ఒకే ఒక్కడు.! | one teacher of 140 students | Sakshi
Sakshi News home page

ఒకే ఒక్కడు.!

Jun 16 2017 10:15 PM | Updated on Sep 5 2017 1:47 PM

ఒకే ఒక్కడు.!

ఒకే ఒక్కడు.!

పెనుకొండ మండలంలోని రాంపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆరు నుంచి పదో తరగతి వరకూ 140 మంది విద్యార్థులకు కలిపి ఒక్కడే ఉపాధ్యాయుడు ఉన్నారు.

140 మంది విద్యార్థులకు ఒక్క ఉపాధ్యాయుడు

పెనుకొండ రూరల్ : పెనుకొండ మండలంలోని రాంపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆరు నుంచి పదో తరగతి వరకూ 140 మంది విద్యార్థులకు కలిపి ఒక్కడే ఉపాధ్యాయుడు ఉన్నారు. దీంతో విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకమవుతోంది. గతంలో డిప్యూటేషన్లపై వచిచన ఎనిమిది ఉపాధ్యాయులు తిరిగి వారి యథాస్థానాలకు వెళ్లిపోయారు. ఈ పాఠశాలకు రాంపురం, కొండంపల్లి, హనుమప్పల్లి తదితర గ్రామాల నుంచి విద్యార్థులు వస్తుంటారు. పాఠశాలలో ఉపాధ్యాయులు లేకపోవడంతో ఈ ఏడాది విద్యార్థులను చేర్చేందుకు తల్లిదండ్రులు వెనుకంజ వేస్తున్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన వారికి ధ్రువీకరణ పత్రాలు అందజేయడంలోను, పాఠ్య పుస్తకాల పంపిణీలో, ఆరో తరగతిలో నూతన విద్యార్థులను చేర్చుకోవడంలో ఉన్న ఒక్క ఉపాధ్యాయుడు తలమునకలుగా ఉన్నారు. దీంతో పాఠ్యాంశాలు బోధించేవారు లేక విద్యార్థులు ఆటపాటలతో కాలం వెల్లదీస్తున్నారు.

మూత పడే ప్రమాదం ఉంది
ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అయితే ఈ పని చేయకుండా ఉపాధ్యాయుల కొరత చూపి పాఠశాలను మూత వేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇది చాలా బాధాకరం. ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలి.
- గోపాల్‌, విద్యా కమిటీ చైర్మన్‌, రాంపురం

ఆధికారులు స్పందించాలి
రోజూ పాఠశాలకు వచ్చి పోతున్నాం. పాఠాలు బోధించేందుకు టీచర్లు లేరు. ప్రైవేట్‌ పాఠశాలలో చదివించేందుకు మా తల్లిదండ్రుల వద్ద డబ్బు లేదు. మా పరిస్థితిని అధికారులు అర్థం చేసుకోవాలి. ఉపాధ్యాయులను నియమిస్తే మాకు చదువుకునేందుకు వీలవుతుంది. లేకపోతే ఇంటి వద్ద పనులు చేయాల్సి వస్తుంది.
- సంధ్య, 9వ తరగతి, రాంపురం

పిల్లలను చేర్చేందుకు భయపడుతున్నారు
ఉపాధ్యాయులు లేకపోవడంతో పాఠశాలలో పిల్లలను చేర్చేందుకు తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఉపాధ్యాయ బదిలీలు జరిగేంత వరకూ గతంలో డిప్యూటేషన్‌పై పనిచేసిన వారిని అలాగే కొనసాగించి ఉంటే బాగుండు. లేకపోతే పాఠ్యాంశాలలో విద్యార్థులు రెండు నెలలు వెనుకబడే ప్రమాదముంది.
- మహీధర్‌, ప్రధానోపాధ్యాయుడు, జెడ్పీ ఉన్నత పాఠశాల, రాంపురం

Advertisement
 
Advertisement
Advertisement