పుష్కర రోడ్డుకు పురిట్లోనే పగుళ్లు | Puskara roads under 'cracks' | Sakshi
Sakshi News home page

పుష్కర రోడ్డుకు పురిట్లోనే పగుళ్లు

Aug 29 2016 6:46 PM | Updated on Aug 30 2018 4:49 PM

పుష్కర రోడ్డుకు పురిట్లోనే పగుళ్లు - Sakshi

పుష్కర రోడ్డుకు పురిట్లోనే పగుళ్లు

కృష్ణా పుష్కరాల సందర్భంగా ప్రభుత్వం హడావుడిగా చేపట్టిన అనేక పనుల్లో కాంట్రాక్టర్లు, అధికారులు నాణ్యతకు పాతరేశారు. ఏ మాత్రం ప్రమాణాలు పట్టించుకోకుండా పనులు చేయడం విమర్శలకు దారితీస్తోంది.

 * నాణ్యతా లోపంతో రహదారి నిర్మాణం
 రోజుల వ్యవధిలోనే దెబ్బతిన్న వైనం
 *  అతుకులతో కప్పిపెట్టే యత్నం
 
పుష్కర పనులు పురిట్లోనే పనికిరాకుండా  పోతున్నాయి. ఘాట్లు, అప్రోచ్‌రోడ్లు, తారు రోడ్లు, అంతర్గత రహదారులు నెలరోజులు కూడా గడవకముందే అధ్వానంగా మారాయి. వందల కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చుచేసి చేపట్టిన అనేక పనుల్లో నాణ్యత నాసిరకంగా ఉంది. 
 
కొల్లూరు: కృష్ణా పుష్కరాల సందర్భంగా ప్రభుత్వం హడావుడిగా చేపట్టిన అనేక పనుల్లో కాంట్రాక్టర్లు, అధికారులు నాణ్యతకు పాతరేశారు. ఏ మాత్రం ప్రమాణాలు పట్టించుకోకుండా పనులు చేయడం విమర్శలకు దారితీస్తోంది. అడుగేస్తేనే బీటీ రోడ్డు బెతెకలు కాలి వెంట లేసి వచ్చేలా ఉన్నాయంటే ఎలా చేశారో ఇట్టే  అర్థం చేసుకోవచ్చు. రూ. 3.3 కోట్లు వెచ్చించి చేపట్టిన రహదారి పనులు జరగుతుండగానే తారు బెతెకలు ఊyì పోవడం, నాణ్యతా లోపాలు బహిర్గతమయిన చోట గుత్తేదారు తిరిగి అతుకులు వేసినా పలితం కనిపించడంలేదు. అతుకులు వేసిన ప్రాంతంతో తిరిగి రహదారి ఛిద్రమవుతుండటం రహదారి మన్నికకు ప్రశ్నార్థకంగా మారింది. చెక్కుచెదరకుండా లక్షణంగా ఉన్న పాత రోడ్డును పెకిలించి పుష్కర నిధులతో నిర్మిస్తున్న రోడ్డులో నాణ్యతా ప్రమాణాల లోపం కారణంగా గుంటూరు, కృష్ణా జిల్లాలతో కలసి ఉన్న పది లంక గ్రామాల ప్రజలకు కొత్తగా నిర్మించిన రహదారి కన్నీటిని మిగుల్చుతోంది.
 
నాణ్యతకు తిలోదకాలు...
10.08 కిలోమీటర్ల పొడవున నిర్మించిన రహదారి పనులు ఎందుకూ పనికిరాకుండా పోయాయి. కొల్లూరు మండలంలోని పెసర్లంక నుంచి జిల్లాలోని వేమూరు, తెనాలి నియోజకవర్గ గ్రామాలు,  కృష్ణా జిల్లాలోని మరో రెండు గ్రామాలను కలుపుకుంటూ వెళ్లే  మార్గ నిర్మాణ పనులు నీటి పాలయ్యాయి. పుష్కరాలకు ముందు హడావిడిగా రోడ్డు పనులు జరుగుతుండగానే వేసిన రోడ్డు వేసినట్లు బీటలు వారి తారు బెతెకలు ఊడి మెటల్‌ బయట పడటం రహదారి నిర్మాణంలో పాటిస్తున్న నాణ్యతా ప్రమాణాల బాగోతం తేటతెల్లమైంది. కొల్లిపర మండలం అన్నవరపులంక, కృష్ణా జిల్లా కనిగిరిలంక వద్ద రహదారి నిర్మించి నాలుగు రోజులు గడకుండానే రోడ్డు అంచులు వెంబడి మొదలయ్యి రోడ్డు మొత్తం ఛిద్రమైపోవడం ఆరంభమైంది. 
 
చెక్కుచెదరని రోడ్డును పెకిలించారు..
గతంలో ఆరేళ్ళ కిందట  నిర్మించిన రహదారి చింతర్లంక, చిలుమూరులంక, అన్నవరపులంక ప్రాంతాల్లో కిలోమీటరున్నర మినహా ఎక్కడా చెక్కుచెదరకుండా లక్షణంగా ఉంది. సవ్యంగా ఉన్న రోడ్డును నూతన రోడ్డు పేరుతో పెకిలించేసి తూతూ మంత్రంగా ముగించడంపై ఆప్రాంత వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాణిజ్య పంటలకు నెలవైన ఈ ప్రాంతంలో ఈ మార్గం ద్వారా కంద, అరటి, పసుపు, వంటి వాణిజ్య పంటల తరలింపుకు అధిక బరువులతో వాహనాలు తిరగాల్సి ఉంది. సుమారు ఆరువేల మంది జనాభా నివసిస్తున్న లంక గ్రామాల్లో రవాణా సౌకర్యంకు ఏకైక ప్రధాన మార్గపు పనులు తీసికట్టుగా మారాయి. 
 
రెండు లేయర్లతో బీటీ రోడ్డు వేశాం..
రహదారి పనుల్లో ఎటువంటి లోపం తలెత్తకుండా పర్యవేక్షించాం. గ్రామాలున్నంత వరకూ రహదారి పాడవకుండా రెండులేయర్లతో బీటీ రోడ్డు ఏర్పాటు చేశాం. ప్రస్తుతం ఒకే లేయర్‌తో రోడ్డు నిర్మాణం జరిగిన ప్రాంతంలో రహదారి పాడవడానికి అవకాశం లేదు. రహదారిని పరిశీలించి తక్షణం లోపాలను సవరిస్తాం.
– మల్లికార్జునరావు, ఆర్‌ అండ్‌బీ డీఈ,  తెనాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement