‘తత్కాల్’ స్కాంకు చెక్‌.. 2.5 కోట్ల నకిలీ యూజర్‌ ఐడీలు డియాక్టివేట్‌ | IRCTC Flags 2 5 Crore Fake IDs as Cracks Down on Tatkal Ticket Scam | Sakshi
Sakshi News home page

‘తత్కాల్’ స్కాంకు చెక్‌.. 2.5 కోట్ల నకిలీ యూజర్‌ ఐడీలు డియాక్టివేట్‌

Jun 4 2025 7:53 PM | Updated on Jun 4 2025 8:06 PM

IRCTC Flags 2 5 Crore Fake IDs as Cracks Down on Tatkal Ticket Scam

న్యూఢిల్లీ: మనదేశంలో ప్రతిరోజూ ఉదయం 10 గంటలకు లక్షలాది మంది  ఒక అసాధ్యమైన పనిని సాధ్యం చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. అదే.. ఇండియన్ రైల్వే(Indian Railways)కు చెందిన ఐఆర్‌సీటీసీ పోర్టల్ ద్వారా తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవడం. అత్యవసర ప్రయాణానికి పరిష్కారంగా భావించే ఈ సదుపాయం ఇప్పుడు డిజిటల్ తొక్కిసలాటకు దారితీసింది. చెల్లింపు గేట్‌వేలు క్రాష్ కావడం, అందుబాటులో ఉన్న సీట్లు సెకన్లలోనే మాయమైపోవడం మొదలైనవి ఇటీవలి కాలంలో సర్వ సాధారణంగా మారాయి.

దీనిని గుర్తించిన భారతీయ రైల్వే ఇందుకు గల మూలకారణాలను గుర్తించింది. బాట్‌లు, నకిలీ యూజర్ ఐడీలతో తత్కాల్‌ టిక్కెట్ల స్కాంనకు పాల్పడుతున్న  మోసగాళ్ల ఆటలకు చెక్‌ పెట్టేపనిలో పడింది. 2025 జనవరి- మే మధ్య కాలంలో తత్కాల్‌ బుకింగ్ విండోలు తెరిచిన ఐదు నిమిషాల్లోనే ప్రత్యక్షమవుతున్న 2.9 లక్షల అనుమానాస్పద పీఎన్‌ఆర్‌లను ఐఆర్‌సీటీసీ  గుర్తించింది. పలువురు మోసగాళ్లు తత్కాల్‌ టిక్కెట్ల సదుపాయానికి తూట్లు పొడుస్తున్నారని గమనించింది. ఈ నేపధ్యంలో రైల్వేశాఖ కఠినమైన చర్యలు చేపడుతూ, 2.5 కోట్ల నకిలీ యూజర్‌ ఐడీలను డియాక్టివేట్‌ చేసింది. మరో 20 లక్షలను ఐడీలను రీవాలిడేషన్‌ జాబితాలో ఉంచింది.

మోసగాళ్లు నకిలీ చిరుమాలతో కూడిన ఈ మెయిల్ ఐడీ(Email ID)లను ఉపయోగించి, ఐఆర్‌సీటీసీ తనిఖీల నుంచి తప్పించుకునేందుకు లేక్కలేనన్ని నకిలీ ఖాతాలను సృష్టించారు.ఈ విధంగా చిక్కిన మొత్తం 6,800 డొమైన్‌లను రైల్వే అధికారులు బ్లాక్ చేశారు. ఇటువంటి ఉదంతాలపై జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో 134 ఫిర్యాదులు నమోదయ్యాయి. లోకల్ సర్కిల్స్ సర్వే ప్రకారం తత్కాల్‌ టికెట్ల బ్లాక్ మార్కెట్ కారణంగా  73 శాతం మంది వినియోగదారులు మొదటి నిమిషంలోనే వెయిటింగ్‌ లిస్ట్‌లోకి చేరుతున్నారు. మరో 30 శాతం మంది తమ ప్రయత్నాలను  విరమించుకుని, ఏజెంట్ల వైపు మొగ్గు చూపుతున్నారని తేలింది.

ఐఆర్‌సీటీసీ తెలిపిన వివరాల ప్రకారం 2025, మే 22న ఉదయం 10 గంటలకు నిమిషానికి అత్యధికంగా 31,814 టిక్కెట్లు బుక్‌ అయ్యాయి. అయితే ఐఆర్‌సీటీసీ అధికారులు తత్కాల్‌ టిక్కెట్ల మోసగాళ్ల ఆటకట్టిన దరిమిలా 2024 అక్టోబర్‌- 2025 మే మధ్య జరిగిన తత్కాల్‌ టిక్కెట్ల బుకింగ్‌ సక్సెస్‌ నిష్ఫత్తి 43.1శాతం నుండి 62.2 శాతానికి  మెరుగుపడిందని మోసగాళ్ల ఆటలకు అడ్డుకట్ట పడిందని ఐఆర్‌సీటీసీ అధికారులు చెబుతున్నారు. 

ఇది కూడా చదవండి: కుల గణనపై కేంద్రం కీలక నిర్ణయం

Advertisement
 
Advertisement
Advertisement