ఉల్లి రైతు..కంటతడి | onion farmer tears | Sakshi
Sakshi News home page

ఉల్లి రైతు..కంటతడి

Aug 30 2017 10:42 PM | Updated on Sep 17 2017 6:09 PM

ఉల్లి రైతు..కంటతడి

ఉల్లి రైతు..కంటతడి

కొద్దిరోజుల క్రితం మురిపించిన ఉల్లి.. ఇప్పుడు మళ్లీ కన్నీరు పెట్టిస్తోంది

- మళ్లీ ధర పతనం
- క్వింటాల్‌ రూ.2 వేలలోపు పడిపోయిన వైనం
-అమ్ముకోలేక, ఉంచుకోలేక రైతుల అవస్థలు
-గత ఏడాదిలాగే నష్టాలు తప్పవేమోనని ఆందోళన
- పొలాల్లోనే మురుగుతున్న పంట
 
కొద్దిరోజుల క్రితం మురిపించిన ఉల్లి.. ఇప్పుడు మళ్లీ కన్నీరు పెట్టిస్తోంది. ఉన్నట్టుండి ధర పతనం అవుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటను అమ్ముకోలేక, అలాగని నిల్వ చేసుకోలేక అవస్థ పడుతున్నారు. కొందరు మాత్రం పొలాల్లోనే ఆరబెడుతున్నారు. మరికొందరు ధర మరింత పతనం అవుతుందేమోనన్న భయంతో అయినకాడికి అమ్మేసుకుంటున్నారు. ప్రస్తుత ధర ఏమాత్రమూ గిట్టుబాటు కావడం లేదని వారు వాపోతున్నారు.
 
 
కోడుమూరు రూరల్‌ : మార్కెట్‌లో రోజురోజుకూ పతనమవుతున్న ఉల్లి ధర రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రూ.వేలకు వేలు పెట్టుబడులు పెట్టి పంట సాగు చేస్తే.. తీరా దిగుబడి వచ్చే సమయానికి ధర పడిపోతోంది. గత ఏడాది ఉల్లికి ఏమాత్రమూ ధర లేక  రైతులంతా తీవ్ర నష్టాలపాలయ్యారు. అప్పట్లో క్వింటాల్‌ రూ.200 కూడా అమ్ముడుపోకపోవడంతో చాలామంది పంటను మార్కెట్లలోనే వదిలేసి వచ్చారు. దారి ఖర్చులకు కూడా అప్పు చేసి తిరిగిరావాల్సి వచ్చింది. మరికొందరు పంట తొలగించకుండా పొలాల్లోనే వదిలేశారు. కనీసం ఈసారైనా మంచి ధర వస్తుందని ఆశించారు. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా 6,796 ఎకరాల్లో పంట సాగు చేశారు.
 
గోనెగండ్ల, కోడుమూరు, మిడుతూరు, జూపాడుబంగ్లా, డోన్‌, ఆస్పరి, ప్యాపిలి మండలాల్లో ఎక్కువగా వేశారు. కోడుమూరు నియోజకవర్గంలోని కోడుమూరు, గూడూరు, సి.బెళగల్‌ మండలాల్లో 1,274 ఎకరాల్లో పంట సాగైంది. ప్రస్తుతం దిగుబడులు వస్తున్నాయి. ఇదే సమయంలో ధర పతనం అవుతుండడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. క్వింటాల్‌ రూ.2,500 నుంచి రూ.3 వేల వరకు అమ్ముడుపోతేగానీ రైతులకు గిట్టుబాటు కాదు. 20 రోజుల క్రితం ఈ మేరకు ధర పలికింది. అప్పట్లో అమ్ముకున్న వారు లాభపడ్డారు. తర్వాత ధర పడిపోతూ వస్తోంది. ప్రస్తుతం రూ.2 వేలలోపే ఉండడంతో రైతులకు దిక్కుతోచడం లేదు. ధర పెరుగుతుందన్న ఆశతో చాలామంది పంటను తొలగించి పొలాల్లోనే ఉంచుకుంటున్నారు. మరికొందరు పొలం గట్ల వెంట ఉల్లిగడ్డలను కుప్పలుగా ఆరబోసుకుని ధర కోసం ఎదురుచూస్తున్నారు. అయితే.. ధర పెరగకపోగా మరింత దిగజారుతుండడంతో ఉల్లిని ఎక్కువకాలం ఉంచితే కుళ్లిపోయే ప్రమాదముందని ఆందోళన చెందుతున్నారు.
 
ఎకరాకు రూ.60 వేల దాకా పెట్టుబడి
ఉల్లి పంట సాగుకు రైతులు ఎకరాకు రూ.60 వేల దాకా పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. ఉల్లి నారుకు రూ.10 వేలు, నాటేందుకు రూ.6-8 వేలు, పురుగు మందులు, ఎరువులకు రూ.10 వేలు, సేద్యం, కలుపుతీతకు రూ.15 వేలు, పంట కోతకు రూ.12 వేల చొప్పున వెచ్చించాల్సి వస్తోంది. పంట బాగా పండితే 60-70 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. క్వింటాల్‌ రూ.2,500లకు పైగా అమ్ముడుపోతేనే రైతులు లాభపడతారు. ఈసారి వర్షాభావం కారణంగా ఉల్లిగడ్డలు సరైన సైజులో ఊరలేదు. దీనివల్ల ఆశించిన దిగుబడి రావడం లేదు. దీనికితోడు ధర కూడా తగ్గిపోతుండడంతో రైతులు నష్టపోవాల్సి వస్తోంది. ప్రభుత్వం ఎగుమతులకు అవకాశం ఇవ్వకపోవడంతోనే ఉల్లి ధర తగ్గుతోందని, వెంటనే స్పందించి మద్దతు ధర కల్పించాలని వారు  కోరుతున్నారు. 
 
పెట్టుబడికి సరిపోయింది - పాండురంగడు,  కల్లపరి
ఎకరన్నర విస్తీర్ణంలో ఉల్లి సాగు చేశా. తీరా దిగుబడి వచ్చే సమయంలో ధర తగ్గిపోయింది. క్వింటాల్‌ రూ.1,400 ప్రకారం అమ్ముకున్నా. వచ్చిన డబ్బు పంట పెట్టుబడులకే సరిపోయింది. మా కష్టమంతా నేలపాలైంది. 
 
  పంటంతా పొలంలోనే పెట్టుకున్నా - రాముడు, వర్కూరు
 ఎకరా పొలంలో ఉల్లి  సాగు చేశా. పంట వచ్చే సమయానికి ధర లేకుండా పోయింది. ప్రస్తుతమున్న ధరకు అమ్మితే పెట్టుబడి కూడా వచ్చేటట్లు లేదు. తొలగించిన ఉల్లి పంటనంతా రెండు వారాల నుంచి పొలంలోనే పెట్టుకున్నా. ధర కోసం ఎదురు చూస్తున్నా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement