సీఎం వద్దకు పంచెకట్టుతో వెళ్లిన పవన్

సీఎం వద్దకు పంచెకట్టుతో వెళ్లిన పవన్ - Sakshi


జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో భేటీ అయ్యేందుకు విజయవాడ వెళ్లారు. గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరిన పవన్ కళ్యాణ్‌తో పాటు రాష్ట్ర మంత్రి కామినేని శ్రీనివాస్ కూడా ఉన్నారు. సంప్రదాయ రీతిలో పంచెకట్టుతో పవన్ బయల్దేరారు. రైతులపై సానుభూతితోనే తాను విజయవాడ వెళ్తున్నట్లు శంషాబాద్ విమానాశ్రయంలో విలేకరులతో పవన్ చెప్పారు. ఉదయం 11.15 గంటల ప్రాంతంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయన.. అక్కడి నుంచి కారులో బయల్దేరి, విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయమైన లింగమనేని గెస్ట్‌హౌస్‌కు 11.45 గంటల ప్రాంతంలో చేరుకుని అక్కడ సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఇద్దరి మధ్య దాదాపు గంట సేపటి వరకు సమావేశం జరుగుతుందని చెబుతున్నారు. పవన్ రాక సందర్భంగా గన్నవరం విమానాశ్రయం వద్ద భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. పవన్ కోసం భారీ సంఖ్యలో రైతులు గన్నవరం విమానాశ్రయం వద్దకు చేరుకున్నారు. అయితే ఆయన మాత్రం వారిని ఎవరినీ పట్టించుకోకుండా నేరుగా కారులో విజయవాడ సీఎం క్యాంపు కార్యాలయానికి బయల్దేరారు.వీరిద్దరి మధ్య రాజధాని భూసేకరణ, అమరావతి నిర్మాణం, జీహెచ్ఎంసీ ఎన్నికలు తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి కూడా చర్చించే అవకాశం ఉంది. గతంలో ఆగస్టు నెలలో ఈ అంశంపై పవన్ వరుసగా ట్వీట్లు చేశారు. ఆ తర్వాత మాత్రం దీని గురించి పెద్దగా మాట్లాడలేదు. ఏపీ రాజధాని అమరావతి నగర శంకుస్థాపన కార్యక్రమానికి కూడా పవన్ హాజరు కాలేదు. సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ కోసం తాను గుజరాత్ వెళ్లినట్లు అప్పట్లో చెప్పారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags:  

Read also in:
Back to Top