద్రబాబు నాయుడు తన స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని వైఎస్‌ఆర్ సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి విమర్శించారు. ఆమె బుధవారం శ్రీకాకుళంలోని వైఎస్‌ఆర్ సీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో కృష్ణా, గోదావరి నదులపై ప్రాజెక్టులు కట్టడానికి ప్రయత్నాలు జరుగుతుంటే సీఎం మిన్నకుండిపోవడం బాధాకరమన్నారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు ఆ కేసు ఎక్కడ తిరగదోడతారనే భయంతోనే నోరు మెదపడం లేదని ఆరోపించారు.
రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ప్రతిపక్ష నేతగా ప్రజల తరఫున వై.ఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కర్నూలు జిల్లాలో మూడు రోజుల జలదీక్ష చేశారని తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా విషయంలో ప్రధాని మోదీ వద్దకు వెళ్లినా లాభం లేకపోవడం శోచనీయమని అన్నారు. ప్రత్యేక హోదాతో లాభమేంటని సాక్షాత్తు సీఎం చెప్పడం సరికాదని అ న్నారు. జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన జలదీక్షకు సంఘీభావంగా జిల్లాలోని మండలాల్లో పార్టీ శ్రేణులన్నీ దీక్షలు చేపట్టడం అభినందనీయమన్నారు. సమావేశంలో పార్టీ కేంద్ర కార్యనిర్వాహకమండలి సభ్యుడు అంధవరపు సూరిబాబు, పార్టీ ట్రేడ్ యూనియన్ జిల్లా అద్యక్షుడు పి.జీవరత్నం, పార్టీ యువజన విభాగం నగర అధ్యక్షుడు కోరాడ రమేష్ తదితరులు పాల్గొన్నారు.